తేలియాడే పంటపొలాలు! | Agricultural floats | Sakshi
Sakshi News home page

తేలియాడే పంటపొలాలు!

May 28 2015 12:26 AM | Updated on Oct 4 2018 5:10 PM

తేలియాడే పంటపొలాలు! - Sakshi

తేలియాడే పంటపొలాలు!

ప్రపంచ జనాభా ఇప్పటికే 700 కోట్లు దాటిపోయింది. 2050 నాటికి 910 కోట్లకు చేరుకుంటుంది

ప్రపంచ జనాభా ఇప్పటికే 700 కోట్లు దాటిపోయింది. 2050 నాటికి 910 కోట్లకు చేరుకుంటుంది. జనాభా పెరుగుదల వల్ల ఆహార అవసరాలు కూడా అప్పటికి 70 శాతం పెరిగిపోతాయి. కానీ పరిస్థితి చూస్తే.. ఇప్పుడే కష్టంగా మారిపోయింది. ఓ పక్క ఆకలి కేకలు. మరోపక్క సాగుకు పంటభూములూ కరువయ్యే పరిస్థితి. మరి రేపెలా? అందుకే.. ‘తేలియాడే పంటపొలాలు’ అవసరం అంటున్నారు పరిశోధకులు...

సముద్రంపై మూడు, నాలుగు అంతస్తులతో కూడిన భారీ భవనాల్లాంటి నౌకలు తిరగడం మనకు తెలిసిందే. అయితే,  తేలియాడే పంటపొలాలు(ఫ్లోటింగ్ ఫామ్స్) కూడా దాదాపుగా అలాంటివే. కాకపోతే ఇవి ఒకేచోట స్థిరంగా తేలుతూంటాయి. డిజైన్‌లోనూ అచ్చం భారీ అపార్ట్‌మెంట్‌లలా ఉంటాయి. వీటిలో కింది భాగంలో చేపలను పట్టుకోవచ్చు. మధ్య భాగంలో పంటలు పండించుకోవచ్చు. పైకప్పుపై సౌర విద్యుత్‌నూ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఒకే చోట మూడు ప్రయోజనాలు! పైగా.. ఆకలితో అలమటించేవారు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడే ఈ పంట పొలాలను ఏర్పాటు చేసుకోవచ్చు! వాతావరణ మార్పులు, కరువు కాటకాల మాటే లేదు. అతివృష్టి, అనావృష్టిల దిగులే లేదు. సంవత్సరమంతా పంటలు పండించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆకలిని గణనీయంగా తీర్చవచ్చని భావిస్తున్న ఈ ‘స్మార్ట్ ఫ్లోటింగ్ ఫామ్’ కాన్సెప్ట్‌ను బార్సిలోనాకు చెందిన ‘ఫార్వర్డ్ థింకింగ్ అగ్రికల్చర్’ కంపెనీకి చెందిన జాకబ్ డైచా, జేవియర్ పోన్స్ అనే ఆర్కిటెక్ట్ రూపొందించారు. ఈ కాన్సెప్ట్‌లో పంటలను హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పండిస్తారు.

అంటే.. వీటికి మట్టి అవసరం ఉండదు. సముద్రంలోని ఉప్పునీటిని నిర్లవణీకర ణం చేసి, ఖనిజ పోషకాలతో కూడిన ఆ నీటినే పంటలకు ఉపయోగిస్తారు. ఒక్క ఫ్లోటింగ్ ఫామ్‌లో ఏటా 17 లక్షల చేపలను పట్టుకోవచ్చట. సుమారుగా 80.15 లక్షల కిలోల కాయగూరలు పండించుకోవచ్చట. ఈ ఫామ్ నిర్వహణకు అవసరమయ్యే కరెంటును సౌర విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేసుకోవచ్చు. మరి సముద్రం పోటెత్తితే ఈ ఫామ్ కొట్టుకుపోదా? అలలను అడ్డుకునేందుకు దీని కింది భాగంలో ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది కాబట్టి దీనికి ఎలాంటి ప్రమాదం వాటిల్లదని చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement