
రష్మికా మందన్నా
‘‘మేం చేసే సినిమాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉండొచ్చు. కానీ మా వ్యక్తిగత విషయాలను, మా కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడే అధికారం ఎవరికీ ఉండదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు రష్మికా మందన్నా. సోషల్ మీడియాలో సినిమా స్టార్స్ విమర్శలకు గురికావడం జరుగుతూనే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ రష్మికాను కోపానికి గురి చేసింది. ఆమెను వ్యక్తిగతంగా కించపరుస్తూ, విజయ్ దేవరకొండతో ఎఫైర్ నడుపుతున్నారనే ఉద్దేశం ధ్వనించేలా ఆ పోస్ట్ ఉంది.
ఆ పోస్ట్‌ని షేర్ చేసి, రష్మిక ఈ విధంగా తన కోపాన్ని వ్యక్తం చేశారు– ‘‘యాక్టర్స్ మీద ఇలాంటి విమర్శలు చేస్తే మీకు ఏమొస్తుందో అర్థం కావడం లేదు. యాక్టర్స్ అంటే సాఫ్ట్ టార్గెట్ అవుతారనా? పబ్లిక్ ఫిగర్ అయినంత మాత్రాన మమ్మల్ని డైరెక్ట్‌గా టార్గెట్ చేయొచ్చని కాదు. ‘నెగటివ్ కామెంట్స్‌ని పట్టించుకోకు’ అని చాలామంది చెప్పారు. చాలా కామెంట్స్‌ని పట్టించుకోవద్దనే అనుకుంటాను. ఏ యాక్టర్ కూడా ఇలాంటి విమర్శలను ఎదుర్కోకూడదనుకుంటున్నాను. యాక్టర్‌గా ఉండటం అంత సులువేం కాదు.
ప్రతీ వృత్తిని అందరూ గౌరవించాలి. కానీ అన్నింటికంటే ముందు ఒకరినొకరు గౌరవించడం మొదలుపెట్టాలి. ఈ పోస్ట్ ఎవరు పెట్టారో వాళ్లకు కంగ్రాట్స్. మీరు నన్ను నొప్పించాలనుకున్నారు. సక్సెస్ అయ్యారు’’ అని రష్మికా మందన్నా పేర్కొన్నారు. ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాల్లో విజయ్ దేవరకొండతో కలసి నటించారు రష్మిక. విజయ్ రష్మికా ప్రేమలో ఉన్నారనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. కానీ అలాంటిదేం లేదని రష్మిక పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.