 
															21 మంది సజీవ దహనం
మరికొద్ది సేపట్లోనే గమ్యస్థానాలకు చేరతామని భావించిన ఆ బస్సు ప్రయాణికులు.
	మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. పేలిన డీజిల్ ట్యాంక్
	 
	పన్నా: మరికొద్ది సేపట్లోనే గమ్యస్థానాలకు చేరతామని భావించిన ఆ బస్సు ప్రయాణికులు.. మృత్యువు విసిరిన పంజాలో చిక్కుకుని భయానక స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఉవ్వెత్తున ఎగసిపడిన అగ్నికీలలు.. చిన్నా పెద్దా సహా మొత్తం 21 మంది ఉసురుదీశాయి. మరో 13 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సోమవారం మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ నుంచి సత్నా జిల్లాకు  50 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు బస్సు బయల్దేరింది.
	
	
	మార్గంమధ్యంలో పాండవ జలపాతం వద్ద ఓ వంతెన పైనుంచి ప్రమాదవశాత్తు 15 అడుగుల లోతైన కాల్వలోకి పడిపోయింది. రెప్పపాటులో బస్సుకు ఉన్న డీజిల్ ట్యాంక్ పేలి భారీస్థాయిలో మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికుల్లో 21 మంది సజీవ దహనమైనట్టు ఎస్పీ అర్జారియా వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిబూడిదైందని అన్నారు. కాగా, ఘటనపై స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
	
	
	ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
	బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
