పాక్‌కు ఎఫ్ఏటీఎఫ్ హెచ్చరిక.. స్పందించిన బిపిన్‌ రావత్‌

Army Chief Bipin Rawat Says Pakistan Under Pressure to Act Against Terrorists - Sakshi

న్యూఢిల్లీ: ఉగ్ర నిధుల ప్ర‌వాహాన్ని నియంత్రించాల‌ని పారిస్‌కు చెందిన ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్‌ను హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ అంశంపై భార‌త ఆర్మీ చీఫ్ బిపిన్ రావ‌త్ స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ అంశంపై స్పందిస్తూ.. ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయంతో పాకిస్తాన్‌పై ఒత్తిడి పెరిగింద‌న్నారు. ఇక ఆ దేశం తప్పనిసరిగా ఉగ్ర‌వాద నియంత్ర‌ణ‌కు చర్య‌లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. శాంతి స్థాప‌న నెల‌కొల్పేందుకు పాక్‌తో క‌లిసి ప‌నిచేస్తామ‌న్నారు. ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో ఉండ‌డం అంటే.. అది ఏ దేశానికైనా న‌ష్ట‌మే అన్నారు బిపిన్ రావ‌త్.

ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టడంలో పాకిస్తాన్ విఫలమవ్వడంతో ఎఫ్ఏటీఎఫ్ 2018లో గ్రేలిస్ట్‌లో చేర్చింది. మనీ లాండరింగ్‌ను అరికట్టడంలో, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడటం కోసం కఠిన చట్టాలను అమలు చేయడంలో విఫలమైన దేశాలను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చుతుందన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్‌కు ఫైనాన్షియల్ టాస్క్‌ఫోర్స్ గతంలో 27 పాయింట్లతో కూడిన యాక్షన్ ప్లాన్ సూచించింది. అందులో కేవలం ఐదింటిలో మాత్రమే పాక్ పనితీరు సంతృప్తికరంగా ఉండటంతో.. ఇమ్రాన్ సర్కార్‌కు తాజాగా నాలుగు నెలల గడువు ఇచ్చింది. గడువులోగా ఉగ్రవాదంపై సరైన చర్యలు తీసుకోకపోతే బ్లాక్ లిస్టులో ఉంచుతామని శుక్రవారం నాటి ప్రకటనలో హెచ్చరించింది. 2020 ఫిబ్రవరి వరకు సమయమిస్తున్నట్టు పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top