
సాక్షి, సినిమా: సినిమాల్లో ఎవరైనా ఒకే రకం మూస పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు మాత్రం ఎంత కాలం చూస్తారు. వాళ్లకు మొహం మొత్తుతుంది. ఇక సినిమాల్లో గ్లామర్‌ను వేరు చేయలేం. సందేశాలిచ్చే సన్నివేశాలను బోర్ అనుకుంటారేమోగానీ, అందాలతో కనువిందు చేసే అంశాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తారు. అందుకే హీరోయిన్లు మొదట్లో ఒకటి రెండు చిత్రాల్లో కుటుంబ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నా, ఆ తరువాత కచ్చితంగా గ్లామర్‌నే ఆశ్రయిస్తారు. ఎందుకంటే ప్రేక్షకులు ఎక్కువగా గ్లామర్‌నే కోరుకుంటున్నారు. ఇలా చాలా మంది హీరోయిన్ల దారిలోనే నటి నివేదా పేతురాజ్ నడవడానికి సిద్ధం అయిపోయింది.
ఒరునాళ్ కూత్తు చిత్రంలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఈ అచ్చతమిళ్ అమ్మాయి. జయం రవితో డ్యూయెట్లు పాడుతున్న టిక్ టిక్ టిక్ త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా నివేదా పార్టీలో మజా చేస్తోంది. పార్టీ అంటేనే మజాగా ఉంటుంది. అయితే ఈ పార్టీ మీరూహించుకునేది కాదు. ఈ పార్టీ సినిమా పేరు. యువతను ఆకట్టుకునే టెక్నిక్‌ను గట్టిగా పట్టుకున్న వెంకట్‌ప్రభు దీనికి దర్శకుడు. అమ్మా క్రియోషన్స్ శివ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలైంది. చాలా కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ టీజర్‌లో నటి నివేదాపేతురాజ్ రసరమ్యమైన సన్నివేశాలు యువతను గిలిగింతలు పెడుతున్నాయి. ఆమె పడక గది సన్నివేశాలు పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ఒరునాళ్ కూత్తు నాయకియేనా ఈ అమ్మడు అని ఆశ్చర్యపోతున్నారు.
ఇక నెటిజన్లకు మాత్రం పార్టీ టీజర్ పెద్ద పనే కల్పించేస్తోంది. ఇందులో నివేదా పేతురాజ్‌తో పాటు నటి రమ్యకృష్ణ, రెజీనా, సంచితాశెట్టి లాంటి గ్లామర్ తారలు నటిస్తున్నారు. ఇక సీనియర్ నటులు సత్యరాజ్, నాజర్ వంటి వారితో జై,శివ వంటి యువ నటులు ఉన్నారు.దీనికి ప్రేమ్‌జీ సంగీతాన్ని అందిస్తున్నారు. పార్టీ త్వరలోనే కనువిందు చేయడానికి రెడీ అవుతోంది.