డాడీ... బాబాయ్... నేను రెడీ..!

డాడీ... బాబాయ్... నేను రెడీ..! - Sakshi


చేసింది స్టంట్‌మేన్ కేరెక్టర్. ఏ సినిమాకీ తగలనన్ని గాయాలు తగిలాయి. అయినా ‘బ్రూస్‌లీ’ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేశానంటున్నారు రామ్‌చరణ్. చాలా రోజుల తర్వాత మీడియాతో చాలా విషయాలు మాట్లాడారు చరణ్.

 

 ‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘బ్రూస్‌లీ’ చేయడానికి కారణం ఏంటి?

 గతేడాది అక్టోబర్‌లో ‘గోవిందుడు అందరివాడేలే’ విడుదలయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘బ్రూస్‌లీ’ మొదలు కావాల్సింది. సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఈ సినిమా ఉండాలనుకున్నాం. ఇప్పటివరకూ ప్రేక్షకులకు తాను అలవాటు చేసిన కామెడీకి డిఫరెంట్‌గా ఈ చిత్రం ఉండాలని శ్రీనూగారు అనుకున్నారు. కొత్త తరహా ఎంటర్‌టైన్‌మెంట్ ట్రై చేశారు. దానికోసం బాగా స్క్రిప్ట్ వర్క్ చేశారు. ఏప్రిల్‌లో మొదలుపెట్టాం.

 

 ‘బ్రూస్‌లీ’ చేసిన చిత్రాల్లో మీకు బాగా నచ్చినది?

 ప్రతి స్టంట్ మేన్‌కీ నచ్చే వ్యక్తులు బ్రూస్‌లీ, జాకీచాన్. బ్రూస్‌లీ చేసిన చిత్రాల్లో నాకు ‘ఎంటర్ ది డ్రాగన్’ ఇష్టం. ఆయన సినిమాల్లో కేవలం ఫైట్స్ మాత్రమే కాదు. ఓ ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ అందరికీ అర్థమయ్యేలా, టచ్ చేసేలా ఉంటుంది. బ్రూస్‌లీ చిత్రాలను ఆదర్శంగా తీసుకునే ఈ చిత్రంలో బ్రదర్, సెంటిమెంట్‌ని డిజైన్ చేశారు.

 

 మీ నాన్నగారి 150వ చిత్రాన్ని నిర్మిస్తాన్నారు.. మీ సినిమాలో ఆయన్ను  అతిథిగా చేయించడంవల్ల ఇది 150వ సినిమా అయిపోతుంది కదా?

 ఈ సినిమాలో నటింపజేయాలన్న డెసిషన్ శ్రీను వైట్లగారిది. ఆయనే నాన్నగార్ని అడిగారు. కథ, సందర్భం విని నాన్నగారు కన్విన్స్ అయ్యారు. సందర్భానుసారం ఓ పెద్ద ఇమేజ్ ఉన్న నటుడు అవసరం. ఒకవేళ నాన్నగారు ఒప్పుకుని ఉండకపోతే ఆ సందర్భాన్ని తీసేసేవాళ్లం లేకపోతే రీ-వర్క్ చేసేవాళ్లం. రెండున్నర, మూడు గంటలు కనిపించే ఫుల్ ప్లెడ్జెడ్ రోల్ అయితే అప్పుడు దాన్ని 150వ సినిమా అనొచ్చు అని నాన్నగారు అన్నారు. ఈ చిత్రంలో జస్ట్ మూడు నిముషాలే కనిపిస్తారు కాబట్టి 150వ సినిమాకి ఇది టీజర్‌లాంటిది.

 

 చిరంజీవిగారితో ఫైట్‌తో పాటు సాంగ్ చేయిస్తారనుకుని అభిమానులు ఆశిస్తే సాంగ్ వద్దని మీరే అన్నారట. ఎందుకని?

 ఫైట్ సిట్యుయేషన్‌తో పాటు సాంగ్ చేయిద్దాం అని శ్రీనూగారు అంటే వద్దనున్నాను. ఎందుకంటే 150వ సినిమాకి స్పెషాల్టీ ఉండాలి కదా.

 

 మీ నాన్నగార్ని దాటుకుని వెళ్లాలని మీకుంటుందా?

 అలా వెళ్లాలని కలలో కూడా అనుకోను. నాన్నగారి వెనకాల నేను అన్నదే నాకు బాగుంటుంది. ఎప్పటికీ అలా ఉండటమే నాకు ఆనందంగా ఉంటుంది. దానికి మించి ఈ జీవితంలో నాకేమీ వద్దు.

 

 మరో వారం రోజుల వరకూ ఏ పెద్ద సినిమా విడుదల కాకపోతే ‘రుద్రమదేవి’కి హెల్ప్ అవుతుంది. మరి.. ‘బ్రూస్‌లీ’ విడుదలను వాయిదా వేయమని మిమ్మల్ని ఎవరైనా అడిగారా?

 గుణశేఖర్‌గారు నన్నడిగారు. విడుదల తేదీ అనేది నా చేతుల్లో ఉండదు. అది పూర్తిగా నిర్మాతల బాధ్యత. ఈ సినిమా ప్రారంభించిన రోజునే దసరాకి విడుదల అని చెప్పేశాం. ‘రుద్రమదేవి’ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. తెలిస్తే ఏదైనా చేయగలిగేవాళ్లం. ఆ సినిమా ఆడాలని మా ఫ్యామిలీ మొత్తం కోరుకున్నాం. నాన్నగారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. బన్నీ యాక్ట్ చేశాడు. అయితే ఆ చిత్రం విడుదల వాయిదా పడుతూ రావడంవల్ల గ్యాప్ లేకుండాపోయింది. ఇలాంటి  పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ‘బాహుబలి’ అప్పుడు రాజమౌళిగారు ‘శ్రీమంతుడు’ని కొంచెం వాయిదా వేస్తే బాగుంటుందని అన్నారట. ‘కిక్ 2’ని కూడా వాయిదా వేసుకున్నారు. అలాగే, ‘ఆగడు’ అప్పుడు శ్రీను వైట్లగారు నన్నడిగారు. అంత హెల్దీగా ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు.

 

 పెద్ద స్టార్స్ సినిమాలు పండగ అప్పుడు విడుదలైతేనే కాదు.. ఎప్పుడు విడులైతే అప్పుడు పండగ అని దాసరిగారు అన్నారు..

 ఆయన చెప్పిన మాట మంచిదే. వినడానికి చాలా బాగుంది. కానీ ప్రాక్టికల్‌గా సాధ్యమా అని తెలియడంలేదు.

 

 తమిళ చిత్రం ‘తని ఒరువన్’ రీమేక్‌లో నటించాలనుకోవడానికి కారణం?

 ఒకప్పుడు రీమేక్స్ చేయకూడదనుకునేవాణ్ణి. నాన్నగారు చేసిన ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’, ‘ఠాగూర్’, బాబాయ్ చేసిన ‘గబ్బర్ సింగ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘తని ఒరువన్’ మేకింగ్ చాలా బాగుంటుంది. తెలుగుకి అనుగుణంగా దర్శకుడు సురేందర్‌రెడ్డి వర్కవుట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో కన్నా విలన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. విలన్ క్యారెక్టర్‌కి ఆర్టిస్ట్ సెట్ కాగానే షూటింగ్ మొదలుపెడతాం.

 

 పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం చేయాలని లేదా?

 గౌతమ్ మీనన్‌తో చేయబోయేది లవ్‌స్టోరీ. ‘ఏ మాయ చేశావె’లా ఫైట్స్ ఏమీ లేకుండా ప్యూర్ లవ్‌స్టోరీ చేస్తే నా ఆడియన్స్ ఒప్పుకుంటారా? లేదా? అనేది చూడాలి.

 

 వైట్ హార్స్ ప్రొడక్షన్స్, కొణిదెల పేరుతో నిర్మాణ సంస్థలు ఆరంభించారు కదా.. ఎలాంటి చిత్రాలు నిర్మించాలనుకుంటున్నారు?

 వైట్ హార్స్‌పై కొత్తవాళ్లతో చిన్న బడ్జెట్ చిత్రాలు చేయాలని ఉద్దేశం. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పెద్ద బడ్జెట్ చిత్రాల కోసం. వైట్ హార్స్ ఎనౌన్స్ చేసిన వెంటనే తేజు (సాయిధరమ్ తేజ్), శిరీష్ ఫోన్ చేసి కొత్త దర్శకులు ఉన్నారు.. కథ చెబుతారని అన్నారు. ‘బ్రూస్‌లీ’ చిత్రంతో పాటు, డాడీ 150వ చిత్రం, సురేందర్‌రెడ్డితో సినిమా పనుల మీద బిజీగా ఉన్నాను. ఇవి పూర్తయ్యాకే వైట్ హార్స్ సంస్థపై సినిమాలు నిర్మిస్తానని వాళ్లతో అన్నాను.

 

 కొత్త దర్శకులతో సినిమాలు చేయాలనుకోవడంలేదా?

 మనకు బోల్డంత మంది ఆర్టిస్టులు ఉన్నారు. దర్శకులు తక్కువయ్యారు. కొత్తవాళ్లు రావాలి. మంచి కథతో ఎవరు వచ్చినా నేను చేయడానికి రెడీ. ఈ మధ్య చూసినవాటిలో ‘సినిమా చూపిస్త మావ’, ‘భలే భలే మగాడివోయ్’ చాలా నచ్చాయి. ఆ చిత్రదర్శకులు మంచి కథలు రెడీ చేసుకుని పెద్ద సినిమాలు ట్రై చేస్తే బాగుంటుంది. మారుతివంటి దర్శకులు వచ్చి కథ చెప్తే కచ్చితంగా ఎంకరేజ్ చేస్తా.

 

 మీ నాన్నగారి 150వ చిత్రానికి సంబంధించిన సెకండాఫ్ కథ నచ్చలేదని తనతో చెప్పకుండా మీడియాకి చెప్పారని పూరి జగన్నాథ్ అనడంపై మీ కామెంట్?

 పూరీగారికి క్లియర్‌గా చెప్పాం. మరి.. ఆయన ఎందుకలా అన్నారో తెలియదు. ‘లోఫర్’ సినిమాతో బిజీగా ఉన్నారు

  కాబట్టి, డిస్ట్రబ్ చేయడం సరికాదనిపించింది. ‘లోఫర్’ తర్వాత సెకండాఫ్ చేస్తానని పూరీగారు అన్నారు.

 

 పవన్ కల్యాణ్‌తో నిర్మించాలనుకున్న చిత్రం గురించి?

 ఆ సినిమా గురించి బాబాయ్, నేనూ మాట్లాడుకున్నాం. ఆయన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో, నేను నా సినిమాలతో బిజీగా ఉన్నాం. ఒక స్క్రిప్ట్ వర్కవుట్ చేస్తున్నాం. మొన్న బాబాయ్ సాంగ్ షూట్‌లో ఉన్నప్పుడు కలిశా. వచ్చే ఏడాది ఆ సినిమా ఉండొచ్చు.

 

 మీ నాన్నగారు, బాబాయ్, మీరు కలిసి సినిమా చేస్తారా?

 ముగ్గురం కలిసి సినిమా చెయ్యాలి కాబట్టి చేయకూడదు. మాకు తగ్గ కథ కుదరాలి. అంతేకానీ మా కాంబినేషన్ వేస్ట్ కాకూడదు.

 

 ‘కత్తి’ చిత్రం చిరంజీవిగారికి నచ్చిందట.. 150వ చిత్రం అదే అవుతుందా?

 నాన్నగారు చూశారు. ఆయనకు నచ్చింది. అదే 150వ చిత్రం అవుతుందా? అని చెప్పలేను. 151, 152 చిత్రాలకు కథలు రెడీగా ఉన్నాయి. శ్రీను వైట్లగారు, వినాయక్‌గారు రెడీగా ఉన్నారు. అయితే ముందు 150వ చిత్రం కుదరాలి. సామాజిక అంశం, వినోదం.. ఈ రెండూ ఉండే సినిమా చేయాలని నాన్నగారు అనుకుంటున్నారు. చాలా విరామం తర్వాత చేస్తారు కాబట్టి, అర్థవంతమైన చిత్రం చేయాలి. జనవరికల్లా ఆరంభించాలనుకుంటున్నాం. దసరా లోపే నాన్నగారు 150వ చిత్రం ప్రకటిస్తారు.

 

 ‘బ్రూస్‌లీ’ కోసం నాన్‌స్టాప్‌గా వర్క్ చేశారు.. మరి రిలాక్సేషన్ సంగతేంటి?

