వాళ్ల జోలికి వెళ్తే..!

American tourist murdered in North Sentinel Island - Sakshi

ఇప్పటి వరకు సెంటినల్‌ దీవిలో అడుగుపెట్టిన వాళ్లు లేరు!

డబ్బులు వాడని.. దుస్తుల స్థానంలో ఆకులు చుట్టుకుని బతికే సెంటినలీస్‌లను సంప్రదించేందుకు సాధారణ మానవుడు ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. దండోపాయం మినహా సామ, దాన ఉపాయాలు అన్నీ వాడారు. అయినా ఇప్పటివరకూ వాళ్లు ఈ ట్రిక్కులకు లొంగింది లేదు!  దూరం నుంచి గమనించిన దాని ప్రకారం.. వీరికి పడవలు తయారు చేయడం వచ్చు. లోతు తక్కువ ఉన్న ప్రాంతాల్లో చేపలు పడతారు. ‘మా బతుకు మాది.. ఇందులో మీలాంటి వారి జోక్యం అవసరం లేదు’ అన్న వారి వైఖరి ఎంత బలమైందంటే.. 2004లో వచ్చిన సునామీతో సర్వం కోల్పోయినా.. భారత ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా జారవిడిచిన ఆహారాన్ని కూడా ముట్టుకోలేదు. అప్పట్లో దారి తప్పి ఆ దీవిలోకి అడుగు పెట్టిన ఇద్దరు జాలర్లను చంపేశారు. ఆ తరువాత భారత ప్రభుత్వం వీరి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. అప్పుడప్పుడూ కోస్ట్‌గార్డ్‌కు చెందిన పడవలు నార్త్‌ సెంటినెల్‌ ద్వీపం వద్ద కాసేపు లంగరేసి నిలబడతాయి..అంతే!

అటువైపుగా వెళ్తే తరిమికొట్టారు..
బ్రిటిష్‌ మిలటరీ 1880లో సెంటినలీస్‌పై దాడి చేసి వృద్ధ దంపతులు, నలుగురు సంతానాన్ని పోర్ట్‌బ్లెయిర్‌కు తీసుకొచ్చింది. కొన్ని రోజులకే దంపతులు చనిపోవడంతో ఆ సంతానాన్ని మళ్లీ అడవుల్లో వదిలేశారు.
► 1967లో టి.ఎన్‌.పండిట్‌ అనే పురాతత్వ శాస్త్రవేత్త సెంటినలీస్‌ను సంప్రదించే ప్రయత్నం చేస్తే.. వాళ్లు అడవుల్లోకి పారిపోయారు. ఆ తరువాత భారత నౌకాదళం ఈ దీవి సమీపంలో కొన్ని బహుమతులు విడిచిపెట్టి.. ఎవరైనా వాటిని తీసుకెళతారా అని వేచిచూసింది. కానీ వారు బాణాలు ఎక్కుపెట్టి అందరినీ తరిమేశారు.
 
► 1974లో నేషనల్‌ జియోగ్రఫిక్‌ చానల్‌ సిబ్బంది ఓ డాక్యుమెంటరీ తీద్దామని నార్త్‌ సెంటినలీస్‌ ద్వీపానికి వెళ్లారు. అల్యూమినియం పాత్రలు, కొబ్బరిబోండాలు, ఓ పందిని బహుమతులుగా తీసుకుని వెళ్లారు. తీరంలో అడుగుపెట్టారో లేదో.. వారిపై బాణాల వర్షం కురవడం మొదలైంది. బహుమతులన్నీ అక్కడే వదిలేసి పరుగు లంకించుకున్నారు. సెంటినలీస్‌లు కొబ్బరిబోండాలు, కొన్ని పాత్రలు తీసుకెళ్లారుగానీ, ఆ పందిని మాత్రం అక్కడికక్కడే చంపి పాతిపెట్టేశారు.  

► 1991లో టి.ఎన్‌.పండిట్‌ మరోసారి వారిని సంప్రదించే ప్రయత్నం చేసి పాక్షిక విజయం సాధించారు. కొంతమంది పండిట్‌ పడవలోకి ఎక్కడమే కాకుండా అక్కడున్న వస్తువులను ఆసక్తిగా తడిమి చూశారు.

