అనుకున్న సమయానికే వస్తారు | RRR Release Not Postponed Says DVV Danayya | Sakshi
Sakshi News home page

అనుకున్న సమయానికే వస్తారు

Apr 5 2020 12:12 AM | Updated on Apr 5 2020 12:12 AM

RRR Release Not Postponed Says DVV Danayya - Sakshi

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌

‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) విడుదల వాయిదా పడుతుందని, ఇందులో ఆలియా భట్‌ నటించడం లేదనే పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు ఈ చిత్రనిర్మాత డీవీవీ దానయ్య. ‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన ఓలివియా మోరిస్, రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌ను ఎంపిక చేశారు.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ షెడ్యూల్స్‌ తారుమారు వల్ల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల వాయిదా పడుతుందని, ఈ సినిమాకి ఇచ్చిన డేట్స్‌ని ఓ హిందీ చిత్రానికి కేటాయించడంతో ఆలియా ఈ చిత్రం నుంచి తప్పుకుందనే వార్తలు ప్రచారంలోకొచ్చాయి. వీటిని కొట్టిపారేశారు దానయ్య. ‘‘ఈ నెల 15నుంచి ఆలియా భట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌లో జాయిన్‌ కావాల్సింది.

లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ పడటంతో ఆమె దగ్గర కొత్త కాల్షీట్లు తీసుకున్నాం. మేలో జరగబోయే పుణే షెడ్యూల్‌లో ఆలియా జాయిన్‌ అవుతారు. లాక్‌డౌన్‌ పూర్తయిన వెంటనే హైదరాబాద్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ను మొదలుపెడతాం. ఆ తర్వాత పుణే షెడ్యూల్‌ ఉంటుంది. మరోవైపు మేజర్‌ గ్రాఫిక్స్‌ వర్క్‌ కూడా పూర్తి కావొస్తున్నాయి. అనుకున్న ప్రకారమే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల చేస్తాం’’ అని ఓ ఆంగ్ల పత్రికతో పేర్కొన్నారు డీవీవీ దానయ్య.

Advertisement
 
Advertisement
Advertisement