స్టైలియర్... 2013... | sylish year in tollywood 2013 | Sakshi
Sakshi News home page

స్టైలియర్... 2013...

Dec 30 2013 12:48 AM | Updated on Mar 22 2019 5:33 PM

ఈ ఏడాది దాదాపు అందరు స్టార్లూ తమదైన స్టైల్స్‌తో తెరని మెరిపించారు. సినిమా ఫ్యాషన్‌లను అనుకరించేవారికి ఈ ఏడాది ఫుల్ మీల్స్.

ఈ ఏడాది దాదాపు అందరు స్టార్లూ తమదైన స్టైల్స్‌తో తెరని మెరిపించారు. సినిమా ఫ్యాషన్‌లను అనుకరించేవారికి ఈ ఏడాది ఫుల్ మీల్స్. ఒక్కో తార ఒక్కో రకంగా  అభిమానులకు సరికొత్త స్టైల్స్‌ని అందించారు. అలాంటి ఫ్యాషన్ శైలుల్లో కొన్ని...
 
 ఓల్డ్ కు ‘చెక్’చెప్పిన మహేష్...: అబ్బా ఎప్పుడూ అవే గీతల చొక్కాలా అంటూ చెక్స్ షర్ట్స్‌కు కాలం చెల్లించేస్తున్న దశలో... హీరో మహేష్‌బాబు చెక్స్ డిజైన్స్ ఉండే చొక్కాల పాలిట ఆపద్బాంధవుడయ్యాడు.‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో చారల చొక్కాలతో ప్రిన్స్ అమ్మాయిలను ‘చూసిందల్లా పదినిమిషాలకే ’ పడేయడాన్ని తెరపై చూసిన ప్రేక్షకులు చారల చొక్కాల కోసం షాపుల దగ్గర, డిజైనర్‌ల దగ్గర బారులు తీరారు. 
 
 
 ‘ఆర్’...హుషార్: ‘లైలా ఓ లైలా ఆజావో మేరీ లైలా’ అంటూ హిందీ లిరిక్స్‌కు చిందులేసిన రామ్‌చరణ్... తెలుగు ప్రేక్షకులకు స్టైల్ అక్షరాలు నేర్పాడు. ‘నాయక్’ సినిమాలో వచ్చిన ఆ పాటలో రామ్‌చరణ్ ధరించిన ‘ఆర్’ అక్షరం ఉన్న టీషర్ట్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అచ్చం అదే తరహాలో ఆర్ అక్షరంతో సహా ఉండే టీషర్ట్‌లను ధరించిన కుర్రకారు రామ్‌చరణ్‌లా ఫీలై హుషారెత్తి పోయారు. 
 
 కార్పొరేట్‌కు ‘మిర్చి’ఘాటు...: పర్పుల్ కలర్‌కు గ్రే కలర్ కాంబినేషన్, వైట్ కలర్‌కు క్రీమ్ ప్యాంట్‌ను జతచేయడం... ఇలా క్లాసీలుక్‌లో స్పైసీగా ఆకట్టుకున్న మిర్చిలాంటి కుర్రాడు తన ఫ్యాషన్ల ఘాటును కార్పొరేట్ కంపెనీల్లో గుబాళించాడు. ‘మిర్చి’లో ప్రభాస్ ధరించిన దుస్తులు కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే కుర్రకారును ఒక ఊపు ఊపాయి. అచ్చం అలాంటి కలర్ కాంబినేషన్స్ కోరుతూ బొటిక్‌లకు పనిపెట్టినవారెందరో...
 
 బంతిపూల జానకి... ఇంతి ఫ్యాషన్ల ‘కీ’...: ముద్దబంతి పూవులా ఉండే కాజల్... లేసులతో అల్లిన బ్లౌజ్‌లతో అమ్మాయిలకు స్టైలాభ్యాసం చేయించింది. ‘బాద్‌షా’తో జతకట్టిన ఈ బ్యూటీఫుల్ గాళ్... నెట్టెడ్ జాకెట్‌లతో అబ్బాయిలకు వలవేయడం ఎలానో అమ్మాయిలకు నేర్పించింది. ఏదైతేనేం... ‘బంతిపూల జానకి’ పాటలో కాజల్ ధరించిన బ్లౌజ్‌లు ఆడపిల్లలకు లే‘టేస్ట్’ ఫ్యాషన్‌గా మారాయి. 
 
