కోబ్రా ఫస్ట్‌లుక్‌.. అదుర్స్‌ అంటున్న ఫ్యాన్స్‌

Vikram Cobra Movie First Look Released Attracts Fans - Sakshi

సాక్షి, చెన్నై: చియాన్‌ విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. ఆయనకు జంటగా నటి శ్రీనిధి శెట్టి నటిస్తున్న ఇందులో ఇర్ఫాన్‌ పటాన్, ఆనంద్‌రాజ్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 7 స్క్రీన్‌ స్టూడియో పతాకంపై ఎస్‌ఎస్‌.లలిత్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్‌జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి హరీశ్‌కణ్ణన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇక ఈ చిత్ర టైటిల్‌ ‘కోబ్రా’ కు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. వెరైటీ టైటిల్‌... డీమాంటీ కాలనీ, ఇమైకా నొడిగళ్‌ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడితో విక్రమ్‌ సినిమా ప్రకటించడంతో అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కోబ్రా చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ శుక్రవారం విడుదల చేశారు.

ఈ పోస్టర్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇక సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా... విక్రమ్‌ ప్రయోగాలకు ఎల్లప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. ఐ చిత్రం అంతకు ముందు అన్నియన్‌ చిత్రం ఇలా పాత్రల కోసమే కాదు, గెటప్‌ల కోసం ఆయన పడే శ్రమ మాటల్లో వర్ణించలేం. వైవిధ్యం కోసం తపించే విక్రమ్‌ దాన్ని తాజా చిత్రంలోనూ కొనసాగించారు. ఈ విషయం చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తేనే అర్థం అవుతుంది. కోబ్రా చిత్రంలో విక్రమ్‌ వివిధ గెటప్‌లలో కనిపిస్తారని యూనిట్‌ వర్గాలు ముందే చెప్పారు. దాన్ని ఈ ఒక్క ఫస్ట్‌లుక్‌లోనే బహిరంగపరిచారు. ఈ పోస్టర్‌లో నటుడు విక్రమ్‌ ఏడు గెటప్‌లలో కనిపించారు. వాటిలో దేనికదే చాలా డిఫెరెంట్‌గా ఉంది. దీంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. కోబ్రా ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌ అంటున్నారు. దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు చిత్ర కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని తన గత రెండు చిత్రాలతోనే నిరూపించుకున్నారు. కాగా తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న కోబ్రా గత చిత్రాలకంటే చాలా భారీగా తెరకెక్కిస్తున్న చిత్రం అన్నది గమనార్హం. దీంతో కోబ్రా చిత్రంపై చిత్ర వర్గాల్లోనూ అంచనాలు పెరుగుతున్నాయనే చెప్పవచ్చు. కాగా నటుడు విక్రమ్‌ కోబ్రాతో పాటు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న మరో భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌లోనూ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top