ఇది చాలదని చరణ్‌ అన్నారు

Sai Dharam Tej Speech AT Prati Roju Pandage Press Meet - Sakshi

‘‘మనకు నచ్చిన పని చేస్తూ, మనవారితో సంతోషంగా ఉంటే ‘ప్రతిరోజూ పండగే’. అందుకు తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులు కావాలి’’ అన్నారు సాయితేజ్‌. మారుతి దర్శకత్వంలో సాయితేజ్, రాశీఖన్నా జంటగా అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాస్‌  నిర్మించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఎస్‌కేఎన్‌ ఈ చిత్రానికి సహ–నిర్మాత. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి తేజ్‌ చెప్పిన సంగతులు.

► ఇది తాత–మనవడి కథ. ఐదు వారాల్లో తాత చనిపోతాడని తెలిసి, ఆయన బతికి ఉన్నంత కాలం సంతోషంగా ఉంచాలనుకుంటాడు మనవడు. తాత కోసం ఆ మనవడు ఏం చేశాడు? తాత తన జీవితంలో చేయాలనుకుని చేయలేని పనులను మనవడి సాయంతో చివరి రోజుల్లో ఎలా చేశారు? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇందులో తాత పాత్రలో సత్యరాజ్‌గారు, మనవడి పాత్రలో నేను నటించాను. నా తండ్రి పాత్రలో రావు రమేష్‌గారు నటించారు. ఉగాది పచ్చడిలా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. ఇందులో ఉన్న డైనింగ్‌ టేబుల్‌ సన్నివేశం తీసేటప్పుడు నా నిజ జీవితంలోని కొన్ని సంఘటనలకు కనెక్ట్‌ అయ్యాను.

► దాదాపు పదేళ్ల క్రితం మారుతి అన్నను ఓ సంద ర్భంలో కలిశాను. అప్పుడు ఓ కథ చెప్పారు. నిజానికి నాకు అప్పటికి యాక్టింగ్‌ అంటే ఇంట్రెస్ట్‌ లేదు. కానీ, కథ విన్నా. మారుతి అన్న డైరెక్షన్‌లో సినిమా చేయడం ఇప్పటికి కుదిరింది. అయితే అప్పుడు ఆయన చెప్పిన కథ ఇది కాదు. మా సినిమా విడుదలవుతున్న రోజునే మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. మా సినిమాతో  పాటు అవికూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను.

► ‘చిత్రలహరి’ సినిమా కోసం బరువు పెరిగాను. ‘ప్రతిరోజూ పండగే’ కోసం దాదాపు 20 కేజీలు తగ్గాను. ఈ సినిమాలో ‘హోమం’ చేస్తున్న ఓ సన్నివేశంలో ఫైట్‌ సీన్‌ కోసం షర్ట్‌ విప్పాల్సి ఉంటుంది. ్ఞఅలా ఆ సీన్‌లో సిక్స్‌ప్యాక్‌తో కనిపించాను.

► ఓసారి నేను వర్కౌట్స్‌ చేస్తున్నప్పుడు చరణ్‌ (రామ్‌చరణ్‌) చూశారు. ‘ఇది చాలదు’ అని ‘ధృవ’ సమయంలో తనకు జిమ్‌ ట్రైనర్‌గా ఉన్న రాకేష్‌ ఉదయార్‌ను సూచించారు. సరైన వర్కౌట్స్‌ చేసి బరువు తగ్గాను. మరోసారి బరువు పెరిగి తగ్గాలనుకోవడం లేదు. అంత ఓపిక లేదు (నవ్వుతూ).  

► చిరంజీవిగారు ‘ప్రతిరోజూ పండగే’ కథ విన్నారు. బాగా చేయాలన్నారు. చిరంజీవిగారి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. అది నాకు ప్లస్సో, మైనస్సో అనుకోవడం లేదు. ఒక బాధ్యతగా భావిస్తున్నాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top