వాళ్లపై కూడా ప్రేమ కురిపించు ప్రియాంక!

Rangoli Chandel Criticise Priyanka Chopra Over Post On Greta Thunberg - Sakshi

భారతదేశంలో కూడా పర్యావరణ ప్రేమికులు ఉన్నారని.. వారు ప్రకృతి పరిరక్షణకై ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని బాలీవుడ్‌ క్వీన్ కంగనా రనౌత్‌ సోదరి రంగోలి చందేల్‌ అన్నారు. అలాంటి వాళ్లపై కాస్త ప్రేమ కురిపిస్తే బాగుంటుందని గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాకు హితవు పలికారు. అసలు విషయమేమిటంటే... వాతావరణ మార్పులపై స్వీడన్‌ చెందిన 16 ఏళ్ల  గ్రెటా థంబర్గ్‌... ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాధినేతలను నిలదీసిన విషయం తెలిసిందే. ‘పర్యావరణం నాశనమైపోతోంది. ప్రజలు చనిపోతున్నారు. కానీ మీకు ఇవేమీ పట్టవు. డబ్బు, వృద్ధి అంటూ కట్టుకథలు చెప్తారు. మా తరాన్ని మోసం చేయడానికి మీకెంత ధైర్యం(హౌ డేర్‌ యూ). మేం మిమ్మల్ని క్షమించబోం’ అంటూ భావోద్వేగ ప్రసంగం చేసిన గ్రెటాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా కూడా సోషల్‌ మీడియా వేదికగా గ్రెటాను ప్రశంసించారు. ఈ మేరకు.. ‘మీ తరాన్ని ఒక వేదిక మీదకు తెచ్చి పర్యావరణ రక్షణ విషయంలో మా తరం చేస్తున్న నిర్లక్ష్యం గురించి ముఖంపై గుద్దినట్లు చెప్పినందుకు థ్యాంక్స్‌ గ్రెటా థంబర్గ్‌. అలాగే పర్యావరణ మార్పులపై మేం ఇంకా బాగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకతను చెప్పినందుకు అభినందనలు. అవును మిమ్మల్ని ఓడించడానికి మాకెంత ధైర్యం?  మనం బతకడానికి చివరకు మనకు ఈ ఒక్క గ్రహం మాత్రమే ఉంది’ అంటూ గ్రెటాను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఇక వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో ఉండే రంగోలి తాజాగా ప్రియాంక ట్వీట్‌పై స్పందించారు.

‘డియర్‌ ప్రియాంక చోప్రా.. అవును పర్యావరణ పరిరక్షణకై ఆ యువతి చాలా గొప్ప ప్రసంగాలు చేస్తున్న మాట నిజమే. అయితే మన దేశంలో కూడా ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. పర్యావరణం కోసం మనసా వాచా కర్మణా పనిచేస్తూ డబ్బు కూడా దానం చేస్తున్నారు. వాళ్లు కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా ఫలితాలు సాధించి చూపిస్తున్నారు. అలాంటి వాళ్లపై కూడా కాస్త ప్రేమ కురిపించండి ప్రియాంక బాగుంటుంది’అంటూ ప్రియాంకపై రంగోలి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా కావేరీ కాలింగ్‌ అనే పర్యావరణ కార్యక్రమం కోసం రంగోలి సోదరి కంగనా రూ. 42 లక్షలు దానం చేసిన సంగతి తెలిసిందే. కావేరీ బెల్ట్‌లో చెట్లు నాటే ఈ ఉద్యమానికి లియోనార్డో డికాప్రియో వంటి పలువురు హాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా మద్దతు ప్రకటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top