అధికారికంగా ప్రకటించకున్నా నేతలు ఆ పనే చేశారు
ఏకపక్షంగా కాల్పుల విరమణే అందుకు ఉదాహరణ
ప్రాణభీతితోనే మల్లోజుల, ఆశన్న, చంద్రన్న లొంగుబాటు
ఈస్టర్న్ రీజినల్ బ్యూరో ఘాటు లేఖ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ముందు అనధికారికంగా సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ కమిటీ లొంగిపోయినట్టేనని ఆ పార్టీ ఈస్టర్న్ రీజినల్ బ్యూరో ఘాటైన విమర్శలు చేసింది.
ఈ నెల 5న విడుదలైన లేఖలో తెలంగాణ కమిటీతోపాటు సెంట్రల్ రీజినల్ బ్యూరోకు చెందిన నేతల తీరును ఈస్టర్న్ కమిటీ తప్పుపట్టింది. తొలి విడత కాల్పుల విరమణ వల్ల సానుకూల ఫలితాలు రాకున్నా, పార్టీలో అంతర్గత చర్చ జరపకుండా, ఇతర బ్యూరోల అభిప్రాయం కోరకుండా ఏకపక్షంగా మరో ఆరునెలలు తెలంగాణ కమిటీ తరఫున జగన్ పేరుతో కాల్పుల విరమణ ప్రకటించడం ఏమిటని ప్రశ్నించింది.
తీవ్ర నష్టం చేశారు..: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్‌తో కలిగిన ప్రాణభీతి వల్లే సెంట్రల్ రీజినల్ బ్యూరో(ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా)కు చెందిన అగ్రనేతలు లొంగిపోయారంటూ ఈఆర్‌బీ ఆరోపించింది. ఆయుధాలు అప్పగించి కొందరు, ఆయుధాలు అప్పగించకుండా మరికొందరు లొంగిపోవడంతో పార్టీకి భారీ నష్టం జరిగిందని పేర్కొంది.
కేవలం తమ ప్రాణాలు కాపాడుకోవడానికే సోను (మల్లోజుల వేణుగోపాల్), సతీశ్ (తక్కళ్లపల్లి వాసుదేవరావు), చంద్రన్నతోపాటు ఎస్‌జెడ్‌సీ, డీవీజీఎం స్థాయి నేతలు, వారి వెంట కేడర్ లొంగిపోయారని విమర్శించింది. సాయుధ విప్లవ పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమని, ఇలాంటి ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొని, ఎన్నో త్యాగాలు చేయడంతోనే పార్టీ ఇప్పటికీ నిలిచి ఉందని పేర్కొంది.
జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు విప్లవానికి అనుకూలంగా మారుతున్నాయని ఈస్టర్న్ బ్యూరో అభిప్రాయపడింది. సెంట్రల్ రీజినల్ బ్యూరో (దండకారణ్యం)లో ఇప్పటికీ నిలిచిన లీడర్లు, కేడర్ విప్లవ పోరాటానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చింది.
లేఖ ‘ఈస్టర్న్’ మిసిర్ బెహ్రాదే..: మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్‌గా నంబాల కేశవరావు బతికి ఉన్నంత వరకు ముప్పాళ్ల లక్ష్మణరావు, మల్లోజుల వేణుగోపాల్, తిప్పి రి తిరుపతి, మిసిర్ బెహ్రా పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్నారు. ఇందులో మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల ఆయుధాలతో సహా లొంగిపోయాడు. తిప్పిరి తిరుపతి సాయుధ పోరాట పంథావైపు ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో ఆది నుంచీ ముప్పాళ్లది సాయుధ పోరాట పంథానే, మిగిలిన మిసిర్ బెహ్రా స్పందన ఏమిటనేది ఇంత కాలం సస్పెన్స్‌గా ఉంది.
తాజాగా ఈస్టర్న్ రీజినల్ బ్యూరో పేరుతో వచ్చిన లేఖను మిసిర్ బెహ్రానే జారీ చేసినట్టు ఆ పార్టీ సానుభూతిపరులు అంచనా వేస్తున్నారు. దీంతో పార్టీ నాయకత్వంలో అగ్రభాగా న ఉండే పొలిట్‌బ్యూరో మెజార్టీ నాయకత్వం సాయుధ పోరా ట పంథానే ఎంచుకుందని తెలుస్తోంది. లొంగుబాట్లకు పార్టీ అగ్రనాయకత్వం అనుకూలంగా లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటి వరకు పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచి్చన తెలంగాణ/ఏపీ నాయకత్వానికి తాజా పరిణామాల వల్ల సవాల్ ఎదురవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.


