దర్బార్‌ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టమా?

Rajinikanth Darbar Movie Distributors Loss - Sakshi

పెరంబూరు : దర్బార్‌ చిత్రం బయ్యర్లకు సుమారు రూ.20 కోట్లు నష్టం తెచ్చిపెట్టిందన్న వదంతులు ప్రచారమవుతున్నాయి. నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ బయ్యర్లు శుక్రవారం చెన్నైలోని రజనీకాంత్‌ ఇంటికి చేరుకున్నారు.  లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రం గత నెల 8వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన నాలుగు రోజులకే దర్బార్‌ చిత్రం 100 కోట్లు వసూలు చేసిందని ప్రచారం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో కొందరు బయ్యర్లు దర్బార్‌ చిత్రం నష్టాన్ని తెచ్చిపెట్టిందని ప్రచారం సాగిస్తున్నారు. దర్బార్‌ చిత్రాన్ని దక్షిణ జిల్లాల హక్కులను మదురైకి చెందిన ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కొనుగోలు చేశాడు. దర్బార్‌ చిత్రం తనకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతూ ఆ చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల వివరాలను తీసుకుని చెన్నైకి చేరుకున్నారు.

దర్బార్‌ చిత్రాన్ని డిస్టిబ్యూటర్లు మినిమమ్‌ గ్యారెంటీ విధానంతో కొనుగోలు చేశారు. కొందరు బయ్యర్లు లైకా ప్రొడక్షన్స్‌ కార్యాలయానికి వెళ్లి తమకు నష్టం వచ్చిందని మొరపెట్టుకున్నారు. లైకా సంస్థ నిర్వాహకులు తమకే రూ.40 కోట్లు నష్టం ఏర్పడినట్లు తెలిపిందని చెబుతూ దర్శకుడు ఎ.ఆర్‌.మురగదాస్‌ రూ.60 కోట్లు పారితోషికం తీసుకున్నారని, ఆయన్ను వెళ్లి అడగండి అని పంపించినట్లు సమాచారం. ఆ బయ్యర్లు మురుగదాస్‌ ఇంటికి వెళ్లగా, అక్కడ ఆయనకు సంబంధించిన వ్యక్తులు మురుగదాస్‌ లైకా సంస్థ అల్లు అర్జున్‌ హీరోగా నిర్మిస్తున్న చిత్ర షూటింగ్‌కు వెళ్లారని చెప్పారు. దీంతో రజనీకాంత్‌ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలిసిన మీడియా అక్కడికి చేరుకుంది. మీడియాను చూసిన ఆ బయ్యర్లు అక్కడకు ఎందుకువచ్చామన్న బదులు చెప్పకుండా జారుకున్నారు. మొత్తం మీద దర్బార్‌ చిత్ర వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నటుడు రజనీకాంత్‌ ఇటీవల కర్ణాటక రాష్ట్రం మైసూర్‌ సమీపంలోని బందీపురంలో నటించిన మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ డాక్యుమెంట్‌ చిత్రం వచ్చే ఏప్రిల్‌లో డిస్కవరీ ప్రచారం కానున్నట్టు తెలిసింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top