
ముంబై: ఈ ఏడాది మిస్ ఇండియాగా తమిళనాడుకు చెందిన కాలేజీ విద్యార్థిని అనుకృతి వాస్(19) ఎంపికైంది. మొదటి రన్నరప్‌గా హరియాణా యువతి మీనాక్షి చౌదరి(21), రెండో రన్నరప్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రేయారావు(23) నిలిచారు.మంగళవారం రాత్రి ముంబైలో జరిగిన అందాల పోటీలో క్రికెటర్లు కేఎల్ రాహుల్, ఇర్ఫాన్ పఠాన్, నటులు బాబీ డియోల్, మలైకా అరోరా, కునాల్ కపూర్, గతేడాది విజేత మానుషి ఛిల్లార్‌లతో కూడిన న్యాయ నిర్ణేతల బృందం ఈ మేరకు ఎంపిక చేసింది.
అనుకృతికి మానుషి ఛిల్లార్ కిరీటం తొడిగింది. అనువాదకురాలు కావాలనుకుంటున్న అనుకృతి చెన్నైలోని లయోలా కళాశాలలో బీఏ(ఫ్రెంచి) చదువుతోంది. ఆమెకు నాలుగేళ్ల వయసున్నప్పుడు తన తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె తల్లి సంరక్షణలోనే పెరిగింది. టాప్–3లో నిలిచిన అనుకృతి, మీనాక్షి, శ్రేయారావులకు సినీతారలు రకుల్ ప్రీత్‌సింగ్, పూజా హెగ్డే, పూజా చోప్రా, నేహా ధూపియా శిక్షణ ఇచ్చారు. ఇక, ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో జరగబోయే అందాల పోటీ(మిస్ వరల్డ్)లో భారత్‌కు అనుకృతి ప్రాతినిధ్యం వహించనుంది.