సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా డాక్టర్ భర్తను బండ బూతులు తిట్టారు. తాము కొనుగోలు చేసిన రూ.కోటి విలువైన భవనాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని ఆస్రాకంటి ఆసుపత్రి యాజమానులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, బంధువులే డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు.
దీంతో మహిళా డాక్టర్ భర్త షరీఫ్‌కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. తనపైనే విమర్శలా అంటూ అసభ్యంగా మాట్లాడారు. మైనారిటీ దంపతులను అసభ్యంగా దూషించారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో వైరల్‌గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యే ఆడియోపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
కాగా, ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఆయనకు కేటాయించిన గన్‌మెన్ షేక్షావలిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతపురం నగరంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ నిర్వాహకులను గన్‌మెన్ షేక్షావలి, ఎమ్మెల్యే అనుచరులు కలిసి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. డబ్బు ఇవ్వకపోవడంతో నిర్వాహకులపై దాడి చేసినట్లు సమాచారం. ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే గన్‌మెన్‌తో పాటు కొంతమంది టీడీపీ నేతలు దాడి చేసినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఘటనపై ఎస్పీ జగదీష్ వెంటనే స్పందించి, గన్‌మెన్ షేక్షావలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా కార్యక్రమాల్లో భద్రత కోసం నియమించిన గన్‌మెన్ ఇలాంటి చర్యలకు పాల్పడటం తీవ్రంగా ఖండించబడింది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాంపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