 ‘ఎక్కడికైనా తీసుకెళ్తావా? సినిమాలేనా?’ అని నా వైఫ్ ఉపాసన అడుగుతోంది. ‘బ్రూస్‌లీ’ కోసం పడిన కష్టం తాలూకు ‘పెయిన్స్’ తగ్గాలంటే ముందు కేరళ వెళ్లి, ‘పెయిన్ మేనేజ్‌మెంట్’ ట్రీట్‌మెంట్  చేయించుకోవాలి అంటే, అలిగింది. సో.. ముందు హాలిడే ట్రిప్ వెళ్లాలి.

 

 ఖాళీ టైమ్‌లో ఏం చేస్తారు?

 బేసిక్‌గా నాకు లవ్‌స్టోరీస్ ఇష్టం. ఖాళీ సమయాల్లో ఇంట్లో అవి చూస్తాను. మా ఫామ్‌లో గుర్రాలు, ఒంటె ఉన్నాయి. అమలగారు చెబితే ఒంటెను దత్తత తీసుకున్నాం. వాటితో స్పెండ్ చేస్తాం.

 

 ఇంతకుముందు కొంచెం అగ్రెసివ్‌గా ఉండేవారనిపించేది.. ఇప్పుడు అలా కాకుండా చాలా మెచ్యుర్డ్‌గా, ప్రశాంతంగా ఉండటానికి కారణం ఏంటి?

 అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకూడదని నిర్ణయించుకున్నా. వాటి మీద మనసు పెట్టడం వల్ల ఎనర్జీ వృథా తప్ప ఉపయోగం ఉండదని తెలుసుకున్నాను. అదే ఎనర్జీని నా ఫ్యామిలీకి, షూటింగ్స్‌కి కేటాయిస్తే మంచిదనిపించింది.

 

 ఎన్టీఆర్, బన్నీ ఫాదర్‌హుడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.. మరి మీరెప్పుడు?

 ఇప్పుడే అన్నారు మెచ్యుర్టీ వచ్చిందని. ఫాదర్ హుడ్‌కి ఇంకా మెచ్యూర్ అవ్వాలి (నవ్వుతూ).

 

 పదేళ్లుగా అయ్యప్ప మాల వేసుకుంటున్నా!

 నాన్నగారి ఇరుముడి తీసుకెళ్లడానికి నేను మాల వేసుకునేవాణ్ణి. ఆయన వెళితే క్రౌడ్ ప్రాబ్లమ్ అవుతుంది. అందుకని నేను వేసుకునేవాణ్ణి. అది అలవాటైపోయింది. షూటింగ్ అప్పుడు ఎప్పుడూ వేయలేదు. ‘బ్రూస్‌లీ’ సమయంలో వేసుకున్నాను. అమ్మ మొక్కు తీర్చడానికి ఆ మధ్య అమరనాథ్ యాత్రకెళ్లాను.

 

 అమ్మ కళ్లు చెమర్చాయి!


 నాన్నగారు మేకప్ వేసుకుని షూటింగ్‌కి వస్తుంటే అమ్మ కళ్లు చెమర్చాయి. ఆయన లుక్, కాస్ట్యూమ్స్ నేనే డిజైన్ చేశాను. క్లీన్ షేవ్ చేసుకుందామా? లేక గడ్డంతో కనిపించాలా? అని నాన్నగారు ఆలోచిస్తుంటే నాకు ‘గ్యాంగ్ లీడర్’ గుర్తొచ్చింది. అందుకని చిన్న గడ్డం పెట్టమన్నాను. నేను ఏడు గంటలకల్లా లొకేషన్‌కి వెళ్లిపోయాను. నాన్నగారి గెటప్‌తో లొకేషన్‌కి ఎంటరయ్యేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’కన్నా ముందు.. ఇంకా చెప్పాలంటే.. 1990లలో ఎలా ఉండేవారో అంత యంగ్‌గా కనిపించారు. మేమిద్దరం గుర్రం మీద వచ్చే సీన్ ఒకటి ఉంటుంది. ‘మగధీర’లో వాడిన గుర్రాన్నే వాడాను. నాన్నగారు మాత్రం అప్పటివరకూ అలవాటు లేని గుర్రం వాడారు. ఓ వైట్ హార్స్ నచ్చడంతో ఆయన కావాలని అడిగి, మరీ చేశారు. జస్ట్ అలా గుర్రం ఎక్కారో లేదో ఇలా కంట్రోల్ చేసేశారు. నాన్నగారి క్యారెక్టర్ సెకండాఫ్‌లో ఉంటుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top