నాన్న పొగిడారని పార్టీ చేసుకున్నాను

O Pitta Katha Movie Release On 6th March - Sakshi

‘‘బ్యాక్‌గ్రౌండ్‌ ఉంటే అవకాశాలు వచ్చేస్తాయి అనుకోవడం సరైన అభిప్రాయం కాదు. బ్యాక్‌గ్రౌండ్‌ తొలి అవకాశం వరకే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎవ్వరైనా కష్టపడాల్సిందే’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌. ‘ఓ పిట్ట కథ’ సినిమా ద్వారా సంజయ్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. విశ్వంత్, సంజయ్, నిత్యా శెట్టి ముఖ్యపాత్రల్లో దర్శకుడు చెందు ముద్దు తెరకెక్కించిన ఈ సినిమాను వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఈ నెల 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ– ‘‘చిన్న ప్పుడు ‘లిటిల్‌ సోల్జర్స్‌’ సినిమా కోసం సింగింగ్‌  ఆడిషన్స్‌ ఉంటే హాజరయ్యాను. ఆ తర్వాత చదువులో నిమగ్నమయ్యాను. ఉద్యోగం చేయడం సుఖమైన మార్గం అని అమ్మ అభిప్రాయం. అలానే మాస్టర్స్‌ పూర్తి చేసుకొని లండన్‌లో జాబ్‌ చేశాను. ఆరేళ్లు జాబ్‌ చేసిన తర్వాత డబ్బు సంపాదించడం తప్ప ఏం చేస్తున్నాం? అనిపించింది. ఇండస్ట్రీకి రావాలనుకున్నాను. నాన్నగారు సరే అన్నారు. బాంబేలో అలోక్‌ మాస్టర్‌ దగ్గర ఆ తర్వాత తెలుగులో దేవదాస్‌ కనకాలగారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. ‘నక్షత్రం’ సినిమాకు కృష్ణవంశీ గారి దగ్గర సహాయ దర్శకుడిగా చేశాను. ఆ తర్వాత దర్శకుడు చందు ‘ఓ పిట్ట కథ’ కథతో వచ్చాడు. ఈ సినిమా కోసం మూడేళ్లుగా కలసి పని చేశాం. అమలాపురంలో ఓ టూరింగ్‌ టాకీస్‌లో పని చేసే కుర్రాడి పాత్రలో కనిపిస్తాను. తొలిరోజు నాన్నతో కలిసి పని చేసేటప్పుడు ఆయనేం అనుకుంటారో అని టెన్షన్‌ పడ్డాను. సీన్‌ అవ్వగానే అమ్మకి ఫోన్‌ చేసి చెప్పారు. నాన్న నాతో ఏదీ డైరెక్ట్‌గా చెప్పరు. నాన్న అమ్మతో చెబితే అమ్మ నా భార్యకు చెబుతుంది. తను నాకు చెబుతుంది (నవ్వుతూ). చిన్నప్పుడు కోప్పడితే కొన్నిరోజులు మా ఫ్రెండ్‌ ఇంట్లో దాక్కున్నాను. అందుకే అలా.  సాధారణంగా ఆయన నన్ను పొగడరు. ఈ సినిమా చూసి బాగా చేశాడని చెప్పారు. ఆరోజు ఫ్రెండ్స్‌తో కలసి పార్టీ చేసుకున్నాను. ప్రస్తుతం కిశోర్‌ కృష్ణ డైరెక్షన్‌ లో ఓ సినిమా పూర్తి చేశాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top