ప్రేక్షక హృదయ నిశ్శబ్దానికి ప్రతిధ్వనిని

sirivennela seetharama sastry interview about padma shri award - Sakshi

-‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి

‘‘నాకు ‘పద్మశ్రీ’ అవార్డు రావడం వెనకాల కృషి చేసిన ప్రతి ఒక్కరికీ, నా పేరు సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. సీతారామశాస్త్రికి ఈ అవార్డు ఇవ్వాలి అని చెప్పి, ఎందుకు ఇవ్వాలో కేంద్రానికి సకాలంలో వివరిస్తూ తమ అభ్యర్థనలను పంపిన వేలాది మందికి పేరు పేరునా ధన్యవాదాలు. నాకు అవార్డు రావడం వేడుకగా, పండగలా భావిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని ప్రముఖ పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మశ్రీ’ అవార్డు ప్రకటించిన సందర్భంగా గురువారం సీతారామశాస్త్రి హైదరాబాద్‌లో విలేకరులతో పంచుకున్న విశేషాలు.

‘పద్మశ్రీ’  అవార్డు ఎంతది అన్న విషయం పక్కనపెడితే ఈ అవార్డు నాకు రావాలని కోరుకున్న తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. 30ఏళ్లుగా నేను సాగిస్తున్న ఈ సాహితీ వ్యవసాయానికి ఫలసాయంగా నాకు పద్మ అవార్డు రావాలనేది వారి ఆకాంక్ష, ఆశీర్వాదం, కోరిక.. ఇవన్నీ కలిపి ఈ రూపంలో వచ్చాయి అనుకుంటున్నాను. వారి ఆనందానికి కారణమైన నా సాహితీ వ్యవసాయం పట్ల నాకు ఒకింత వినయంతో కూడిన గర్వం కలిగింది. నాకు గీత రచయితగా జన్మనిచ్చిన దర్శకులు విశ్వనాథ్‌గారి చరణాలకు నమస్కరిస్తున్నా. నేను ఇక్కడికి వచ్చి పాటలు రాయాలని తలపించిన మా మాస్టారును తలచుకుంటున్నా. ఈ వేడుకను పై నుంచి చూస్తున్న నాన్నగారికి నమస్కరిస్తున్నా.

► ‘మాటలతో చెప్పడానికి అవకాశం లేని, సరిపోని భాష మూగబోయే స్థితిలో మాటల్ని వాహిక చేసుకుంటూ కనిపించని భావాన్ని అనిపింపజేసే ప్రక్రియ పాట’ అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఈ రంగంలోకి వచ్చాను. శోకం, క్రోదం, కోపం... ఇలాంటి దేశ, కాల అతీతమైన కొన్ని భావాలు ఉన్నాయి. సంఘటనలు, వ్యక్తులు, స్థలాలు... వీటిపై పాట రాయడం ఆసక్తి లేదు. పద్యం రాయాలని కానీ లేదా వచన కవిత్వం కానీ రాయాలని అప్పట్లో ఉండేది.

► నాకు చంధస్సు, పద్యం రాయడం రాదు కనక పాట రూపంలో నా అభిప్రాయాలను వ్యక్తపరిచేవాడిని. మెచ్చుకున్నవాళ్లూ నొచ్చుకున్నవాళ్లూ ఉన్నారు. నేనేమీ సంస్కృతాన్ని ఒక సన్నిధానంలో చదువుకున్నవాడినేం కాదు.. వినికిడి పాండిత్యం. మా నాన్నగారు మహా పండితులు. ఆయన సహచర్యం, భగవద్గీత ఇత్యాది వాటివల్ల నా భావాలకు అవసరమైన పద సంపద దొరికింది. అది అందరి దగ్గర ఉంది. నేను కఠినమైన భాషలో రాస్తాను అని చాలా మంది అంటుంటారు. కానీ, అలా రాయడం నాకు రాదు.

► విశ్వనాథ్‌గారి సినిమాకు సంబంధించి ఓ సారి విలేకర్ల సమావేశం జరిగింది. అప్పుడు ‘సిరివెన్నెల’ పాట చదువుతారు అన్నారు నొక్కి. అప్పుడు చదివాను. అక్కడి నుంచి హర్షధ్వానాలు వినిపించాయి. అప్పుడు ఒక రకమైన బతుకు జీవుడా భావం అనిపించింది. జన్మ ధన్యమైన భావం కలిగింది.

