breaking news
Bhanumathi Ramakrishna
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - భానుమతి రామకృష్ణ
-
ప్లాట్‌ఫామ్ ఏదైనా కథ బాగుంటే చూస్తారు
‘‘థియేటర్ లేదా ఓటీటీ.. ప్లాట్‌ఫామ్ ఏదైనా కంటెంట్ ఆసక్తికరంగా ఉంటే ప్రేక్షకాదరణ తప్పకుండా ఉంటుంది’’ అన్నారు నవీన్‌చంద్ర. ఎన్. శ్రీకాంత్ దర్శకత్వంలో నవీన్ చంద్ర, సలోని లూథ్రా జంటగా నటించిన చిత్రం ‘భానుమతి రామకృష్ణ’. ఆహా ప్లాట్ఫామ్లో వచ్చే నెల 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నవీన్‌చంద్ర చెప్పిన విశేషాలు. ► ఈ చిత్రంలో 30 ఏళ్ల వయసుదాటి పెళ్లి కాని రామకృష్ణ పాత్రలో నటించాను. ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తిత్వం రామకృష్ణది. కష్టాల్లో ఉన్నా నవ్వుతూ ఉంటాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే తెనాలి అబ్బాయి, విజయవాడ అమ్మాయి మధ్య సాగే లవ్‌స్టోరీ ఆసక్తిగా ఉంటుంది. బైక్ రైడింగ్, కిస్‌లు, హగ్స్ లాంటి సీన్స్ ఉండే లవ్‌స్టోరీ కాదిది. సహజత్వానికి దగ్గరగా ఈ సినిమా కథనం సాగుతుంది. ఒక మనిషి తనకు పూర్తిగా తెలియని ఓ మనిషి గురించి ఎలా ఆలోచిస్తున్నాడు? అతన్ని ఏ కోణంలో చూస్తాడు? అనే వాస్తవిక భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు సినిమాలో ఉంటాయి. ► ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా దర్శకుడు శ్రీకాంత్ పరిచయం అయ్యారు. ఓ సందర్భంలో ‘భానుమతి రామకృష్ణ’ కథ చెప్పారు. డైరెక్షన్ చేయమని నేనే చెప్పాను. బట్టతల, కొంచెం బొద్దుగా ఉండటం, తెనాలి యాస ఇలా.. రామకృష్ణ పాత్రను ఊహించుకున్నారు శ్రీకాంత్. నా ఊహల్లో ఉన్న రామకృష్ణ గురించి శ్రీకాంత్‌కు చెప్పాను. ఇద్దరం మాట్లాడుకుని ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యే రామకృష్ణను రెడీ చేశాం. ► ఈ సినిమాను ఏ ప్లాట్ఫామ్లో విడుదల చేయాలో ముందుగా ప్లాన్ చేయలేదు. ప్రస్తుతం థియేటర్స్ లేవు. ఓటీటీ బాగుందని ఈ ప్లాట్ఫామ్లో విడుదల చేస్తున్నాం. భవిష్యత్‌లో ఓటీటీల హవా పెరగవచ్చు. థియేటర్స్ ఉన్నప్పుడు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఒక సినిమా ప్రేక్షకుడికి నచ్చి ఆ సినిమాను మళ్లీ చూడాలనుకున్నప్పుడు థియేటర్లో అయితే టికెట్ కొనాలి. అదే ఓటీటీలో మళ్లీ టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. అయితే ఓ ఐదొందల మంది మధ్యలో థియేటర్లో వినోదాన్ని ఆస్వాదించే అనుభూతి ఎప్పుడూ బాగుంటుంది. అదొక ఫెస్టివల్లాంటిది. కరోనా