కూలీలను చిదిమేసిన రైలు

16 migrant workers run over by goods train near Aurangabad in Maharashtra - Sakshi

16 మంది వలస కార్మికుల దుర్మరణం

మహారాష్ట్రలో దుర్ఘటన   సొంతూళ్లకు వెళ్తూ పట్టాలపై నిద్రించిన కూలీలు

ఔరంగాబాద్‌: మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు పయనమయిన వలస కార్మికులను గూడ్స్‌ రైలు చిదిమేసింది. కాలినడకన రైలు పట్టాల వెంబడి నడిచి వెళ్తూ అలసిపోయి పట్టాలపై పడుకున్నవారిపై నుంచి శుక్రవారం తెల్లవారు జామున ఒక గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా కర్మాడ్‌ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టాలకు కొద్ది దూరంలో పడుకున్న ముగ్గురు ప్రాణాలు దక్కించుకున్నారు.

మహారాష్ట్రలోని జల్నాలో ఉన్న ఒక స్టీలు ఫ్యాక్టరీలో పని చేసే మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికులు గురువారం రాత్రి కాలినడకన సుమారు 150 కిలో మీటర్ల దూరంలోని సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. రైలు పట్టాల వెంబడి దాదాపు 40 కి.మీ.లు నడిచిన తరువాత ఔరంగాబాద్‌కు దగ్గరలో అలసిపోయి, ఆగిపోయారు. అక్కడే రైలు పట్టాలపై నిద్రించారు. ముగ్గురు మాత్రం పట్టాలకు కొద్ది దూరంలో పడుకున్నారు. తెల్లవారు జాము 5.15 గంటల ప్రాంతంలో ఒక గూడ్స్‌ రైలు వారిపై నుంచి దూసుకెళ్లింది. రైలు రావడాన్ని పట్టాలకు దూరంగా పడుకున్నవారు గుర్తించారు.

పట్టాలపై పడుకున్నవారిని అప్రమత్తం చేసేందుకు గట్టిగా అరిచారు. కానీ, పట్టాలపై నిద్రిస్తున్నవారు ప్రమాదాన్ని గుర్తించేలోపే దుర్ఘటన జరిగిపోయింది. నాందేడ్‌ డివిజన్‌లోని బద్నాపూర్‌– కర్మాడ్‌ స్టేషన్‌ల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. చెల్లాచెదురుగా పడి ఉన్న వలస కూలీల మృతదేహాలు, వారి వస్తువులతో ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఆ దృశ్యాలున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దూరంగా పట్టాలపై మనుషులున్నట్లు గుర్తించిన రైలు లోకోపైలట్‌.. హారన్‌ మోగిస్తూ, రైలు ఆపేందుకు విఫలయత్నం చేశాడని స్థానిక మీడియా పేర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా రైళ్లు నడవవన్న ధీమాతోనే వారు పట్టాలపై పడుకున్నారని బాధితులను ఉటంకిస్తూ వివరించింది.

పోలీసులు ఆపకుండా ఉండేందుకే..
ఈ ఘటనపై రైల్వే శాఖ సమగ్ర విచారణకు ఆదేశించింది. కార్మికులు మహారాష్ట్రలోని జల్నా నుంచి మధ్యప్రదేశ్‌లోని భుసావల్‌కు వెళ్తున్నారని ఎస్పీ మోక్షద పాటిల్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా పోలీసులు తమను అడ్డుకోకుండా ఉండేందుకే వారు రోడ్డు మార్గాలను కాకుండా, పట్టాలను అనుసరించి ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసిందన్నారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి.

మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు
రైలు ప్రమాద ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా తీసుకుని మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, ఔరంగాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. లాక్‌డౌన్‌ సమయంలో కార్మికులకు అందిస్తున్న ఆహార, వసతి, ఇతర సౌకర్యాల వివరాలను కూడా తెలపాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.  

ప్రముఖుల సంతాపం
ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కార్మికుల మృతి తనను కలచివేసిందని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘రైలు ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌తో మాట్లాడాను. ఆయన స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు’అని మోదీ ట్వీట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కార్మికులను సొంత ప్రాంతాలకు పంపించేందుకు మరిన్ని రైళ్లు కావాలని కేంద్రాన్ని కోరాం. త్వరలో ఆ ఏర్పాట్లు చేస్తాం’అని ఠాక్రే అభ్యర్థించారు.  

విపక్షాల విమర్శలు
జాతి నిర్మాతలైన కార్మికులతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు దేశమంతా సిగ్గుతో తలదించుకోవాలని రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలని స్థానిక ఎంఐఎం ఎంపీ ఇమ్తియాజ్‌ జలీల్‌ విమర్శించారు. ఇందుకు కారణమైన ప్రధానమంత్రి  కార్యాలయం, రైల్వే శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top