 పచ్చప్యాంట్ కోసం ‘రన్.. రన్’...
 గుండెజారి బ్లేజర్ అయ్యిందే...: పొడవాటి బ్లేజర్ ధరించి ‘గుండెజారి గల్లంతయ్యిందే’ అంటూ నితిన్ వేసిన స్టెప్స్ చూసిన అమ్మాయిలు ఏం పారేసుకున్నారో కానీ... అబ్బాయిలు ఆ బ్లేజర్ మీద మనసు పారేసుకున్నారు. అబ్బాయిలు ధరించడానికి సంకోచించే పింక్‌కలర్ బ్లేజర్‌ను ఆ సినిమా టైటిల్‌సాంగ్‌లో దర్జాగా ధరించి నితిన్ సృష్టించిన డ్రెస్‌కోడ్... ఫ్యాషన్ల కోడిని కూయించింది. బ్లేజర్ లెంగ్త్ విషయంలోనూ ఇది సరికొత్త ఒరవడి సృష్టించింది. 
 
 ఇక...ఫ్యాష‘నిజం’...: పవనిజం ఎంత నిజమో... పవన్‌కళ్యాణ్ సృష్టించే ఫ్యాషన్ కూడా అంతే నిజం అని ‘అత్తారింటికి దారేది’ నిరూపించింది. ఈ సినిమాలో పవన్ ధరించిన ఓ పొడుగు చేతుల చొక్కా సరికొత్త ట్రెండ్‌కు దారి చూపింది. ‘బాపుగారి బొమ్మ’ పాటలో వేసుకున్న బ్లేజర్, షాపింగ్‌మాల్‌లో ప్రణీతని అల్లరిపెడుతున్నవారితో ఢిష్యూ ఢిష్యూ టైమ్‌లో వేసుకున్న మోచేయి దగ్గర చారలతో ఉండే ఎర్రరంగు పొడుగు చేతుల చొక్కా... ఈ రెండూ కుర్రకారును ఫాలో అయ్యేలా చేశాయి. 
 
 సార్థకనామథేయుడు...: బన్నీని ‘స్టైలిష్‌స్టార్’ అని అనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదని నిరూపించిన ‘ఇద్దరమ్మాయిలతో’... సినిమా ఒకటీ అరా కాదు బోలెడన్ని ఫ్యాషన్లను మోసుకొచ్చింది. ‘రన్న్’ర పాటలో వేసుకున్న గ్రీన్ కలర్ ప్యాంట్ దగ్గర్నుంచి...చేతికి రకరకాల హ్యాండ్ యాక్సెసరీస్‌ను ధరించడం... వేళ్లకు వెరైటీ రింగ్స్... ఇవన్నీ జంక్ జోష్ ఉన్న యూత్‌కి బాగా పట్టేశాయి. 
 - ఎస్.సత్యబాబు
 
 
 
 సినిమాయే ఫ్యాషన్‌కు కేరాఫ్...
 కుటుంబ కథా చిత్రాలు, మాస్ మసాలా, లవ్, ఫ్యాక్షన్, హర్రర్.. విభిన్న రకాల సినిమాల హిట్స్‌ను ఇచ్చిన 2013... డిఫరెంట్ ఫ్యాషన్స్‌ను కూడా తెరమీదకు తెచ్చింది. ఇప్పటికీ సినిమాలే డ్రెస్సింగ్ ట్రెండ్స్‌ను డిసైడ్ చేస్తున్నాయని మరోసారి ఈ ఏడాది ప్రూవ్ చేసింది. మాలాంటి స్టైలిస్ట్‌లకు చేతినిండా పనిపెట్టిన సంవత్సరమిది. 
 
 - కోన నీరజారెడ్డి, సినీ స్టైలిస్ట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement