సంచలన విషయాలు వెల్లడించిన సుస్మితా సేన్‌

Sushmita Sen Says Had To Take Steroid Every 8 Hours To Atay Alive - Sakshi

2014 నుంచి రెండేళ్ల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డానని అంటున్నారు మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌. స్టెరాయిడ్స్‌తోనే జీవితాంతం బతకాలని వైద్యులు చెప్పారని, ఆ సమయంలో ఎంతో నరకం అనుభవించానని ఆమె పేర్కొన్నారు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు సుస్మిత. ‘‘నిర్బాక్‌’ అనే బెంగాలీ చిత్రంలో నటించిన తర్వాత అస్వస్థతకు గురయ్యాను. ఏం జరిగిందో తెలీలేదు. ఆ తర్వాత పలు వైద్య పరీక్షలు చేయించుకున్నాను. అడ్రినల్‌ గ్రంథుల పనితీరు ఆగిపోయిందని అన్నారు. ఆ ప్రభావం నా అవయవాలపై చూపింది. మాటిమాటికీ కళ్లు తిరిగి పడిపోతుండేదాన్ని. దాంతో ఇక బతికినంత కాలం హైడ్రోకోర్టిసోన్‌ అనే స్టెరాయిడ్‌ తీసుకోవాలని సూచించారు వైద్యులు. ఎనిమిది గంటలకోసారి స్టెరాయిడ్‌ తీసుకోవాలి. లేకపోతే బతకనని వైద్యులు చెప్పారు’ అని పేర్కొన్నారు సుస్మిత.

‘కానీ ఆ స్టెరాయిడ్‌ వల్ల చాలా బరువు పెరిగాను, జుట్టు రాలిపోయేది. నేను సాధరణ మహిళనయితే అంతగా బాధపడేదాన్ని కాదు. కానీ నేను మాజీ విశ్వసుందరిని. నా ఆకారం చూసి ఏదో అయిపోయిందనుకుంటారని బయటికి రాలేకపోయాను. ఎలాగైనా కోలుకోవాలనుకున్నాను. చికిత్స నిమిత్తం జర్మనీ, లండన్‌ వెళ్లాను. ఆరోగ్యం కోసం ఏరియల్‌ సిల్క్‌ అనే యోగా సాధన చేశాను. వైద్యులు అవి చేయొద్దని సూచించినా నేను వినలేదు. 2016 చివర్లో తీవ్ర అనారోగ్యానికి గురై కళ్లు తిరిగి పడిపోయాను. ఆ సమయంలో నేను అబుదాబిలో ఉన్నాను. నన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని చికిత్సల తర్వాత నన్ను డిశ్చార్జి చేశారు. ఓసారి నేను తిరిగి భారత్‌కు వస్తుంటే నాకు చికిత్స చేసిన డాక్టర్‌ ఫోన్‌ చేసి చాలా సంతోషకరమైన వార్త చెప్పార’న్నారు.

‘ఆ డాక్టర్‌ ఫోన్‌లో ‘సుస్మిత.. ఇక నువ్వు ఆ స్టెరాయిడ్‌ మందులు వాడటం ఆపెయ్‌. ఎందుకంటే నీ ఒంట్లో అడ్రినల్‌ గ్రంథుల పనితీరు మెరుగుపడింది. కంగ్రాట్స్‌’ అని చెప్పారు. అది విన్నాక నా ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. సాధారణంగా ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కోలుకోవడం చాలా కష్టం. కానీ నేను కోలుకున్నాను’ అని వెల్లడించారు సుస్మిత.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top