
చండీగఢ్ : ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లో 500 సంవత్సరాల శ్రీ గురు రవిదాస్ ఆలయం, సమాధి కూల్చివేతకు నిరసనగా మంగళవారం పంజాబ్ బంద్‌కు రాష్ట్రంలోని రవిదాసియా వర్గం పిలుపు ఇచ్చింది. బంద్ పిలుపుతో జలంధర్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. సమస్య పరిష్కారానికి శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్భీర్ సింగ్ బాదల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీ ఎల్జీ అనిల్ బైజల్‌తో తాము చర్చించామని, గురు రవిదాస్ ఆలయ కూల్చివేతపై తమ అసంతృప్తిని వెల్లడించగా, సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని ఆయన హామీ ఇచ్చారని బాదల్ ట్వీట్ చేశారు.
చారిత్రక ఆలయ కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నామని బాదల్ పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై ఆయన ఢిల్లీలో సీనియర్ నేతలతో సమావేశమయ్యారు.ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అకాలీదళ్ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఇది రవిదాస్ వర్గ మనోభావాలను గాయపరుస్తుందని అన్నారు. పార్టీ ప్రతినిధి బృందం త్వరలో హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈ వ్యవహారం తీవ్రతను ఆయన దృష్టికి తీసుకువెళతామని బాదల్ స్పష్టం చేశారు.