నా అంత ధనవంతుడు ఎవరైనా ఉంటారా?

sirivennela sitarama sastry  telugu film writers assotation Honored - Sakshi

– ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి

‘‘కళలన్నింటిలో తలమానికమైన కళ సాహిత్యం. సాహిత్యం అనేది అనేక రూపాల్లో ఉంటుంది. వాటిలో మొదటిది నాటకం. కవులు ఎంత బాగా రాసినా దాన్ని ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపేది నాటకం. ఆ నాటకానికి సాంకేతిక రూపమే సినిమా’’ అన్నారు ప్రముఖ పాటల రచయిత  ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘తెలుగు సినీ రచయితల సంఘం’ బుధవారం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి సత్కార సభ ఏర్పాటు చేసింది.

సిరివెన్నెల, ఆయన సతీమణి పద్మావతిని సన్మానించారు. ఈ సమావేశానికి ‘తెలుగు సినీ రచయితల సంఘం’ అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ‘సిరివెన్నెల’ మాట్లాడుతూ– ‘‘పద్మశ్రీ’ అవార్డు విలువ, ప్రాముఖ్యత ఎంత అనే విషయాన్ని పక్కనపెడితే ఇంత మంది అభిమానం, ప్రేమ, ఐశ్వర్యం పొందడం చాలా సంతోషంగా ఉంది. నా శ్రీమతి పద్మతో అంటుంటాను.. ‘నా అంత ధనవంతుడు ఎవరైనా ఉంటారా?’ అని. నేను సినిమా రంగాన్ని దేవాలయంలా భావిస్తాను.

నా పాటల ద్వారా సంస్కారవంతమైన భావాలని చెబుతున్నా. గతంలో ఎంతోమంది ‘పద్మశ్రీ’ అవార్డులు తీసుకున్నారు. వారు ఎంత సంతోషపడ్డారో తెలియదు కానీ, ఈ అవార్డు మాత్రం నాకు ప్రత్యేకమైనది. రామాయణాన్ని 5 మాటల్లో చెప్పమంటే ఎలా చెబుతాం? అయితే పాట ద్వారా చెప్పే అవకాశం సినిమా ద్వారానే వస్తుంది. అది నాకు వచ్చింది. 30ఏళ్లుగా సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి పాటలు రాసే అవకాశం ఆ పరమేశ్వరుడు నాకే ఇచ్చాడేమో అనిపిస్తోంది. సినిమా అన్నది జీవితానికి అతీతంగా ఉంటుందనుకోను.

సమాజం పట్ల బాధ్యత పెంచేది సినిమా. మొదటిసారి నాకు ‘నంది’ అవార్డు వచ్చినప్పుడు కన్నీళ్లు వచ్చాయి. మీరందరూ అన్నట్టు ‘భారతరత్న’ అవార్డు నాకు వస్తుందా? రాదా? అన్నది కాదు. భారతీయులంతా మంచి మనసుతో జీవించి, మేమంతా భారతీయులం అని ఇతర దేశాలవారికి సగర్వంగా చాటిచెప్పినప్పుడే మనందరికీ ‘భారతరత్న’ అవార్డు వచ్చినట్లు. ఇంతమంది అభిమానులు, ఆశీస్సులు, ఆత్మీయతను అందించిన ‘పద్మశ్రీ’ అవార్డుకి ధన్యవాదాలు. ప్రతి పురుషుడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. కానీ, నా శ్రీమతి పద్మ మాత్రం ముందుండి నన్ను నడిపిస్తున్నారు’’ అన్నారు.

రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘సిరివెన్నెల’గారు రాసిన పాటలన్నీ అద్భుతం. అయితే నాకు ప్రత్యేకించి ‘మహాత్మ’ సినిమాలోని ‘ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధీ...’ పాట అంటే చాలా ఇష్టం. మేం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో శ్రీశ్రీగారి పక్కన కూర్చున్నప్పుడు ఎంత గర్వంగా ఫీలయ్యామో ‘సిరివెన్నెల’తో కలిసి ఉన్నప్పుడూ అలాగే ఫీలయ్యాం’’ అన్నారు.
రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ– ‘‘‘సిరివెన్నెల’ అన్నయ్యకి ‘పద్మశ్రీ’ అవార్డు ఆలస్యంగా వచ్చిందంటున్నారు.. నిజానికి రచయితకి ‘పద్మశ్రీ’ తెచ్చిన మొదటి వ్యక్తి ఆయనే. పద్మభూషణ్, పద్మ విభూషణ్‌ అవార్డులతో పాటు ‘భారతరత్న’ అవార్డు కూడా రావాలని కోరుకుందాం’’ అన్నారు.  

‘‘తొలిసారి ఓ సినిమా రచయితకి ‘పద్మశ్రీ’ అవార్డు రావడం సినిమా పాటకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. రచయితలందరికీ ‘సిరివెన్నెల’ గర్వకారణం’’ అన్నారు రచయిత వడ్డేపల్లి కృష్ణ. ‘‘ఇండస్ట్రీకి వచ్చేముందు గురువుగారివద్ద (సిరివెన్నెల) శిష్యరికం చేయడం గొప్ప వరంగా భావిస్తాను’’ అన్నారు రచయిత రామజోగయ్య శాస్త్రి. ‘‘సిరి వెన్నెలగారిని ‘గ్రంథసాంగుడు’ అంటారు. అంటే గ్రంథంలో చెప్పలేని విషయాన్ని కూడా సాంగ్‌లో చెబుతారు’’ అన్నారు రచయిత భాస్కరభట్ల. ‘‘ఎవరికైనా ‘పద్మశ్రీ’ అవార్డు వస్తే డబ్బులిచ్చి కొనుక్కుని ఉంటారులే అని కామెంట్లు చేసేవారు.

కానీ, గురువుగారికి ఈ అవార్డుని ప్రకటించాక అర్హతగల వ్యక్తికి ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు’’ అని రచయిత సాయిమాధవ్‌ బుర్రా అన్నారు. ఈ సత్కార సభలో విజయేంద్రప్రసాద్, గుణ్ణం గంగరాజు, బల్లెం వేణుమాధవ్, బలభద్రపాత్రుని రమణి, గొట్టిముక్కల రాంప్రసాద్, కేఎల్‌ నారాయణ, వైవీఎస్‌ చౌదరి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భీమనేని శ్రీనివాసరావు, ఆర్పీ పట్నాయక్, ఆచంట గోపీనాథ్, కాసర్ల శ్యామ్‌తో పాటు పలువురు రచయితలు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top