► నా ప్రతి పాటను అవార్డుగానే భావిస్తాను. పాట ఎలా కావాలో తెలిస్తే దర్శక–నిర్మాతలే తీసుకునేవారు. ఎలా ఉండాలో చెప్పడానికే 24 క్రాఫ్ట్స్‌ ఉన్నాయి. సినిమా కోసమే కాదు.. నా కోసం కూడా నేను పని చేస్తున్నా. ఆ శ్రద్ధ, ఆ భయం ఉన్నాయి. వీటికి భగవంతుని ఆశీర్వాదాలు ఉన్నాయి. పాట పట్ల నాకు ఉన్న భయం, భక్తి... నా పాట పంచామృతం.

► పద్మం బురదలో వికసిస్తుంది. గళం అశ్లీల మాటలను ఎక్కువగా మాట్లాడుతుంది. ఈ బురదలో పూసిన ప్రతి పాట కూడా ఒక పద్మంలా ఉండాలని కోరుకుంటాను నేను. సరస్వతీదేవి కూర్చొనే ఆసనం పద్మం. నా ప్రతి పాట సరస్వతీదేవి పీఠం కావాలనే కోరికతో శ్రద్ధతోనే చేశాను. ఇకపై కూడా అలానే చేస్తాను.

► మీ (ప్రేక్షకులు) హృదయాల్లో నిక్షిప్తమైన, మీకు ఇష్టమైన భావాలను నేను పలికిస్తున్నాను కాబట్టి మీరు స్పందిస్తున్నారు. మీకు నచ్చని మాటలు మాట్లాడితే మెచ్చుకునేవారు కాదు. సీతారామశాస్త్రి మంచి పాటలు రాస్తారు అనే భావనకు వెళితే రేపు నేను తప్పు చేసినా మీ కంట పడదు. మీ గుండెల్లోని నిశ్శబ్దానికి ప్రతిధ్వని నేను. సినిమా కథ జీవితాల్లో నుంచే వస్తుంది. కాకపోతే కాస్త డ్రామా ఉంటుంది. ఎక్కడైతే మాట మూగబోతుందో అక్కడ పాట ఆలాపన మొదలవుతుంది అంటూ ‘సిరివెన్నెల’ తరంగాలు అనే పుస్తకం రాశాను.

► పద్మ అవార్డుని ఆశించలేదు. నా ప్రతి పాటను నేను అవార్డుగానే భావిస్తాను. ఎంతో మంది అభిమానించారు. వారి హృదయ స్పందనకన్నా పెద్ద అవార్డు ఉంటుందని అనుకోను. అవార్డు కోసం నేను ఎప్పుడూ అప్లై చేసుకోలేదు. నా ప్రతి పాట నాకు నచ్చుతుంది. ‘లాలిజో..లాలిజో ఊరుకో పాపాయి, గుమ్మాడి గుమ్మాడి...’ ఇలా అనేక పాటలు ఉన్నాయి.

► ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను అభిమానిస్తారు. నేను వ్యక్తిత్వానికి విలువిస్తాను. నువ్వు ఏం సాధించావ్‌? అంటే మానవ వ్యవసాయం చేసి హృదయాల్లో స్థానం సంపాదించానని చెబుతాను. రాజ్యం సంపాదించడం కంటే ఒక మనిషి హృదయంలో విలువైన స్థానం సంపాదించడానికే నేను ఇష్టపడతాను.

► నేనే నం.1... లాంటి పాటలు రాయడానికి ఇష్టపడను. ఎందుకంటే తెర ఆడే వరకే ఆ మాట మిగులుతుంది. కథానాయకుడిని పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు ‘గెలుపంటే పసిడి పతకాల తీరం కాదురా..’ అని రాశాను. ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం అని ఓ సందర్భంలో రాశాను. పాత్రకు సరిపోతుంది. కేవలం ఆ ఒక్క సందర్భానికి మాత్రమే కాకుండా అన్ని సందర్భాలకు అన్వయించవచ్చు.

