బర్ధన్ అస్తమయం

బర్ధన్ అస్తమయం - Sakshi


ఢిల్లీలో కన్నుమూసిన సీపీఐ సీనియర్ నేత

♦ గత నెల ఏడవ తేదీన బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రికి బర్ధన్

♦ అప్పటి నుంచీ కోమాలో ఉన్న కమ్యూనిస్టు నేతకు చికిత్స

♦ పరిస్థితి విషమించటంతో కన్నుమూసిన నేత

♦ రేపు ఢిల్లీలో అంత్యక్రియలు: కమ్యూనిస్టు పార్టీ ప్రకటన

♦ పేదల కోసం నిస్వార్థంగా కృషి చేసిన నేతను

♦ కోల్పోయాం: మోదీ, సోనియా సంతాపాలు

 

 న్యూఢిల్లీ: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సీనియర్ నాయకుడు ఎ.బి.బర్ధన్ శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. సంక్షుభిత సంకీర్ణ రాజకీయాల శకంలో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా పార్టీని సమర్థవంతంగా నడిపించిన బర్ధన్.. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయానికి సోమవారం (4వ తేదీ)న అంత్యక్రియలు జరుగుతాయని సీపీఐ ఒక ప్రకటనలో తెలిపింది.



 ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయంలో నివసిస్తున్న బర్ధన్ గత నెల 7వ తేదీన మధ్య మెదడు నాడిలో పూడిక కారణంగా పక్షవాత పోటు (బ్రెయిన్ స్ట్రోక్)కు గురవటంతో ఆయనను జి.బి.పంత్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బర్ధన్‌కు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఆయన సొంతంగా శ్వాస తీసుకోగలగటంతో వెంటిలేటర్‌ను తొలగించారు. కానీ.. శనివారం ఆయన రక్తపోటు స్థాయి తీవ్రంగా పడిపోవటంతో పరిస్థితి విషమించిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తొలుత వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి శనివారం రాత్రి 8:20 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రిలోని న్యూరాలజీ విభాగం డెరైక్టర్ డాక్టర్ వినోద్‌పూరి తెలిపారు. బర్ధన్‌కు కుమారుడు అశోక్ (కాలిఫోర్నియా యూనివర్సిటీలో అర్థశాస్త్ర బోధకుడు), కుమార్తె అల్కా (అహ్మదాబాద్‌లో వైద్యురాలు) ఉన్నారు. ఆయన భార్య నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసే వారు. ఆమె 1986 లో చనిపోయారు.



 సంకీర్ణ శకంలో కీలక పాత్ర...

 1957లో ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించిన బర్ధన్.. అదే ఏడాది మహారాష్ట్ర శాసనసభకు నాగ్‌పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1967, 1980 సంవత్సరాల్లో విదర్భ నుంచి పార్లమెంటుకు పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. 1990ల్లో ఢిల్లీ రాజకీయాల్లోకి వచ్చిన బర్ధన్.. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1996లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా.. ఇంద్రజిత్‌గుప్తా నుంచి బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర మూడో కూటమితో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో.. సీపీఎం కురువృద్ధుడు హరికిషన్‌సింగ్‌సూర్జిత్‌తో కలిసి, బర్ధన్ కీలక పాత్ర పోషించారు.



ఆ ప్రభుత్వంలో సీపీఐ చేరటంలోనూ బర్ధన్ పాత్ర కీలకమైనది. ఆ సర్కారులో ఇంద్రజిత్‌గుప్తా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతర కాలంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ-1 ప్రభుత్వం ఏర్పడటంలోనూ దానికి వెలుపలి నుంచి మద్దతు ఇవ్వటం ద్వారా సూర్జిత్, బర్ధన్‌లు కీలక పాత్ర పోషించారు. పదహారేళ్ల పాటు వరుసగా నాలుగు పర్యాయాలు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన బర్ధన్.. 2012లో ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత కూడా పార్టీ సభ్యులకు మార్గదర్శనం కొనసాగించారు.

 

శ్రామిక జన పక్షపాతి బర్ధన్

 వైఎస్ జగన్ సంతాపం

 సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీ కురువృద్ధుడు ఏబీ బర్ధన్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సమ సమాజ స్థాపన, కార్మిక, అట్టడుగు వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా సుదీర్ఘ కాలం పోరాడిన యోధుడు బర్ధన్ అని కొనియాడారు. సమస్య ఏదైనా ముక్కుసూటిగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో విలువలు కలిగిన పోరాట యోధుడిగా బర్ధన్‌ను అభివర్ణించారు. ఆయన మరణం భారత రాజకీయ వ్యవస్థకే తీరని లోటని అన్నారు. బర్ధన్ కుటుంబసభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

 

 ఏబీ బర్ధన్ మృతిపై నేతల సంతాపం

 సాక్షి, విజయవాడ బ్యూరో: సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్ధన్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి. ఈ మేరకు సీపీఎం ఏపీ కార్యదర్శి పి.మధు, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ, ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శనివారం వేర్వేరుగా సంతాప ప్రకటనలు విడుదల చేశారు. కమ్యూనిస్టు ఉద్యమానికి బర్ధన్ చేసిన సేవలు మరువ లేనివని పి.మధు పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ సారథి బర్ధన్ లేనిలోటు పూడ్చలేనిదని కె.రామకృష్ణ తెలిపారు. బర్ధన్ నేటి తరం రాజకీయ నాయకులకు, రానున్న తరానికి ఆదర్శప్రాయుడని పీసీపీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి కొనియాడారు.

