బాబా ధ్యానం కోసం ఆశ్రమం

Revelations from 2.0 press meet: Why Rajinikanth is so simple and Akshay Kumar's role - Sakshi

‘‘ప్రతి సినిమా తర్వాత నేను హిమాలయాలు వెళతా.

హిమాలయాల్లోని గ్రామాల్లో, కొండల్లో సంచరిస్తా.

అక్కడ ఉండడమే మెడిటేషన్‌లా ఉంటుంది’’. – ఓ సందర్భంలో రజనీకాంత్‌

‘‘నిజ జీవితంలో నటించమని ఎవరూ నాకు డబ్బులివ్వరు. అందుకే చాలా సింపుల్‌గా ఉంటా’’ – దుబాయ్‌లో జరిగిన ‘2.0’ ప్రెస్‌మీట్‌లో రజనీ
‘‘రజనీ సార్‌ ఎక్కువగా మెడిటేషన్‌ చేస్తారు. ఆయన్నుంచి నాకది అలవాటైంది’’ ..‘2.0’ ప్రెస్‌మీట్‌లో అమీ జాక్సన్‌

మాసిన గడ్డం... తలపాగా... సాదాసీదా బట్టలు... బెంగళూరులోని రాఘవేంద్రస్వామి మందిరంలో ఓ ముసలతను ధ్యానం చేస్తున్నారు. ప్రతిరోజూ ఆ మందిరానికి వచ్చే ఒకామె ఆయన్ను చూశారు. దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత చూస్తే... ముసలతను మందిరంలో తిరుగుతూ కనిపించారు. అతని దగ్గరకు వెళ్లి... పది రూపాయల నోటును చేతిలో పెట్టారు. అతను తీసుకునేంతవరకూ ఆమె వదల్లేదు. నవ్వుతూ నోటును తీసుకుని, రెండు చేతులూ జోడించి ఆమెకు నమస్కరించాడతను. కాసేపటికి, మందిరం బయటకు వస్తుండగా, ముసలతను మెర్సిడీస్‌ బెంజ్‌ కారు ఎక్కుతూ కనిపించారు. వెంటనే పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళ్లిన మహిళ.. ‘‘అయ్యా! నన్ను క్షమించండి. మిమ్మల్ని ఇన్‌సల్ట్‌ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. మీ బట్టలు చూసి లైఫ్‌లో కష్టాలు పడుతున్నారనుకుని డబ్బులు ఇచ్చా. ఐయామ్‌ సారీ. క్షమించి నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి. ఐయామ్‌ సారీ’’ అన్నారు.

అప్పుడు పెట్టుడు గడ్డం, తలపాగాతో ఉన్న ముసలతను ఏం చెప్పారో తెలుసా?
‘‘అమ్మా... ఇందులో మీ తప్పేం లేదు. ‘యూ ఆర్‌ నథింగ్‌. యూ ఆర్‌ నాట్‌ స్పెషల్‌. నా ముందు ప్రతి ఒక్కరూ సమానమే’ అని సృష్టికర్త ఎవరో ఒకరి ద్వారా మళ్లీ మళ్లీ నాకు గుర్తు చేస్తున్నాడు. మళ్లీ మళ్లీ ఇదే సందేశం పంపిస్తున్నాడంతే. థ్యాంక్స్‌’’ అని నమస్కరించి అక్కణ్ణుంచి కారులో వెళ్లిపోయారు.
బెంజ్‌ కారులో వచ్చి, పది రూపాయల ధర్మం స్వీకరించిన ముసలతను ఎవరో కాదు... రజనీకాంత్‌. పైన చెప్పిన సంఘటన వాస్తవంగా జరిగినదే.

రాఘవేంద్రుడి భక్తుడు
రజనీకాంత్‌కి రాఘవేంద్ర స్వామి అంటే ఎంత భక్తి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన 100వ సినిమాగా ‘శ్రీ రాఘవేంద్ర’ వచ్చిందంటే... కారణమదే! రజనీ రాఘవేంద్రస్వామితో పాటు పరమహంస యోగానందనూ ఫాలో అవుతారు. ఆయన రాసిన ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతారు. రీల్‌ లైఫ్‌లో సూపర్‌ స్టార్‌ కానీ, రియల్‌గా మాత్రం ‘సింపుల్‌ మేన్‌’. రజనీకాంత్‌ ఎంత నిరాడంబరంగా జీవిస్తారో చెప్పడానికి పై సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే. ఓ సూపర్‌స్టార్‌ సామాన్య జీవితం గడపడమనేది సాధారణ విషయం కాదు. రజనీకి మాత్రమే అది సాధ్యం! నటుడిగా ఆయన ఎంత ఎత్తుకి ఎదిగినా... మనిషిగా మామూలు గానే ఉంటారు. అందుకే, ప్రతి ఏడాది హిమాల యాలు వెళ్లొస్తారు. అదీ సామాన్య మనిషిగా, ఎలాంటి హంగామాలు లేకుండా చాలా నిరాడంబరంగా! ఇప్పుడు ఏకంగా హిమాలయాల్లో ఓ ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారాయన.

