‘కథ వినకుండా ‘ఓ పిట్ట కథ’ ఒప్పుకున్నా’

Viswant Interesting Comments On O Pitta Katha Telugu Movie - Sakshi

బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. చెందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతాన్ని అందించాడు. మార్చి 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వంత్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నేను నటుడిగా ఇంతవరకు చేసిన పాత్రలు వేరు. పిట్టకథలోని నా పాత్రలో ప‌లు వేరియేషన్స్‌ వున్నాయి. నటన పరంగా దాదాపు క్రిష్‌ అనే నా పాత్రకు పూర్తి న్యాయం చేశాను’ అని  క‌థానాయ‌కుడు విశ్వంత్‌  తెలియజేశారు. 

పిట్టకథ అంటే ఏమిటి? ఎవరికి సంబంధించిన టైటిల్‌?
ఇందులో ముగ్గురు క్యారెక్టర్లు ప్రధానం. ముగ్గురికీ ఒక్కో పిట్టకథ వుంటుంది. అవి ఒక్కోక్కరికి రిలేటెడ్‌గా వుంటాయి. ఏ పాత్ర ఎలా చెబుతుందనేది విజన్‌. అది ఎలా అనేది తెలియాలంటే వెండితెరపై చేయాల్సిందే.

కొరటాల‌గారు పెద్దకథ అన్నారు? దానికి కారణం?
దర్శకుల‌కు సినిమా గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఇది స్క్రీన్‌ప్లే గేమ్‌. దాని గురించి తెలిసి ఆయనకు బాగా నచ్చింది. మా గురువుగారు చంద్రశేఖర్‌ ఏలేటిగారికీ నచ్చింది. అలా కొరటాగారికి ఈ స్క్రీన్‌ప్లే నచ్చి తెలుగులో ఇటువంటి స్క్రీన్‌ప్లే బేస్డ్‌ చాలా కొత్తగా వుంది. పిట్టకథంటే చిన్నదికాదు పెద్ద కథ అని అన్నారు.

అస‌లు ఈ సినిమా ఎలా మొదలైంది. ఈ సినిమాలో మీరు నటించడానికి కారణం ఏమిటి ?
దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటిగారు నా గురువుగారు. ఆయన సినిమాచేశాక ఆయనతోనే జర్నీ చేయాల‌ని ఎక్కువ ఆయనతో ప్రయాణం అయ్యాను. ఆ సమయంలో నాకు ఈ సినిమా గురించి చెప్పారు. చెందు ముద్దు అనే వ్యక్తి మంచి కథ చెప్పారు. చాలా బాగుంది. చేస్తావా అని అడిగారు. యేలేటిగారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఆయన చెప్పారని కథ కూడా వినకుండా ఈ సినిమా చెయ్యడనికి ఒపుకున్నా.

 

చంద్రశేఖర్‌ యేలేటితో మీకు ఉన్న అనుబంధం గురించి ?
నేను ఆయన డైరెక్షన్‌ లో ‘మనమంతా’ సినిమా చేశాను. ఆయన అంటే నాకు చా లా గౌరవం. నాకు సరైన కథ రావడంలేదు, ఒక పర్ఫెక్ట్‌ సినిమా చెయ్యాలి. మీతో ట్రావెల్‌ అవుతానని చెప్పి ఆయనతో ట్రావెల్‌ అయ్యాను. ఇక స్క్రీన్‌ ప్లేలో ఆయనకున్న పట్టు గురించి అందరికీ తెలిసిందే. ఆలాంటి ఆయనకు ఈ సినిమా స్క్రీన్‌ ప్లే బాగా నచ్చింది.. అందుకే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని పూర్తి నమ్మకం ఉంది.

మరెందుకు ఈ సినిమాకి ‘ఓ పిట్టకథ’ అని సింపుల్‌ టైటిల్‌ పెట్టారు ?
ఈ సినిమా ఒక స్క్రీన్‌ ప్లే గేమ్‌ అండి. నాకు తెలిసి తెలుగు సినిమాల్లో ఇలాంటి స్క్రీన్‌ ప్లే రాలేదు. విలేజ్‌ నేపథ్యంలో చేశాం కాబట్టి సింపుల్‌గా అనిపిస్తోంది. టైటిల్‌ అలా పెట్టడానికి కూడా స్క్రీన్‌ ప్లేనే కారణం. సినిమాలో చాలా యాంగిల్స్‌లో స్క్రీన్‌ ప్లే నడుస్తోంది. కచ్చితంగా ఈ సినిమా కొత్తగా అనిపిస్తోంది.

మీరు థ్రిల్‌ అయిన పాయింట్‌ ఏమిటి?
సినిమాలో థ్రిల్‌ అయిన పాయింట్‌ ఇప్పుడు నేను చెప్పే కంటే.. సినిమా చూశాక ఆ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను మీరు ఫీల్‌ అయితే బాగుంటుంది. అయితే నా క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్‌ ఉంటాయి. నేను ఇలాంటి క్యారెక్టర్‌లో ఇంతవరకు చెయ్యలేదు.

ఇండస్ట్రీలో మీ జర్నీ గురించి?
ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల‌న్నీ మంచి సినిమాలే. మంచి సినిమాలు చేస్తాడు అనే మంచి పేరును నాకు తీసుకువచ్చాయి. అయితే కమర్షియల్‌గా అవి పెద్దగా వర్కౌట్‌ అవకపోయినా గుడ్‌ ఫిల్మ్స్‌ చేశాను అనే సంతృప్తి నాకు ఉంది. నా కెరీర్‌లో ‘మనమంతా’ లాంటి మంచి సినిమా ఉన్నందుకు గౌరవంగా చెప్పుకుంటా.

కమర్షియల్‌గా హిట్‌ అయితేనే కదా.. ఆ సినిమా నిజమైన హిట్‌ అనిపించుకుంటుంది ?
అవును, కమర్షియల్‌గా వర్కౌట్‌ అవ్వాలి. అయితే అన్ని సినిమాలు అలా అవ్వవు. బట్‌, నేను కూడా మంచి కమర్షియల్‌ హిట్‌ కోసం చూస్తున్నాను. రీసెంట్‌గా ‘కాదల్‌’ అని ఒక సినిమా చేశాను. అది నాకు కమర్షియల్‌ హిట్‌ ఇస్తోందని అనుకుంటున్నాను.

మీ తదుపరి సినిమాలు?
‘కాదల్‌’ మూవీ రాబోతుంది. అలాగే ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ అనే మరో సినిమా కూడా ప్రస్తుతం షూట్‌లో ఉంది. ఈ సినిమా ఎమోషనల్‌గా సాగుతూనే కమర్షియల్‌ యాంగిల్‌లోనే ఉంటుంది. ఈ రెండు సినిమాలు బాగా వస్తున్నాయి.

చదవండి:
రాధిక నాకు తల్లి కాదు!
ఇలా అయితే ఎలా కరోనా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top