 

 మూడు ఉద్యమాలకు చివరి వారధి...

 స్వాతంత్య్రోద్యమంలో.. కార్మికోద్యమంలో.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించటంతో పాటు.. ఆ మూడిటికీ వారధిగా ఉన్న చిట్టచివరి నేత బర్ధన్. వామపక్ష ఉద్యమం చవిచూసిన ఎత్తుపల్లాలకు ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆయన పూర్తి పేరు అర్ధేంద్రు భూషణ్ బర్ధన్. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న సిల్హెట్‌లో 1925 సెప్టెంబర్ 25న జన్మించారు. 1940ల్లో స్వాతంత్య్రోద్యమ కాలంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య నేతగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించారు. కమ్యూనిస్టు రాజకీయాలకు ఆకర్షితుడై సీపీఐలో చేరారు. ఆయన 20 పర్యాయాలకు పైగా అరెస్టయ్యారు. నాలుగేళ్లకు పైగా జైలులో గడిపారు. అనంతరం.. మహారాష్ట్రలో కార్మిక సంఘాల బాధ్యతలను పార్టీ ఆయనకు అప్పగించింది. అక్కడ కార్మిక నేతగా ఆయన ప్రతిష్ట ఎంతో ఇనుమడించింది. ఆ తర్వాత.. దేశంలో అతి పురాతనమైన ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎదిగారు.

 

 నిర్మొహమాటి... నిబద్ధత గల నేత...

 నిర్మొహమాటంగా మాట్లాడేతత్వం.. నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత.. బర్ధన్‌ను రాజకీయాలకతీతంగా అందరికీ సన్నిహితుడిని చేసింది. అప్పటివరకూ కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న పశ్చిమబెంగాల్‌లో 2011లో తృణమూల్ కాంగ్రెస్ చేతిలో లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోయినపుడు.. ‘మీరు మారండి.. లేదంటే మీ పని అయిపోయినట్టే’నని కమ్యూనిస్టు నేతలను హెచ్చరించారు. 1996లో ప్రధానమంత్రి పదవిని కమ్యూనిస్టులు అంగీకరించకపోవటం చారిత్రక తప్పిదమన్న మార్క్సిస్టు నేత జ్యోతిబసు మాట వాస్తవమని బర్ధన్ ఉద్ఘాటించారు. ‘కమ్యూనిస్టు రాజకీయాలు భిన్నమైనవని దేశ ప్రజలకు చూపించటానికి వచ్చిన అవకాశం అది. అది కోల్పోయిన అవకాశం. పెట్టుబడిదారీ వ్యవస్థ పరిమితుల్లోనైనా సరే ఆ ప్రయత్నం చేసి తీరాల్సింది’ అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆత్మకథ గురించి విలేకరులు ప్రశ్నించినపుడు.. ‘ఆత్మకథ అనేది స్వీయ అభినందనకు, పరులను నిందించటానికి ఉద్దేశించినది. నేను రాయను’ అని బర్ధన్ బదులిచ్చారు.

 

 పేదల కోసం పోరాడిన నాయకుడిని కోల్పోయాం: ప్రముఖుల సంతాపాలు

 ‘బర్ధన్ తన సిద్ధాంతాలు, నియమాలకు పూర్తిగా అంకితమైన ఒక ... కమ్యూనిస్టు నేతగా ఎల్లప్పుడూ గుర్తుంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ ప్రధానమంత్రి నరేం ద్రమోదీ నివాళులర్పించారు. బర్ధన్ అస్తమయంతో సీపీఐ మాత్రమే కాదు.. తన జీవితమంతా పేదలు, అణగారిన వర్గాల కోసం కృషిచేసిన ఒక మహానాయకుడిని దేశం కోల్పోయింది’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారు. ‘రెడ్ సాల్యూట్ కామ్రేడ్ బర్ధన్. మీ మేధస్సు, అనుభవం, మార్గదర్శకత్వం మాకు లోలుగానే ఉంటుంది’ అంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విటర్‌లో వ్యాఖ్యల ద్వారా బర్ధన్‌కు నివాళులర్పించారు.



బర్ధన్ మృతి భారత రాజకీయాలకు తీరని నష్టమని బీజేపీ నేత, కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ట్విటర్‌లో సంతాపం తెలిపారు. ‘సాధారణ ప్రజల కోసం నిరంతరం పోరాటం సాగించిన వామపక్ష మహానాయకుడు ఆయన’ అంటూ జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్ నివాళులర్పించారు. తాను పన్నెండేళ్ల వయసులో తొలిసారి బర్ధన్ ప్రసంగాన్ని విన్నానని.. రాజకీయాల్లో చేరిన తర్వాత ఆయనతో సుదీర్ఘ సంబంధం కొనసాగించానని పేర్కొన్నారు. బర్ధన్ గౌరవప్రదమైన రాజకీయాలకు, నిస్వార్థ సేవకు ప్రతిరూపమని తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత కొనియాడారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top