
కోల్‌కతా : ‘నగరం ఇకపై ఎవరికీ సురక్షితం కాదు’ అంటోంది బెంగాల్ టీవీ నటి జూహి సేన్‌గుప్తా. తన కుటుంబంతో సరదాగా బయటకు వెళ్లిన తనకు చేదు అనుభవం ఎదురవడంతో ఫేస్‌బుక్‌లో ఆమె ఈ కామెంట్ పెట్టారు. ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయటకు వెళ్లిన ఆమెకు రూబీ క్రాస్ సమీపంలోని పెంట్రోల్ బంకులో చేదు అనుభవం ఎదురైంది. ఆమె తండ్రిపై పెట్రోల్ బంకు సిబ్బంది దౌర్జన్యం చేశారు. రూ.1500 పెట్రోల్ కొట్టమంటే 3 వేల రూపాయలకు పెట్రోల్ పోశారని.. ఇదేమని అడిగిన తన తండ్రిపై దురుసుగా ప్రవర్తించారని జూహి ఆరోపించారు. పెద్దాయన అని కూడా చూడకుండా చేయి చేసుకుని, తమ కారు తాళం లాక్కున్నారని వాపోయారు.
ఈ ఘటన కాస్బా పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొవడంతో సమాచారం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. తాము ఘటన స్థలానికి చేరుకోవడాని కంటే ముందే సహనాన్ని కోల్పోయి పెంట్రోల్ బంకు సిబ్బందితో గొడవ పడినట్లు జూహి సేన్‌గుప్తా ఒప్పుకున్నట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. తర్వాత ఇరు వర్గాలను పోలీసు స్టేషన్‌కి పిలిచి మాట్లాడటంతో రాజీకి ఒప్పుకున్నారని, దీంతో ఈ ఘటనపై ఎలాంటి కెసు నమోదు చేయలేదని వెల్లడించారు.