నా జీవితంలో ఇదొక మార్పు

VV Vinayak Seenayya Movie Launch - Sakshi

– వీవీ వినాయక్‌

‘ఆది, దిల్, ఠాగూర్, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్‌ 150’ వంటి ఎన్నో హిట్‌ సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వీవీ వినాయక్‌ ‘సీనయ్య’ చిత్రంతో తొలిసారి హీరోగా మారారు. నరసింహ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వినాయక్‌ పుట్టినరోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకులు కె. రాఘవేంద్రరావు క్లాప్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ–‘‘ఆది’ సినిమాతో వినయ్‌(వినాయక్‌)తో నా ప్రయాణం మొదలైంది. మా సంస్థను స్థాపించిన తర్వాత తొలి సినిమా వినాయక్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ చేశాం. ఈ సినిమా పేరే మా ఇంటిపేరుగా మార్చేంత హిట్‌ సాధించింది. 1982–1984 నేపథ్యంలో సాగే కంప్లీట్‌ ఎమోషనల్‌ స్టోరీ ‘సీనయ్య’. ఈ సినిమాలో ఎవర్ని హీరోగా అడుగుదామా? అనుకుంటున్న తరుణంలో మా సంస్థలో సినిమాలు చేసిన దర్శకులు గుర్తుకువచ్చారు. ఈ కథకు వినయ్‌ అయితే సరిపోతాడనిపించి నరసింహతో చెప్పగానే ఎగై్జటింగ్‌గా ఫీలయ్యాడు. ఆ తర్వాత వినయ్‌కు కథ చెప్పడంతో నటిస్తా అన్నాడు. ఈ కథలో భాగమైన హరిని భవిష్యత్‌లో దర్శకుడిగా పరిచయం చేస్తా.

వచ్చే ఏడాది వేసవిలో ‘సీనయ్య’  విడుదల చేస్తాం’’ అన్నారు. వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘రాజుగారు ఓ రోజు వచ్చి...‘నువ్వు నన్ను ‘దిల్‌’ రాజుని చేశావ్‌. నేను నిన్ను హీరోని చేద్దాం అనుకుంటున్నా’ అన్నారు. నరసింహ చెప్పిన కథ నచ్చి, పాత్ర కోసం బరువు తగ్గాను. ఇప్పుడు ఎలాంటి దుస్తులైనా వేసుకోగలుగుతున్నా (నవ్వుతూ). జీవితంలో నాకు ఇదొక మార్పు’’ అన్నారు. ‘‘మంచి ఎమోషనల్‌ కథ ఇది’’ అన్నారు నరసింహ.  దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్‌ రావిపూడి, మెహర్‌ రమేష్, నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సి.కల్యాణ్, డీవీవీ దానయ్య, అనిల్‌ సుంకర, బెల్లంకొండ సురేష్, బెక్కం వేణుగోపాల్, వల్లభనేని వంశీ, రచయిత హరి పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top