విషాదంలో బాలీవుడ్‌: ప్రముఖుల సంతాపం

Saroj Khan Passes Away: Bollywood Pays Tribute - Sakshi

ముంబై: బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. దిగ్గజ కొరియోగ్రాఫర్‌, జాతీయ అవార్డు గ్రహీత సరోజ్‌ ఖాన్‌(72) తుదిశ్వాస విడిచారు.  గత కొద్దిరోజులుగా శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆమె బాంద్రాలోని గురునానక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆమె మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆమె మరణం బాలీవుడ్‌ను దిగ్బ్రాంతికి గురిచేసింది. సరోజ్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. (ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత)

‘ఉదయం లేవగానే దిగ్గజ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ ఇక లేరనే విషాదకర వార్త విని దిగ్బ్రాంతికి గురయ్యాను. అమె కొరియోగ్రాఫీలో డ్యాన్స్‌ చేయడం చాలా సులభం. ఎవరితోనైనా డ్యాన్స్‌ చేయించగలరు. సరోజ్‌ ఖాన్‌ మరణంగా సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. అమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని అక్షయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.  

‘మనందరికి శాశ్వత గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు సరోజ్‌ ఖాన్‌. మనిషి కేవలం శరీరంతోనే కాదు హృదయంతో మరియు ఆత్మతో నృత్యం చేస్తాడు అని నృత్య కళాకారులకు మాత్రమే కాకుండా యావత్‌ దేశానికి చాలా అందంగా నేర్పించారు. ఆమె మరణం వ్యక్తిగతంతో ఎంతో తీరని లోటు. ఆమె తియ్యటి తిట్లను కూడా మిస్సవుతాను’ అంటూ అనుపమ్‌ ఖేర్‌ ట్వీట్‌ చేశారు. 

‘ఉదయం లేవవగానే గుండె పగిలిపోయే విషాదకర వార్త విన్నాను. మీ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ముఖ్యంగా మిమ్మల్ని స్పూర్తిగా తీసుకొని కొరియోగ్రాఫర్‌లుగా మారిన నా  లాంటి ఎంతో మందికి ఇది ఎంతో విషాదకర వార్త. మీతో కలిసి డ్యాన్స్‌ చేయడం, కొరియోగ్రాఫీలో డ్యాన్స్‌ చేయడం, మీతో కలిసి కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన క్షణాల మరిచిపోలేనివి. 

డ్యాన్స్‌పై మీకున్న ప్రేమ, అభిరుచి, ప్రతీ పాటకు మీరు కొరియోగ్రాఫీ చేసే విధానం ఎంతో మందికి స్పూర్తి. ఇలాంటి విషయాలు మాకు ఎన్నో నేర్పించినందుకు ధన్యవాదాలు. మీరెప్పుడూ మా గుండెల్లో నిలిచిపోతారు. సరోజ్‌ ఖాన్‌ కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజా భావోద్వేగ ట్వీట్‌ చేశారు. 

‘దిగ్గజ కొరియోగ్రాఫర్‌, మూడు సార్లు జాతీయ అవార్డు గ్రహీత సరోజ్‌ ఖాన్‌ (72) మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. ఆమె కొరియోగ్రాఫీ చేసిన 2000కు పైగా పాటలు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ విషాద సమయంలో సరోజ్‌ ఖాన్‌ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని సరోజ్‌ ఖాన్‌ మృతిపట్ల మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top