ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాపై అసదుద్దీన్‌ వ్యాఖ్యలు..

Asaduddin Owaisis Swipe At BJP  Sena Over Maha Politics - Sakshi

హైదరాబాద్‌ : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేనల మధ్య సాగుతున్న సంవాదంపై ఇరు పార్టీల తీరును ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ తప్పుపట్టారు. ఫిప్టీ ఫిఫ్టీ ఫార్ములాపై ఇరు పార్టీల మధ్య నెలకొన్న వివాదాన్ని ఎద్దేవా చేస్తూ మార్కెట్‌లో ఫిఫ్టీ-ఫిఫ్టీ పేరుతో కొత్త బిస్కట్‌ వచ్చిందా అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌ను బీజేపీ తోసిపుచ్చడంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలనే తపన బీజేపీ, శివసేనలకు లేదని, సతారాలో భారీ వర్షాలతో రైతాంగం దెబ్బతిన్నదని, అయినా ఇరు పార్టీలు ఫిఫ్టీ-ఫిఫ్టీ గురించి మాట్లాడుతున్నాయని హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ లేదా శివసేనలకు తమ పార్టీ మద్దతు ఇవ్వబోదని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం రెండు స్ధానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్‌ లేదా మరొకరు సీఎం అవుతారో తనకు తెలియదని, మ్యూజికల్‌ ఛైర్‌ కొనసాగుతోందని అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. శివసేనకు ఏం చేయాలో పాలుపోవడం లేదని, ఉద్ధవ్‌ ఠాక్రేకు ప్రధాని నరేంద్ర మోదీ భయం పట్టుకున‍్నట్టు కనిపిస్తోందని దుయ్యబట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top