► ఆకలేస్తుందని భయపడుతుంటాం. భయపడితే ఆకలి తీరుతుందా? ప్రకృతి కఠినంగానే ఉంటుంది. భయానికి ఎంత స్థానం ఇవ్వాలో తెలుసుకోవాలి. అలా ఏయే భావాలకు ఏయే స్థానాలు ఇవ్వాలో తెలిస్తే ‘ఇవాళ ఉన్నటువంటి ఇన్‌బ్యాలెన్స్‌ ఆఫ్‌ లైఫ్‌ తెలుస్తుంది. ఇలాంటి భావాలను పంచుకునేందుకు నాకు సినిమా రంగం దొరికింది. నేను సినిమా రంగాన్ని  దేవాలయం కంటే ఎక్కువ ప్రేమిస్తాను. సినిమా అన్నది నాటక శాస్త్రానికి యాంత్రిక స్వరూపం. ఒకే చోట.. చాలా చోట్లా ప్రదర్శించవచ్చు. సాహిత్యంలో అనేక రకాలున్నాయి. కథ, సాహిత్యం, నవల.. ఇలా పలు రకాలున్నాయి. నాటకానికి ఇంకా ముఖ్య స్థానం ఉంది. సినిమా వల్ల సమాజం పాడవుతుంది అంటారు. సినిమా వల్ల సమాజం బాగుపడుతుంది. సినిమా సమాజానికి అద్దం మాత్రమే. సినిమా కొత్తగా చూపించేది ఉండదు. 5 రూపాయలతో పెన్సిల్‌ తయారు చేసి, దాన్ని 7 రూపాయలకు అమ్మరు. ఆ శ్రమకు విలువ కట్టకుండా భౌతికంగా వెచ్చించే సమయానికి డబ్బులు తీసుకుంటుంది కాబట్టి ఇది ధర్మమైన వ్యాపారం చేస్తున్నాను అనే గర్వం పోవడం మన దురదృష్టం. ఒక్కసారి ఆ గర్వాన్ని మళ్లీ భావిస్తే తెలుగు సినిమా తన వైభవాన్ని చాటుతుందని అనుకుంటా.

► పాట రాయడం ప్రసవ వేదన అంటారు.  ఏ పనిలో కష్టం లేదు? కష్టపడకుండా ఏదీ రాదు. అమూల్యం అన్నదానికి రెండర్థాలున్నాయి. పొగరుగా ధ్వనించవచ్చు. పల్లవి నుంచి పాటలోని ఆఖరి వాక్యం వరకూ పాడుకుంటూ తమ జీవితాల్లోకి అన్వయించుకుంటూ ఆనందిస్తున్న వాళ్ల సంతోషానికి విలువ ఏం ఉంటుంది? పారితోషికం ఆలోచించకుండా, ఆశించకుండా పాటలు రాసిన సందర్భాలున్నాయి. అది త్యాగం అనుకోను. నా బాధ్యత అని భావిస్తాను.  నేను సైతం అని సహాయం చేస్తాను.

► కాలం మారదు. కాలం మారితే మనం బతకలేం. పంచభూతాలే మారనప్పుడు మనం మారడమేంటి? సభ్యంగా పూర్తిగా ప్యాంటు వేసుకునే దగ్గరి నుంచి చిరిగినవే వేసుకుంటున్నాం. ట్రెండ్‌ అండీ.. అంటారు. మన సమాజం తాలూకు సంస్కృతులు ఓవర్‌ల్యాప్‌ అవుతుంటాయి. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ అంటే వల. మౌస్‌ అంటుంటాం. ఎలుక తోక పట్టుకొని ముందుకు వెళ్లడం ఏంటి? చాటింగ్‌ అంటూ మాట్లాడటం మానేశాం. తెలుగులో ఎకిమీడ (రాజా) అని రాస్తే పట్టించుకోం. అదేదో ఫారిన్‌ భాష నుంచి కసరసకరస అని రాస్తే అర్రే బహు బాగుందే అని ఫీల్‌ అవుతుంటాం. తెలుగు వాళ్లు తమ తాలూకా ఉనికిని కోల్పోవడానికి ఎక్కువగా ముచ్చటపడుతుంటారు. ఇలాంటి తలకిందుల చేష్టలు కూడా మళ్లీ మామూలుగా అయిపోతాయనే అనుకుంటున్నాను.  

