జాతీయ గీతం వివాదం వెనుక.. | behind national anthem controversy | Sakshi
Sakshi News home page

జాతీయ గీతం వివాదం వెనుక..

Jul 10 2015 10:14 AM | Updated on Sep 3 2017 5:15 AM

జాతీయ గీతం వివాదం వెనుక..

జాతీయ గీతం వివాదం వెనుక..

‘జన గణ మన అధినాయక జయ హే’ అనే జాతీయ గీతంపై మళ్లీ వివాదం రేగింది.

న్యూఢిల్లీ: ‘జన గణ మన అధినాయక జయ హే’ అనే జాతీయ గీతంపై మళ్లీ వివాదం రేగింది. రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఈ గీతంలో ‘అధినాయక జయ హే’ అన్న చరణాన్ని మార్చాలని డిమాండ్ చేయడంతో ఈ గీతం పూర్వాపరాల్లోకి వెళ్లి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ గీతంపై వివాదం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. వందేళ్ల క్రితమే వివాదం మొదలైంది. భారత పర్యటనకు వచ్చిన కింగ్ జార్జ్-5 గౌరవార్థం కోల్‌కతలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 1911, డిసెంబర్ 27వ తేదీన ఓ భారీ సదస్సును ఏర్పాటు చేసింది.

 

ఆ సదస్సు సాధారణ దేవుడి ప్రార్థనాగీతంతో ప్రారంభమైంది. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘జన గణ మన అధినాయక జయ హే’ అన్న గీతాన్ని తొలిసారిగా బాలబాలికలు ఆలపించారు. అనంతరం ఐదవ కింగ్ జార్జ్‌ను సన్మానించి ఓ తీర్మానాన్ని ఆమోదించారు. చివరను కింగ్ జార్జ్‌ను ప్రశంసిస్తూ రాంభూజ్ చౌదరి రాసిన హిందీ గీతాన్ని ఆలపించారు. దీన్ని ఆంగ్లో-ఇండియా ప్రెస్ తప్పుగా కవర్ చేయడం వివాదానికి దారితీసింది.

‘బ్రిటిష్ ఎంపరర్ గౌరవార్థం రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రత్యేకంగా రాసిన గీతాలాపనతో సదస్సు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి-ది ఇంగ్లీష్‌మేన్, డిసెంబర్ 28, 1911’.
 
‘ఎంపరర్‌కు స్వాగతం చెబుతూ బెంగాల్ కవి ఠాగూర్ రాసిన గీతాలాపనతో సదస్సు ప్రారంభమైంది-ది స్టేట్స్‌మేన్, డిసెంబర్ 28, 1911’.


ఇలాంటి కథనాలు ఆ తర్వాత ఠాగూర్ రాసిన జాతీయ గీతంపై వివాదానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఠాగూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఠాగూర్ ఆధ్వర్యంలో నడుస్తున్న శాంతినికేతన్ పాఠశాలలో పిల్లలను చదివించకూడదంటూ కూడా ఆదేశాలు జారి చేసింది. 1930లో మళ్లీ దీనిపై వివాదం రేగింది. బంకిం చంద్ర ఛటర్జీ రాసిన ‘వందేమాతరం’ను జాతీయ గీతంగా ఎంపిక చేద్దామంటూ కాంగ్రెస్‌లోని ఒక వర్గం పట్టుబట్టడంతో ఈ వివాదం ఏర్పడింది. అయితే వందేమాతరం గీతంలో దేశాన్ని దుర్గాదేవితో పోల్చడం వల్ల అది ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందని (వారు అల్లాను తప్పించి మరొకరిని ప్రార్థించరు కాబట్టి) అభిప్రాయపడి ఠాగూర్ గీతం జోలికి వెళ్లలేదు.
 
ఠాగూర్ వివరణ
పులిన్ బిహారి సేన్‌కు ఠాగూర్ 1937, నవంబ ర్ 10వ తేదీన రాసిన లేఖలో తాను రాసిన జాతీయ గీతం గురించి ప్రస్తావించారు. తాను కింగ్ జార్జ్ ఐదు లేదా ఆరు రాజుల గురించి రాయలేదని, అంత టి దౌర్భగ్య పరిస్థితికి తాను ఎన్నడూ దిగజారబోనని స్పష్టం చేశారు. తాను అధినాయక్ అన్న పదా న్ని భారత దేశానికి, ఉద్యమానికి నాయకత్వం వహించే సారథి అనే అర్థంలోనే రాశానని వివరించారు.

ఒక్క చరణం చదివి విశ్లేషిస్తే ఇలాగే ఉంటుం దని, మొత్తం తాను రాసిన ఐదు చరణాలను చదివి, తన ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవాలని అన్నారు. ఠాగూర్ వ్యక్తిత్వం, సాహిత్యోద్యమం గురించి బాగా తెలిసిన వారు కూడా గీతంలో బ్రిటీష్ ఎంపరర్‌ను ప్రశంసిస్తూ రాయలేదని ఇప్పటికీ వాదిస్తారు. ఎప్పుడో సద్దు మణిగిందనుకున్న ఈ వివాదం బాబ్రీ మసీదుకు వ్యతిరేకంగా 1980 దశకంలో హిందుత్వ శక్తుల ఉద్యమంతో మళ్లీ రాజుకుంది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం వరకు కొనసాగింది. అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్‌కు కూడా ఈ వివాదం సుపరిచితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement