సీనియర్‌ నటుడు రాళ్లపల్లి కన్నుమూత

Senior Telugu Actor Rallapalli Narasimha Rao Has Passed Away In Maxcure Hospital - Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ సీనియర్‌ నటుడు రాళ్లపల్లి(63) శుక్రవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధపడుతూ  హైదరాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. రాళ్లపల్లి అసలు పేరు రాళ్లపల్లి వెంకట నరసింహా రావు. ఇంటి పేరుతోనే రాళ్లపల్లిగా ప్రసిద్ధి గాంచారు. రాళ్లపల్లి నరసింహారావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాళ్లపల్లి. స్త్రీ(1973) ఆయన మొదటి చిత్రం. చివరి చిత్రం భలేభలే మగాడివోయ్‌. సుమారు 850 చిత్రాల్లో రాళ్లపల్లి వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు.

ఊరుమ్మడి బతుకులు చిత్రానికి తొలిసారి నంది పురస్కారాన్ని అందుకున్నారు. చిల్లరదేవుళ్లు, చలిచీమలు చిత్రాలు రాళ్లపల్లికి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చాయి. జంధ్యాల, వంశీ చిత్రాల్లో కీలకపాత్రల్లో రాళ్లపల్లికి నటించే అవకాశం వచ్చింది. రాళ్లపల్లి మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాటక, బుల్లితెర, వెండితెరపై తన అసమాన నటనతో, రాళ్లపల్లి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. రచయితగా, దర్శకుడిగా తెలుగు సినీరంగానికి ఎనలేని సేవలందించారని అన్నారు.

రాళ్ళపల్లి మృతికి చిరంజీవి సంతాపం  
చెన్నైలోని వాణి మహల్ లో డ్రామాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్ళపల్లి గారిని కలిశాను. స్టేజ్ మీద ఆయన నటన చూసి ముగ్ధుడినయ్యాను. ఆయన నటనను ఎంతో అభిమానించే వాడిని. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు. నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. దాంతో ఆయనతో అనుబంధం పెరిగింది. ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. చక్కని స్నేహశీలి. చాలా రోజుల తర్వాత ఆ మధ్య 'మా' ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాను. 'ఎలా ఉన్నావు మిత్రమా?' అంటూ ఇద్దరం ఒకరిని ఒకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు అయ్యింది. ఇంతలో ఆయన తనువు చాలించారంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేసుకుంటున్నాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top