
‘30 ఉగ్రవాద సంస్థలు ఒక్కటయ్యే కుట్ర’
భారత్ తమకు చేసే సహాయం చరిత్రలో నిలిచిపోతుందని అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అన్నారు. తమ దేశ ప్రజలకు 120కోట్ల భారతీయులు అండగా ఉంటారని మోదీ చెప్పడం సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు.
అమృత్‌సర్: భారత్ తమకు చేసే సహాయం చరిత్రలో నిలిచిపోతుందని అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అన్నారు. తమ దేశ ప్రజలకు 120కోట్ల భారతీయులు అండగా ఉంటారని మోదీ చెప్పడం సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు. భారత్ తమకు ముఖ్యమైన దేశమని, ఇరు దేశాల మధ్య ఎప్పటికీ చక్కటి సంబంధాలు ఉంటాయని ఆయన అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై దృష్టి సారించాల్సి ఉందని, అందుకోసం తాము పెద్ద మొత్తంలో వ్యయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తమకు 500 మిలియన్ డాలర్ల సహాయం చేస్తామని పాక్ వాగ్దానం చేసిందని, ఈ డబ్బంతా ఉగ్రవాదాన్ని పెకలించడానికే తాము ఉపయోగిస్తామని తెలిపారు. దాదాపు 30 ఉగ్రవాద సంస్థలు తమ దేశంలో అతిపెద్ద ఉగ్రవాద స్థావరాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్నాయని, ఇదే జరిగితే మొత్తం ఆసియాకే ప్రమాదం అని, ఆ పరిస్థితి రానివ్వబోమని అన్నారు. గత ఏడాది ఉగ్రవాదుల భారిన పడి పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరిగిందని, తాము అంత నష్టాన్ని అస్సలు ఊహించలేదని అన్నారు. భారత్, అప్ఘనిస్థాన్, ఇరాన్ దేశాలకు చబహార్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదని ఘనీ గుర్తు చేశారు.