జడ్జీల నియామకం : ప్రధానికి న్యాయమూర్తి సంచలన లేఖ

Allahabad HC Judge Writes To PM - Sakshi

లక్నో : హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకంలో కులం, బంధుప్రీతి ప్రధాన అర్హతగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి రంగనాథ్‌ పాండే ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో న్యాయవ్యవస్ధ బంధుప్రీతి, కులతత్వంతో పెనవేసుకుపోవడం దురదృష్టకరమని, జడ్జీల కుటుంబ సభ్యులకు చెందిన వారు కచ్చితంగా తదుపరి న్యాయమూర్తి అవటం ఖాయమని లేఖలో ప్రస్తావించారు.

హైకోర్టు, సుప్రీంకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి పారదర్శకతతో కూడిన యంత్రాంగం లేదని దుయ్యబట్టారు. బంధుప్రీతి, కులమే ప్రధాన అజెండాగా మారిందని ప్రధానిక రాసిన లేఖలో పాండే ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీ గదుల్లో తేనీరు సేవిస్తూ సీనియర్‌ న్యాయమూర్తులు హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకం చేపడుతున్నారని, అత్యంత రహస్యంగా ఈ తంతును ముగిస్తుండటంతో మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాతే నూతన న్యాయమూర్తుల పేర్లు బహిర్గతమవుతున్నాయని చెప్పారు.

ఏ న్యాయమూర్తికి పదోన్నతి వచ్చిందో, అందుకు అవసరమైన ప్రాతిపదిక ఏమిటో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ను ఏర్పాటు చేస్తే న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో పారదర్శకత వస్తుందని, అయితే న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో సీనియర్‌ న్యాయమూర్తులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top