హిమాలయాల్లో హోమ్‌
యస్‌... హిమాలయాల్లోనే రజనీ ఓ హోమ్‌ కట్టిస్తున్నారు! అవునా... ఎంతవుతుందో? సుమారు కోటి రూపాయలు! అంత ఖర్చుపెట్టి అక్కడ ఇల్లు కడుతున్నారా! ఎవరి కోసం? ప్రజలందరి కోసం! రజనీకాంత్‌లా మెడిటేషన్‌ చేయాలనుకునే వాళ్లందరూ బస చేయడం కోసం. ఎన్నో ఏళ్లుగా రజనీకాంత్‌ హిమాలయాలకు వెళ్లొస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు అక్కడ మెడిటేషన్‌ చేసి, తిరిగొస్తారు. ఈ క్రమంలో రజనీకి చెన్నై న్యాయవాది వి. విశ్వనాథన్, బెంగళూరు వ్యాపారవేత్త వీఎస్‌ హరి, ఢిల్లీకి చెందిన శ్రీధర్‌ రావు, వీఎస్‌ మూర్తి పరిచయమయ్యారు.

2002 నుంచి ఈ ఐదుగురూ హిమాలయాలకు వెళ్లొస్తున్నారు. ఇంకొకటి... వీళ్లందరూ పరమహంస యోగానంద భక్తులు, అనుచరులు. పరమహంస యోగానంద ‘యోగోద సత్సంగ సంఘం’ (వైఎస్‌ఎస్‌)ను స్థాపించి ఈ ఏడాదికి వందేళ్లు. ‘వైఎస్‌ఎస్‌’ శతవార్షికోత్సవం సందర్భంగా ఐదుగురు స్నేహితులూ హిమాలయల్లో (కొండలకు దగ్గరలో) ‘శ్రీ బాలాజీ ఆశ్రమం గురు శరణ్‌’ పేరుతో ఓ ఆశ్రమం (మెడిటేషన్‌ హౌస్‌) నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ ఆశ్రమం కన్‌స్ట్రక్షన్‌ మొదలైంది. ఇందులో మెడిటేషన్‌ చేయాలనుకునే భక్తులందరికి ఉచితంగా వసతి కల్పించనున్నారు. ఈసారి రజనీ హిమాలయాలకు వెళ్లినప్పుడు... ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఆశ్రమానికి వెళతారేమో? వాళ్ల దేవుడి (రజనీ) దర్శనం దొరుకుతుందని!!

బాబాకి ముందు... ఆ తర్వాత
రజనీకాంత్‌ నటించి, నిర్మించిన ‘బాబా’ చూసే ఉంటారు. అందులో పాత్ర కొంతవరకూ ఆయన రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉంటుందట. ‘బాబా’లో హీరోలా... రజనీ కూడా కెరీర్‌ స్టార్టింగ్‌లో మందు, సిగరెట్స్‌ తాగేవారట. తర్వాత ఆయనలో మార్పు వచ్చిందని అంటుంటారు. ‘బాబా’ తర్వాత మందు, సిగరెట్స్‌ మానేశారు.

దుబాయ్‌లో ‘2.0’ టీమ్‌ సందడి!
‘నాన్నా... నిన్నటి వరకూ ఓ లెక్క, ఈ రెండు రోజులూ ఒక లెక్క’ అన్నట్లుగా గురు, శుక్రవారాల్లో దుబాయ్‌కి కొత్త కళ వచ్చింది. మరి, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎంటరైతే ఆ మాత్రం కళ ఉండదా? ఇంకా చిత్రకథానాయిక అమీ జాక్సన్, విలన్‌గా నటించిన అక్షయ్‌కుమార్, చిత్రదర్శకుడు శంకర్, సంగీతదర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌... ఇలా ‘2.0’ టీమ్‌ ఆడియో వేడుక కోసం దుబాయ్‌ వెళ్లారు. బుర్జ్‌ పార్క్‌లో ఈ రోజు ‘2.0’ ఆడియో వేడుక జరుగుతుంది. నిన్న దుబాయ్‌ టవర్స్‌ ‘బుర్జ్‌ అల్‌ అరబ్‌’లో చిత్రబృందం అంతర్జాతీయ మీడియాతో సమావేశమైంది. ఈ సమావేశానికి హోటల్‌ నుంచి ‘బుర్జ్‌ అల్‌ అరబ్‌’కి రజనీ అండ్‌ కో హెలికాప్టర్‌లో వెళ్లారు. రజనీకాంత్, అమీ జాక్సన్‌ తదితరులకు అక్కడివారు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలను అందజేశారు. రజనీతో ఇష్టంగా ఫొటోలు దిగారు. నేడు ఈ సినిమా ఆడియో వేడుక జరగనుంది.

రజనీ పాట... రానా మాట!
అత్యంత భారీగా జరగనున్న ఈ ఆడియో వేడుకకు రానా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. రానా స్పాంటేనియస్‌గానూ మాట్లాడి, షోను రక్తి కట్టించగలరు. అందుకే అతన్ని హోస్ట్‌ చేయమని అడిగి ఉంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగు హోస్ట్‌గా రానా వ్యవహరిస్తారు. తమిళ్‌కి ఆర్జే బాలాజీ హోస్ట్‌. ‘‘భారతీయ సినిమా చరిత్రలో భారీ సినిమా ‘2.0’. దుబాయ్‌లో జరగనున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుకకు హోస్ట్‌గా చేస్తున్నా’’ అని రానా ఆనందం వ్యక్తం చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top