ప్లాట్‌ఫామ్‌ ఏదైనా కథ బాగుంటే చూస్తారు

Navin Chandra Talking about Bhanumati Ramakrishna Movie - Sakshi

‘‘థియేటర్‌ లేదా ఓటీటీ.. ప్లాట్‌ఫామ్‌ ఏదైనా కంటెంట్‌ ఆసక్తికరంగా ఉంటే ప్రేక్షకాదరణ తప్పకుండా ఉంటుంది’’ అన్నారు నవీన్‌చంద్ర. ఎన్‌. శ్రీకాంత్‌ దర్శకత్వంలో నవీన్‌ చంద్ర, సలోని లూథ్రా జంటగా నటించిన చిత్రం ‘భానుమతి రామకృష్ణ’. ఆహా ప్లాట్‌ఫామ్‌లో వచ్చే నెల 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నవీన్‌చంద్ర చెప్పిన విశేషాలు.

► ఈ చిత్రంలో 30 ఏళ్ల వయసుదాటి పెళ్లి కాని రామకృష్ణ పాత్రలో నటించాను. ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తిత్వం రామకృష్ణది. కష్టాల్లో ఉన్నా నవ్వుతూ ఉంటాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే తెనాలి అబ్బాయి, విజయవాడ అమ్మాయి మధ్య సాగే లవ్‌స్టోరీ ఆసక్తిగా ఉంటుంది. బైక్‌ రైడింగ్, కిస్‌లు, హగ్స్‌ లాంటి సీన్స్‌ ఉండే లవ్‌స్టోరీ కాదిది. సహజత్వానికి దగ్గరగా ఈ సినిమా కథనం సాగుతుంది. ఒక మనిషి తనకు పూర్తిగా తెలియని ఓ మనిషి గురించి ఎలా ఆలోచిస్తున్నాడు? అతన్ని ఏ కోణంలో చూస్తాడు? అనే వాస్తవిక భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు సినిమాలో ఉంటాయి.

► ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా దర్శకుడు శ్రీకాంత్‌ పరిచయం అయ్యారు. ఓ సందర్భంలో ‘భానుమతి రామకృష్ణ’ కథ చెప్పారు. డైరెక్షన్‌ చేయమని నేనే చెప్పాను. బట్టతల, కొంచెం బొద్దుగా ఉండటం, తెనాలి యాస ఇలా..  రామకృష్ణ పాత్రను ఊహించుకున్నారు శ్రీకాంత్‌. నా ఊహల్లో ఉన్న రామకృష్ణ గురించి శ్రీకాంత్‌కు చెప్పాను. ఇద్దరం మాట్లాడుకుని ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యే రామకృష్ణను రెడీ చేశాం.

► ఈ సినిమాను ఏ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయాలో ముందుగా ప్లాన్‌ చేయలేదు. ప్రస్తుతం థియేటర్స్‌ లేవు. ఓటీటీ బాగుందని ఈ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నాం. భవిష్యత్‌లో ఓటీటీల హవా పెరగవచ్చు. థియేటర్స్‌ ఉన్నప్పుడు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయి. ఒక సినిమా ప్రేక్షకుడికి నచ్చి ఆ సినిమాను మళ్లీ చూడాలనుకున్నప్పుడు థియేటర్‌లో అయితే టికెట్‌ కొనాలి. అదే ఓటీటీలో మళ్లీ టికెట్‌ కొనాల్సిన అవసరం ఉండదు. అయితే ఓ ఐదొందల మంది మధ్యలో థియేటర్‌లో వినోదాన్ని ఆస్వాదించే అనుభూతి ఎప్పుడూ బాగుంటుంది. అదొక ఫెస్టివల్‌లాంటిది. కరోనా వల్ల పరిస్థితులు బాగాలేవు. మునుపటి సాధారణ రోజులు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఈ లాక్‌డౌన్‌ని టీవీ చూడటం, ఇల్లు శుభ్రం చేయడం, వార్తలను ఫాలో కావడం, వర్కవుట్‌ చేయడం, కొత్త విషయాలను నేర్చుకోవడానికి కేటాయించాను.

► తెలుగులో రానా ‘విరాటపర్వం’, కీర్తీ సురేష్‌ ‘మిస్‌ ఇండియా’ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. అలాగే వరుణ్‌ తేజ్‌ సినిమాలో బాక్సర్‌గా కనిపిస్తాను. దర్శకులు మంచి పాత్రలతో నన్ను అప్రోచ్‌ అవుతుండటం సంతోషంగా ఉంది. తమిళంలో ధనుష్‌ నటించిన ‘పటాస్‌’ (తెలుగులో ‘లోకల్‌బాయ్‌’)లో విలన్‌గా చేశాను. ఆ సినిమా తర్వాత తమిళంలో నాకు మంచి ఆఫర్సే వచ్చాయి. కాకపోతే లాక్‌డౌన్‌ వల్ల కథలు వినడం కుదరలేదు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top