మాయలో పడ్డారు

Padipoya Nee Mayalo Movie Trailer  - Sakshi

అరుణ్‌ గుప్తా, సావేరి, జయవర్థన్‌ ముఖ్య తారలుగా రూపొందుతోన్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘పడిపోయా నీ మాయలో’. ఆర్‌.కె. కాంపల్లి దర్శకత్వంలో మహేశ్‌ పైడ, భరత్‌ అంకతి నిర్మిస్తున్నారు. జయవర్ధన్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ రిలీజ్‌ చేశారు. తొలి సీడీని దర్శకుడు ఎన్‌.శంకర్‌ అందుకున్నారు. ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ– ‘‘సినిమా రంగం కొన్ని కుటుంబాలకే పరిమితమైపోతున్న ఈరోజుల్లో తెలంగాణ యువత సినిమా తీయడానికి ముందుకు రావడం గొప్ప పరిణామం.

తెలంగాణ వారికి తపన ఉన్నప్పటికీ గతంలో అవకాశాలు అరుదుగా ఉండేవి. ఇప్పుడా పరిస్థితులు లేవు. అంతటా ఆదరణ లభిస్తోంది’’ అన్నారు. ‘‘నాకు పూరిగారంటే పిచ్చి. ఆయనలా సినిమా తీయాలనేది నా కల. ఇదే బ్యానర్‌లో నా రెండో సినిమా కూడా చేస్తా’’ అన్నారు ఆర్‌.కె. కాంపల్లి. ‘‘వినోదాత్మక ప్రేమకథా చిత్రమిది. సినిమా పూర్తయింది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. సంగీత దర్శకుడు జయవర్థన్, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top