►  ఆ తరువాత సెంటినలీస్‌లు అంటువ్యాధుల బారిన పడటంతో భారత ప్రభుత్వం వారి గురించి ఆరా తీయడానికి స్వస్తి పలికింది.
 

అండమాన్‌లో అమెరికన్‌ను బాణాలేసి చంపేశారు
న్యూఢిల్లీ: అండమాన్‌ నికోబార్‌లోని నార్త్‌ సెంటినల్‌ దీవిలో అమెరికా పర్యాటకుడు హత్యకు గురయ్యాడు. స్థానికంగా నివసించే సెంటినల్‌ ఆదిమ తెగకు చెందిన ప్రజలే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు బుధవారం వెల్లడించారు. నవంబర్‌ 17న జరిగిన ఈ ఘోరంలో మృతుడిని 27 ఏళ్ల జాన్‌ అలెన్‌ చౌగా గుర్తించారు. ఈ ఘటనలో హత్య కేసు నమోదుచేసిన పోలీసులు...అలెన్‌ను ఆ దీవికి తీసుకెళ్లిన ఏడుగురు మత్స్యకారుల్ని అరెస్ట్‌ చేశారు. తమ దీవిలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించిన అలెన్‌ను సెంటినల్‌ ప్రజలు బాణాలతో హత్య చేసి ఉంటారని, మృతదేహాన్ని ఇసుకలో పాతిపెట్టి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ తరువాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

మరోవైపు, అలెన్‌ కనిపించడం లేదని మాత్రమే అమెరికా కాన్సులేట్‌ ప్రకటించింది. గోప్యత కారణాల రీత్యా ఇంతకు మించి వెల్లడించలేమని తెలిపింది. అలెన్‌ ఇంతకు ముందు అండమాన్‌లో ఐదు సార్లు పర్యటించినట్లు పోర్ట్‌బ్లెయిర్‌కు చెందిన ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేని సెంటినల్‌ తెగ ప్రజలను కలిసేందుకు ఆయన ఆసక్తి చూపేవాడని వెల్లడించింది. చిదియాటాపు ప్రాంతంలో మత్స్యకారుల పడవను అద్దెకు తీసుకున్న అలెన్‌ నవంబర్‌ 16న నార్త్‌ సెంటినల్‌ దీవి సమీపానికి చేరుకున్నట్లు తెలిపింది.  

మత ప్రచారానికే వెళ్లాడా?
మతబోధకుడిగా పనిచేస్తున్న అలెన్‌.. తన మతం గురించి సెంటినలీస్‌కు వివరించేందుకు ఆ దీవి వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడని, వాళ్లు బాణాలతో దాడులు చేయడంతో అతడు మరణించాడని అండమాన్‌ షీఖా అనే పత్రిక ఒక వార్తను ప్రచురించింది. ‘నార్త్‌ సెంటినల్‌ దీవికి కొంతమంది జాలర్ల సాయంతో వెళ్లిన అలెన్‌ బీచ్‌లో నడుస్తుండగానే సెంటినలీస్‌ తెగ ప్రజలు బాణాలతో దాడులు చేశారు. అయితే అలెన్‌ వీటిని లెక్క జేయకుండా అలాగే ముందుకు వెళ్లసాగాడు. ఆ తరువాత సెంటినలీస్‌లు అలెన్‌ను చుట్టుముట్టి లాక్కెళ్లారు’’ అని ప్రముఖ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది. సెంటినలీస్‌లను చూసి భయపడ్డ జాలర్లు అక్కడి నుంచి పారిపోయారని.. మరుసటి రోజు ఉదయం వచ్చి చూస్తే అలెన్‌ శరీరం తీరంలో పడి ఉందని వివరించింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే నార్త్‌ సెంటినల్‌ దీవిలో విదేశీయులు పర్యటించేందుకు కేంద్రం ఇటీవలే అనుమతి ఇచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top