'టికెట్‌ ధరలను నియంత్రించాలి' | Sakshi
Sakshi News home page

'టికెట్‌ ధరలను నియంత్రించాలి'

Published Tue, Aug 29 2017 10:02 AM

Plea over overpricing of movie tickets in tamilnadu

సాక్షి, చెన్నై: కొత్త చిత్రాల విడుదల సమయాల్లో థియేటర్ల యాజమాన్యాలు అధిక ధరలకు టిక్కెట్లను విక్రయించడాన్ని నియంత్రించాలని చెంబియత్తు గ్రామానికి చెందిన దేవరాజన్ మద్రాస్‌ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో రాష్ట్రంలో కొత్త చిత్రాల విడుదల సమయంలో థియేటర్ల యాజమాన్యం తొలి ఐదు రోజులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఇది పెద్ద హీరోల చిత్రాలకు మరింత ఎక్కువన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2009లో థియేటర్ల టిక్కెట్‌ ధరల పట్టికను నిర్ణయించిందని, ఆ ప్రకారం ఏసీ, ఇతర సౌకర్యాలు ఉన్న థియేటర్లలో రూ. 10 నుంచి 120 వరకూ టిక్కెట్ల ధరను, అలాంటి సౌకర్యాలు లేని థియేటర్లలో టికెట్ల ధర రూ.5 నుంచి 50 గా నిర్ణయించిందన్నారు. అయితే ఇందుకు భిన్నంగా కొత్త చిత్రాల విడుదల సమయాల్లో టిక్కెట్ల ధరలు రూ. 200 నుంచి 300 వరకు ఉంటున్నాయని తెలిపారు.

ఈ విధానాన్ని అడ్డుకోవాలని గత 17 నుంచి 22 తేదీ వరకూ ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి, ఆదాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించ లేదన్నారు. ఇటీవల విడుదలైన వివేకం చిత్రాన్ని చూడడానికి వచ్చే ప్రేక్షకుల నుంచి టిక్కెట్‌ ధరను అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా వసూలు చేస్తున్న థియేటర్ల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా వాటి నుంచి రోజుకు రూ. లక్ష చొప్పున అపరాధరుసుం వసూలు చేయాలన్నారు.

అందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రత్యేక కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిష¯ŒS సోమవారం విచారించిన న్యాయమూర్తి ఎం.దురైస్వామి బదులివ్వాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి,  విచారణను సెప్టెంబర్‌ 11వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement
Advertisement