ఇంకా మౌనంగా ఎందుకు ఉంటున్నారు? | Tammareddy Bharadwaj Video Post to Modi | Sakshi
Sakshi News home page

మోదీని ఉద్దేశించి తమ్మారెడ్డి వీడియో పోస్ట్

Nov 30 2017 2:29 PM | Updated on Jul 11 2019 9:16 PM

Tammareddy Bharadwaj Video Post to Modi - Sakshi

సాక్షి, సినిమా :  సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం నడుస్తున్న సమస్యలు.. సినిమాలపై కొందరు ప్రదర్శిస్తున్న తీరులను ఎండగడుతూనే ఆయన ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. 

‘‘దేశానికి మంచి నాయకుడు కావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీని పీఎంగా ఎన్నుకున్నాం. కానీ, మీ వ్యవహారశైలి చూస్తుంటే, మీరు కొంత మందికి మాత్రమే ప్రధాన మంత్రి అనే ఫీలింగ్ కలుగుతోంది. మీరు అలాంటివారు కాదనేది గట్టి నమ్మకం. ఈ మధ్య కాలంలో సినిమాలపై ప్రతి ఒక్కరూ పడిపోతున్నారు. ముఖ్యంగా బీజేపీవాళ్లు. 'ఉడ్తా పంజాబ్', 'మెర్సల్', 'పద్మావతి'... ఇలా ఎన్నో సినిమాలపై దాడులు జరుగుతున్నాయి. సినిమా అనే క్రియేటివిటీని ఆపడానికి చేసే ప్రయత్నం, భావ ప్రకటన స్వేచ్ఛను ఆపే ప్రయత్నం జరుగుతుంటే, మీరూ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. ఈ మౌనం సమర్థిస్తున్నట్టుగానే కనిపిస్తోంది అని తమ్మారెడ్డి అన్నారు. 

బీజీపీకి చెందిన ఎంపీలు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారని... సినిమావాళ్ల భార్యలంతా ఎవరితోనే వెళ్లిపోతున్నారంటూ ఓ ఎంపీ దారుణ వ్యాఖ్యలు చేశారని... ఇలాంటి వ్యాఖ్యలను విని కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని ప్రశ్నించారు. పద్మావతి చిత్ర వివాదంపై స్పందిస్తూ... కొంతమంది సినిమావాళ్ల తలకాయలు తీసేయమంటున్నారు.  దీపికా పదుకొనే ముక్కు కోసేయాలంటూ పిలుపునిచ్చారు. వీటన్నింటినీ చూస్తుంటే మనం మళ్లీ ఆటవిక సమాజానికి వెళ్తున్నట్టు అనిపిస్తోంది అని పేర్కొన్నారు. 'గౌరీ లంకేష్ ను చంపినప్పుడు కొంతమంది సెలబ్రేట్ చేసుకున్నారని... ఇది ఎంతవరకు సబబని మాత్రమే నటుడు ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారని, కానీ,  ప్రకాశ్ రాజ్ అల్లకల్లోలం చేశాడంటూ కొందరు బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. 

ప్రధాన మంత్రిని దేని గురించైనా ప్రశ్నించడం తప్పా మోదీ గారు? అని అన్నారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మనసులోని మాటను తమతో పంచుకుంటున్నారని... మా మనసులోని మాటను కూడా మీరు వింటే చాలా బాగుంటుందని భావిస్తున్నానని చెప్పారు. ఈ వీడియో మీ వరకు చేరుతుందనే నమ్మకం కూడా తనకు లేదని... ఎవరైనా తన భావనను మీకు చెబుతారనే చిన్న ఆశ మాత్రం ఉందని అన్నారు. ఏ ఒక్క వర్గానికో మీరు కాదని.. ప్రధానిగా దేశంలోని ప్రతి ఒక్కరినీ రక్షించే బాధ్యత తమరిపై ఉందని మోదీని ఉద్దేశించి తమ్మారెడ్డి ఆ వీడియోలో వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement