అమ్మగా నటించడం సవాలే!

Nithya Menen in Jayalaithaa Biopic - Sakshi

జయలలితగా నటించడం సవాలే అంటోంది నటి నిత్యామీనన్‌. దక్షిణాదిలో సంచలన నటీమణుల్లో ఈ అమ్మడు ఒకరని చెప్పకతప్పదు. పాత్ర నచ్చితే అందులో జీవించడానికి ఎంతదాకైనా వెళ్లడానికి వెనుకాడని నటి నిత్యామీనన్‌. అదే నచ్చకపోతే అది ఎలాంటి చిత్రమైనానిర్మొహమాటంగా నిరాకరించేస్తుంది. అందుకు మణిరత్నం అవకాశాన్నే కాదనడం ఒక ఉదాహరణ. అలాంటి ఈ కేరళా భామ త్వరలో దివంగత ముఖ్యమంత్రి జయలలితగా మారడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిత్యామీనన్‌తో చిన్న చిట్‌చాట్‌.. 

ప్ర: మలయాళ చిత్రాలకే అధిక ప్రాముఖ్యత నిస్తున్నారనే ప్రచారం గురించి మీ స్పందన?
జ: అలాంటిదేమీ లేదు. నాకు వచ్చిన అవకాశాల్లో నచ్చితే అది ఏ భాషా చిత్రమైనా చేయడానికి రెడీ. నాకు కథ, కథా పాత్రలే ముఖ్యం. చాలా అవకాశాలు వస్తున్నా, నటనకు అవకాశం ఉన్న పాత్రలనే అంగీకరిస్తున్నాను.

ప్ర: ఎన్‌టీఆర్‌ చిత్రంలో సావిత్రిగా నటించడానికి శిక్షణ తీసుకున్నారా?
జ:ఆ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నప్పటికే చిత్ర షూటింగ్‌ చాలా వరకూ పూర్తి అయ్యింది. అందుకని శిక్షణ తీసుకునేంత సమయం లభించలేదు. సాధారణంగా అలాంటి పాత్రల్లో నటించేటప్పుడు శిక్షణ అవసరం అని భావిస్తాను. అయితే ఎన్‌టీఆర్‌ చిత్రంలో నటించడానికి అలాంటి సందర్భం కుదరలేదు. అయినా అందులో సావిత్రి పాత్ర బాగా వచ్చింది. ఏ చిత్రంలోనైనా పాత్రగా మారాలని నేను భావిస్తాను. సావిత్రి పాత్రలో నేను ప్రతిబింబించేలానే ఉంటుంది.

ప్ర: జయలలిత పాత్రలో నటించనుండడం గురించి?
జ: జయలలిత వంటి గొప్ప నాయకురాలిగా నటించేటప్పుడు చాలా శ్రద్ధ, బాధ్యత అవసరం. సాధారణంగా నటించడం కుదరదు. ఆ బాధ్యత దర్శకులకే కాదు, నటీనటులకు ఉండాలి. జయలలిత బయోపిక్‌ గురించి దర్శకురాలు ప్రియదర్శిని చెప్పినప్పుడు ఆమెలోని అంకిత భావం అర్థమైంది. అందుకే ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించాను. అయితే నాకిది సవాల్‌తో కూడిన కార్యమే. ఆ పాత్రలో నటించడానికి నేను మానసికంగా, శారీరకంగానూ మారాల్సి ఉంది. జయలలిత పూర్తి జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం.

ప్ర: ఇతర చిత్రాల వివరాలు?
జ: కొత్తగా రెండు మలయాళ చిత్రాలు అంగీకరించాను. వాటితో పాటు హిందీలో అక్షయ్‌కుమార్‌తో కలిసి మిషన్‌ మంగళ్‌ చిత్రంలో నటిస్తున్నాను.

ప్ర:హిందీలో నటించడం సవాల్‌గా భావిస్తున్నారా?
జ: ఇందులో సవాల్‌ ఏముంటుంది. భాష కొత్త, పరిస్థితులు వేరుగా ఉంటాయి అంతే. మిషన్‌ మంగళ్‌ చిత్ర కథను ఒక అభిమానిగా విని ఆశ్చర్యపోయాను. చంద్రమండలంలోకి భారతీయ ఇస్రో శాస్తవేత్తలు పంపిన మంగళ్‌ అనే రాకెట్‌ కథ ఇది. అలాంటి చిత్రంలో నేనూ ఒక భాగం అవుతున్నందుకు గర్వంగా ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top