తలైవా.. నీకిది తగునా..?

Rajinikanth Fans Upset on Buzzy With Movies in Election Time - Sakshi

సినిమాలతో రజనీ బిజీబిజీ

తీవ్ర నిరాశలో అభిమానులు

రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన

సినిమా:  నటుడు రజనీకాంత్‌ రాజకీయాలకు దూరంగా, తాజా సినిమాతో బిజీ బిజీగా ఉండడం పలు విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్‌ అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. గత 20 ఏళ్లుగా రాజకీయ రంగప్రవేశం చేస్తానని ఊరిస్తున్న రజనీ, ఆయన అభిమానుల్లో ఆశలు రేకిస్తూ వచ్చారు. ఎట్టకేలకు 2017లో రాజకీయ రంగప్రవేశం గురించి బహిరంగంగా వెల్లడించారు. అప్పటి నుంచే ఆయన అభిమానుల్లో హడావుడి మొదలయ్యింది. రజనీ తన అభిమాన సంఘాలను రజనీ ప్రజా సంఘాలుగా మార్చారు. జిల్లాల్లో నిర్వాహకులను ఎంపిక చేసి రాష్ట్ర వ్యాప్తంగా సభ్యుల నమోదు కార్యక్రమాలను చేపట్టారు. దీంతో ఇక పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటించడమే తరువాయి అన్నంతగా అభిమానులు సంబర పడిపోయారు. అందుకు తగ్గట్టు గానే రజనీకాంత్‌ తరచూ కార్యకర్తలను కలుస్తూ, వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, పలు ఆదేశాలను జారీ చేశారు. వ్యతిరేక చర్యలకు పాల్లడుతున్న అభిమానులను తొలగిస్తూ, డబ్బున్న వారికే రజనీకాంత్‌ పదవులను కట్టబెడుతున్నారనే విమర్శల పాలయ్యారు. ఆయన మాటకు కట్టబడి పని చేస్తున్న రజనీ ప్రజా సంఘ నిర్వాహకులు, కార్యకర్తలు పార్లమెంట్‌ ఎన్నికల ముందే రజనీకాంత్‌ పార్టీ పేరును ప్రకటిస్తారని, ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆశించారు.

శాసనసభ ఎన్నికలే లక్ష్యం..
కాగా ఇటీవల నటుడు రజనీకాంత్‌ పార్లమెంట్‌కు, ఉప ఎన్నికలకు పోటీ చేయననీ, తమ పార్టీ లక్ష్యం శాసనసభ ఎన్నికలేనని ప్రకటించడంతో ఆయన ప్రజా సంఘ కార్యకర్తలు పూర్తిగా డీలా పడిపోయారు. రజనీకాంత్‌ శాసనసభ ఎన్నికలకు రెడీ అవుతానంటున్నారనీ, అప్పటి వరకూ ప్రజా సంఘాల సభ్యులుగా చేరిన వారి పరిస్థితి ఏమిటని, వారు అలానే ఉంటారో, లేక మరో మార్గం చేసుకుంటారో తెలియదని, అలాంటి వారికి ఆయన ఏం సమాధానం చెబుతారనే ప్రశ్న నిర్వాహకుల్లో వ్యక్తం అవుతోంది.

కమల్‌ ఆశావాహం..
కాగా మరో పక్క కమలహాసన్, రజనీకాంత్‌ కంటే వెనుక పార్టీని ప్రారంభించి పార్లమెంట్‌ ఎన్నికలకు దూసుకుపోవడం రజనీకాంత్‌ అభిమానులకు కంటగింపుగా మారింది. అంతే కాదు రజనీకాంత్‌ తనకు మద్దతు ఇస్తారనే నమ్మకం ఉందంటూ కమలహాసన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రజనీకాంత్‌ అభిమానులకు పుండు మీద కారం చల్లినట్లయ్యిందంటున్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదనీ, కాబట్టి తమ పార్టీ పేరుతో గానీ, తనపేరును గానీ ఎవరూ వాడుకోవద్దనీ రజనీకాంత్‌ ప్రకటించారు. దీంతో అయోమంలో పడ్డ ఆయన అభిమానులు కమలహాసన్‌కు మాత్రం తాము ఓటు వేయమనీ, ఆయనే తమ పార్టీకి ప్రత్యర్ధి అని అంటున్నారు.

షూటింగ్‌లో బిజీ
ఇలాంటి పరిస్థితుల మధ్య రజనీకాంత్‌ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన తాజా చిత్ర షూటింగ్‌ పనుల్లో మునిగిపోయారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఆయన నటించనున్న తాజా చిత్ర షూటింగ్‌ను ఏప్రిల్‌ 8వ తేదీన ప్రారంభించాల్సిందిగా యూనిట్‌ వర్గాలకు చెప్పినట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్‌ పూర్తిగా ముంబాయిలో జరగనుంది. దీంతో ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ రజనీకాంత్‌ ముంబాయిలోనే ఉంటారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రమే ఆయన చెన్నైకి వస్తారని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top