కుమారుని మరణం కుంగదీసింది

Tollywood mourns death of Prominet actor Gollapudi Maruthi  Rao - Sakshi

గొల్లపూడి అస్తమయంపై టాలీవుడ్ సంతాపం

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూతపై టాలీవుడ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన విశేషమైన సేవలను గుర్తు చేసుకుంటూ ఆ ప్రతిభాశాలికి నివాళులర్పిస్తున్నారు. టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, మారుతిరావుకి సన్నిహితుడు కోట శ్రీనివాసరావు స్పందిస్తూ గొల్లపూడి అస్తమయం తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ఆయనను చిన్న కుమారుడు శ్రీనివాస్‌  ఆకస్మిక మరణం బాగా కుంగదీసిందన్నారు. గొల్లపూడి మరణం పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్యానించారు. ఆయన భార్యకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలంటూ తన ప్రగాఢ సానుభూతిని వ్యక‍్తం చేశారు.

తనకు ఇష్టమైన నటులలో గొల్లపూడి మారుతిరావుగారు ఒకరని టాలీవుడ్‌ హీరో నాని ట్వీట్‌ చేశారు. ఆయన మాట్లాడేతీరు, నటించిన తీరు ఆకట్టుకుంటుందని, ఆయన సాన్నిహిత్యం మరువలేనిదని పేర్కొన్నారు.  హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ స్పందిస్తూ హ్యాపీడేస్‌ సినిమాకు ముందు ఒక చిన్న సినిమాలో ఆయనతో కలిసి నటుడు కమ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాననీ, ఆ సందర్భంగా ఆయన మార్గదర్శకత్వం, సలహాలు ఎప్పటికీ తనతోనే శాశ్వతంగా ఉంటాయంటూ గొల్లపూడిని గుర్తు చేసుకున్నారు. అద్భుతమైన సినిమాలు, నటనతో ఆయన మన గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ  ట్విట్‌  చేశారు.  దీంతోపాటు ఒక ఫోటోను కూడా షేర్‌ చేశారు.

కాగా గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి చెన్నైలోని లైఫ్‌లైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు.1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన మారుతీరావు వివిధ కళారంగాల్లో తనదైన ప్రతిభను చాటుకుని బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారు. రచయితగా, నటుడుగా, జర్నలిస్ట్‌, ఎడిటర్, డైరెక్టర్ ఇలా విభిన్న రంగాలలో విశిష్ట సేవలందించారు. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులతోపాటు, ఇతర ప్రముఖులు  కూడా సంతాపం వెలిబుచ్చారు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top