
నటుడు శింబుతో కురళరసన్
పెరంబూరు: సంచలన నటుడు శింబు ఇంట పెళ్లి కళ తాండవిస్తోందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కోలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ల సంఖ్య చాలానే ఉంది. ముఖ్యంగా నటుడు విశాల్, ఆర్య, శింబు ఇలా చాలా మంది ఉన్నారు. వీరిలో నటుడు ఆర్య బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్ ప్రేమలో పడి పెళ్లికి రెడీ అయ్యారు. వీరి పెళ్లి ఈ నెల 10న హైదరాబాద్‌లో జరగనుంది. నటుడు విశాల్‌కు పెళ్లి త్వరలోనే జరిగే అవకాశం ఉంది. కాగా నటుడు శింబు పెళ్లెప్పుడన్నదే ప్రశ్నార్ధంగా మారింది. ఈ పరిస్థితుల్లో శింబు ఇంటి పెళ్లి కర్యాక్రమాలు చాలా సైలెంట్‌గా జరుగుతున్నాయనే ప్రచారం గుప్పుమంది. ఆ మధ్య తన చెల్లెలి పెళ్లి తరువాత తాను పెళ్లి చేసుకుంటానని శింబు తెలిపారు.
ఆయన చెల్లెలు పెళ్లి జరిగి చాలా కాలం అయ్యింది. దీంతో ఇప్పుడు జరగనుంది శింబు పెళ్లే అని అనుకుంటున్నారేమో! కానీ ఆయన తమ్ముడు కురలరసన్ పెళ్లి అని తెలిసింది. బాల నటుడిగా పరిచయం అయిన టీ.రాజేందర్ రెండవ కొడుకు కురళరసన్ శింబు, నయనతార జంటగా నటించిన ఇదునమ్మ ఆళ్లు చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మారారు. ఈయన ఇటీవల ఇస్లాం మతాన్ని స్వీరించిన విషయం తెలిసిందే. తను ప్రేమ కోసమే మతం మారినట్లు తెలుస్తోంది. కురళరసన్ ప్రేమ పెళ్లి కోసమే ఇప్పుడు శింబు ఇంట పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. కురళరసన్ పెళ్లి ఏప్రిల్ 26న జరగనున్నట్లు సమాచారం. టీ.రాజేందర్ కుటుంబ సభ్యుల నుంచి దీనిపై అధికారక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. త్వరలోనే వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.