► ఒక పాట బయటకు రావడానికి దర్శక–నిర్మాతలు, సంగీత దర్శకుడు, రచయిత అభిప్రాయాలు కలవాలి. దీన్నే సాంఘిక జీవనానికి అన్వయిస్తే ఈ మధ్య మా అభిప్రాయాలు కుదరడం లేదని విడిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అభిప్రాయం కలవని ఇద్దరూ సాగించే ప్రయాణమే పెళ్లి అంటాను. నచ్చనది చెబుతూ నచ్చినవి స్వీకరించడమే ప్రయాణం. జీవితం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. సినిమా రంగం కూడా అలానే.  

► ట్యూన్‌కి రాయడమే ఆది నుంచి ఉన్నది . సినిమా నేర్పింది కాదిది. మనకు నూట ఒక్క వృత్తాలు ఉన్నాయి. ఇవన్నీ ట్యూన్లే. కవి చెప్పదలుచుకున్న భావానికి ఎటువంటి నడకైతే బావుంటుందో నువ్వే ఎంచుకొని అది రాయి. ట్యూన్‌కి రాయడం సాధారణ ప్రక్రియ. ట్యూన్‌ ఓకే చేసేశాం సార్‌ అంటుంటారు. ఓకే చేయాల్సింది నేను కదయ్యా అనిపిస్తుంది (నవ్వుతూ).

► నిర్మాత సంకల్పంలో లోపం ఉండదు. మంచి సినిమా తీయాలనే అనుకుంటారు.. అందరూ గౌరవించాలి. నేను నిర్మాతల రచయితను. ఇది వరకు పాటను రాత్రిళ్లు రాసేవాడిని.  ఆరోగ్య రీత్యా ఇప్పుడు కొంచెం తగ్గించాను. అయినప్పటికీ రాత్రుళ్లే రాస్తున్నాను.

పాట ఎందుకు?
కథ అడగని పాట ఎందుకు? ఇటీవల హిట్‌ అయిన సినిమాల్లో పాటలు గుర్తున్నాయా? వస్తున్నా సరే క్షమించి కూర్చుంటున్నారు. అంత అక్కర్లేని, ఆనందింపజేయలేని పాట పెట్టే బదులు ఆ పాటకు అయ్యే ఖర్చు మిగిల్చుకోవచ్చుగా. ఈ విషయం నిర్మాతలకు చెప్పాలి అనిపిస్తుంది. ఆరు నుంచి నాలుగుకు పడిపోయాయి. ఇప్పుడు మూడు అయ్యాయి. మెల్లిగా పల్లవి, ఆ తర్వాత రెండు వాక్యాలు చిత్రీకరిస్తున్నారు. పాట ఎందుకుండాలో, ఎప్పుడుండాలో అని కూర్చుని ఆలోచించి అవసరమైతే పెట్టండి. పాటలు ఎప్పటికీ ఉంటాయి. మనిషి ఉన్నంతకాలం పాటలుంటాయి.

ఆ భావాల్ని రాయను
ఏ పరిస్థితుల్లోనూ స్త్రీని కించపరచలేను. ఆమె పాత్ర ఏదైనా అవ్వొచ్చు. సెక్స్‌ వర్కర్‌ అవ్వొచ్చు. క్లబ్‌ డ్యాన్సర్‌ అవ్వొచ్చు. ఎంత ఘాటు శృంగారం అయినా, మోటు శృంగారం అయినా రాస్తాను. అది కూడా నా తల్లితోటి, చెల్లితోటి వినగలిగేలా రాస్తాను. అలాగే కుర్రకారుని రెచ్చగొట్టే పాటల్ని రాయను.
జీవితం ఏదైనా నేర్పుతుంది. బలవంతంగా జీవితం నేర్పే పాఠాల్ని వదిలేసి వయసు మళ్లే దాకా నాలుగు గోడల మధ్య చదివేదే చదువు అంటున్నాం. మనకు నాలుగు భాషలు రావు. ఆటో డ్రైవర్‌కి వస్తాయి.

ఎలా? అవసరం.
పాట పదాలలో లేదు. మాటల్లో కానీ, అక్షరాల్లో కానీ లేదు. వాటి పోహళింపు మధ్య ఉన్న నిశ్శబ్దంలో ఉంది పాట. కేవలం పదాల పదాల ప్రయోగం నుంచి బయట పడినప్పుడే సినీ గీత రచయితలు మంచి పాటలు రాయగలుగుతారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top