వల్ల పరిస్థితులు బాగాలేవు. మునుపటి సాధారణ రోజులు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఈ లాక్‌డౌన్‌ని టీవీ చూడటం, ఇల్లు శుభ్రం చేయడం, వార్తలను ఫాలో కావడం, వర్కవుట్ చేయడం, కొత్త విషయాలను నేర్చుకోవడానికి కేటాయించాను. ► తెలుగులో రానా ‘విరాటపర్వం’, కీర్తీ సురేష్ ‘మిస్ ఇండియా’ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. అలాగే వరుణ్ తేజ్ సినిమాలో బాక్సర్‌గా కనిపిస్తాను. దర్శకులు మంచి పాత్రలతో నన్ను అప్రోచ్ అవుతుండటం సంతోషంగా ఉంది. తమిళంలో ధనుష్ నటించిన ‘పటాస్’ (తెలుగులో ‘లోకల్‌బాయ్’)లో విలన్‌గా చేశాను. ఆ సినిమా తర్వాత తమిళంలో నాకు మంచి ఆఫర్సే వచ్చాయి. కాకపోతే లాక్డౌన్ వల్ల కథలు వినడం కుదరలేదు. -
అత్తగారూ ఆవు నెం : 23
బాగా పాలిచ్చే ఒక మంచి ఆవును కొనాలని ఎంతో కాలం నుంచి మా అత్తగారి సంకల్పం. దానికోసం చాలాచోట్ల విచారించింది. చుట్టుపక్కల వూళ్లన్నీ గాలించింది. కానీ ఆవిడకు నచ్చిన ఆవు దొరకలేదు. ఆవు ముఖం లక్షణంగా లేదనో, పీలగా వుందనో, పళ్లు మొలవలేదనో, వున్న పళ్లు వూడాయనో వంక దొరికేది. మొత్తం మీద అన్ని విధాలా నచ్చిన ఆవు ఆవిడకు కనిపించలేదు. ఆర్నెల్లు క్రితం మా పక్కింటివాళ్లు బదిలీ అయి వెళ్లిపోతూ, వాళ్ల గేదెను అమ్మేందుకు వ్యవధిలేక మాకు వాళ్ల జ్ఞాపకార్థం, ‘‘ఉండనివ్వండి’’ అంటూ గేదెను మా యింటికి తోలి వెళ్లిపోయారు... ఆవు దొరక్కపోయినా, అనుకోకుండా అంతమంచి గేదె దొరికినందుకు మా అత్తగారు మహా ఆనందపడిపోయారు. కాని గేదెకు మేత ఏం పెట్టాలో, ఏమిటో మా అత్తగారికి బాగా తెలీదని మాత్రం నాకు బాగా తెలుసు. ఆవిడికి ఆవు సంగతి తప్ప గేదె సంగతి తెలీదు...దానికి తగినట్లు మా తోటవాడికి పూలమొక్కల సంగతి తప్ప గొడ్డూ, గోదా సంగతి అసలు తెలీదు–పాలు పిండడం మాత్రం చాతవునన్నాడు. ‘‘పోనీ మన పాలవాడినే కొద్దిరోజుల పాటు మన గేదెకు మేతాగీతా చూడమంటే ఒదిలిపోతుందిగా!’’ అన్నాను మా అత్తగారికి సలహా ఇస్తూ.. ‘‘హవ్వ’’ అన్నారు మా అత్తగారు. ‘‘వాడి దగ్గర మనం పాలుకొంటం మానేశామనే కోపంతో గేదెకేదైనా మందూ, మాకూ పెట్టి చంపితే! తెలిసి తెలిసి నోరు లేని గొడ్డును తీసికెళ్లి పులినోటి కందిస్తానంటావే!’’ అంటూ నా తెలివితక్కువకు బాధపడ్డారు. ‘‘మరి మన తోటవాడికి దాని మేత సంగతి తెలీదంటున్నాడే!’’ అన్నాను. ‘‘అదేం పెద్ద బ్రహ్మవిద్య గనక! మా పుట్టింటి వాళ్లకు గేదె అచ్చిరాలేదుగాని చిన్నప్పట్నుంచీ నేను ఆవుల్తోనే పెరిగాను... ఆవెంతో గేదంతే... దాని మేతెంతో దీని మేతంతా... కాకపోతే ఆవుకంటే కాస్త అధికంగా తింటుంది గేదె. ఈ మాత్రానికి పోయి వాణ్ణివీణ్ణీ అడగడం ఎందుకూ పన్లేనిపనీ!’’ అంటూ కోప్పడ్డారు మా అత్తగారు. పాలవాడొచ్చి గేదెను చూడాలని సంబరపడ్డాడు. మా అత్తగారు వీల్లేదుపొమ్మన్నది. తనే స్వయంగా, స్వహస్తాలతో మూడుపూటలూ దట్టంగా గేదెను మేపడం మొదలెట్టింది. మొదట రెండు రోజులూ పక్కింటి వాళ్లకిచ్చిన పాలకంటే చాలా ఎక్కువే ఇచ్చింది. కారణం తెలీక కంగారు పడ్డారు మా అత్తగారు. ఆరోజంతా ఆలోచించి దానికి ఇంకా తిండి చాల్లేదని తీర్మానానికి వచ్చారు. వెంటనే పత్తిగింజలూ, సజ్జలూ, ఇంకా ఏవో తెప్పించారు బజార్నుంచి. అంతకుముందు గేదెకు వేస్తున్న కందిపొట్టు, పెసరపొట్టు, గోధుమ పొట్టు, శెనగపొట్టు, గానుగ చెక్క, తౌడు, పచ్చిగడ్డి, ఎండుగడ్డి... వగైరాలతో బాటు, పత్తిగింజలు రుబ్బి, సజ్జలు ఉడికించి, మొత్తం అన్నీ కలిపి గేదె ఒద్దంటున్నా వినకుండా బ్రతిమాలి దాని కడుపు నిండా పట్టించారు. మర్నాడు ప్రొద్దుటే పాలు పిండడానికి వెళ్ళిన తోటవాడిని ఒక్క తాపు తన్నింది గేదె. వాడి ముందు పళ్లు రెండూ విరిగిపోయాయి. మా అత్తగారు దానికి పెట్టిన యమ తిండి యొక్క బలం ఆ విధంగా చూపిస్తోందనిపించింది...కారణం ఏమిటని దూరంగా నిలబడి ఆలోచించడం మొదలుపెట్టారు. గేదె కడుపు విపరీతంగా లావుగా వుంది. ఆయాసపడుతూంది...ఒకచోట నిలవకుండా చిందులు తొక్కుతోంది. దాని అవస్థ చూస్తే ఒకవేళ కడుపునొప్పితో బాధపడుతోందేమోనని అనుమానం కలిగింది నాకు. ఆ సంగతి చెప్పి చూశాను. అది పాలవాడి మనోదృష్టేనని తేల్చారు మా అత్తగారు...వెంటనే ఒక వీశ మిరపకాయలూ, అరవీశ కర్పూరం, మానెడు ఉప్పూ, ఒక పాతచీపురు కట్టా, వగైరా సేకరించి–దూరం నుంచే గేదెకు దిష్టి తీశారు. ఆ రాత్రి గేదె చచ్చిపోయింది. ఈ సంగతి విని పాలవాడు ఒకటే గోల. ‘‘అయ్యో దానికి కాస్త ఇంగువా వెల్లుల్లీపాయలూ నూరి మింగిస్తే బతికేదమ్మగారూ, బంగారంలాంటి బర్రెను, తిండి ఎక్కువ పెట్టి పెద్దమ్మగారు సంపేశారమ్మా’’ అంటూ ఏడ్చాడు. ‘‘నోర్మోయ్...అసలు నీ దృష్టితోనే పోయిందది...’’ అంటూ పాలవాడి మీద మండిపడ్డారావిడ. మళ్ళీ పాలవాడిచ్చే పాలబడ్డాము మేము. రాను రాను ఆవుపాలు కటికనీళ్లుగా తెచ్చిస్తున్నాడు. మూడు పూటలూ ఆవుపాల మీదే ఆధారపడే మా అత్తగారు పాపం ఆ కటిక నీళ్ళు మింగలేక అవస్థపడ్డారు. ఏదో ఒక ఆవును వెంటనే కొనాలనే తీర్మానానికి వచ్చారు. ఈసారైనా పాలవాడి సలహా తీసుకుంటే మంచిదని తోచింది నాకు. ‘‘రేపు శుక్రారం నాడు సంతకాడికెళ్ళి మంచి ఆవును చూసి పట్టుకొస్తాను’’ అన్నాడు పాలవాడు. ‘‘అబ్బే–ఆవు సంగతి వాడికేం తెలుసునే!’’ అన్నారు మా అత్తగారు చప్పరిస్తూ. ‘‘ఎక్కడుందో విచారించుకుందాం–మనకు నచ్చితేనే కొందాం’’ అని నెమ్మదిగా నచ్చజెప్పాను. ‘‘సరే నీ ఇష్టం’’ అన్నారవిడ అయిష్టంగా. సుమారుగా వుంటే చాలు, పాలు మాత్రం బాగా ఇచ్చే ఆవు కావాలనీ ఎక్కడ దొరుకుతుందో వెంటనే చూడమనీ పాలవాడు రాగానే పురమాయించాను. ‘‘రేపు శుక్రవారంనాడు సంతకాడికెళ్ళి ఆవును చూసి పట్టుకొస్తాను’’ అన్నాడు పాలవాడు. ‘‘ఛా ఛా–ఈ వూరు సంతలో మంచి ఆవు ఎక్కడ దొరుకుతుందిరా నీ ముఖం. మీకు మంచి ఆవు కావాలంటే ఒకచోట దొరుకుతుంది’’ అన్నారు మా వారు–మా అత్తగారికి ప్రాణం లేచొచ్చింది. ‘‘ఇక్కడి ఇరవై మైళ్ల దూరంలో, యాభై ఎకరాల స్థలంలో కొత్తగా ఒక ఫారమ్ ఓపేన్ చేశారు. అక్కడ కొన్నివందల ఆవులూ, ఎద్దులూ, గేదెలూ, దున్నపోతులూ దొరుకుతాయి...’’ అని మా వారు చెబుతూంటే పాలవాడి చెవుల్లో అమృతం పోసినట్లయింది. ‘‘అబ్బో! కొన్ని వందల గొడ్లే! అయితే ఈయాళే ఆడికెళ్ళి ఓ మంచి ఆవును సూసి పట్టుకొస్తా సోమి’’ అన్నాడు పాలవాడు హుషారుగా. ‘‘నువ్వెక్కడికిరా మాటకు ముందు అపశకునంలాగా! నేను వెళ్లి చూసొస్తాలే’’ అన్నారు మా అత్తగారు. ‘‘నువ్వెందుకమ్మా వెళ్ళడం! అన్ని వందల పశువుల్లో నీకు నచ్చిన ఆవు ఎక్కడుందో వెదకడం మాటలా! నా మాట విని వాణ్ణి వెళ్ళి రానీ. అక్కడుండే ఆవులన్నీ మంచి ఆవులే–నీకెలాంటిది కావాలో వాడికి గుర్తులు చెప్పి పంపించు’’ అన్నారు మావారు. ‘‘మరి ఈ పూటే ఎళ్లమంటారా పెద్దమ్మగారూ?’’ అన్నాడు పాలవాడు. ‘‘ఈ పూట ఎట్లా వెళ్తావురా ఇంకా చవితి మిగులుంటేనూ? పన్నెండు గంటల తర్వాతగాని పంచమి ఘడియలు రావు. మధ్యాన్నించీ వెళ్లు’’ అన్నారు మా అత్తగారు. మధ్యాన్నం రెండు గంటలకంతా వచ్చేశాడు పాలవాడు. వాడి వెనకాలే వాడి ఇద్దరు పెళ్లాలు వచ్చారు. ‘‘వాళ్లెక్కడికిరా! వాళ్ళిద్దర్నీ తీసుకొచ్చావేందుకూ?’’ అన్నారు పాలవాడి మీద మండిపడుతూ. ‘‘మేంగూడా ఒచ్చి చూస్తానంటా ఎంటబడ్డారమ్మగారూ’’ అన్నారు సిగ్గుపడుతూ పాలవాడు. ∙∙ రాత్రి బాగా పొద్దు పోయి వచ్చాడు పాలవాడు–ఇద్దరు పెళ్ళాల్నీ ఇంటి దగ్గిర ఒదిలేసి సంతోషంగా, హుషారుగా వస్తున్న పాలవాణ్ణి చూసి ‘‘ఇంతకీ వెళ్ళిన పని అయిందా?’’ అన్నారు వరండాలో లైటు వేస్తూ అత్తగారు. ‘‘ఆ ఎల్లుండి శుక్రవారంనాడు ఇరవైమూడో నెంబర్‌ను మనింటికి తోల్తున్నారు’’ అన్నాడు పాలవాడు. ‘‘ఇరవై మూడో నెంబర్‌ను మనింటికి తోలడమేమిట్రా!’’ అన్నారు మా అత్తగారు ఆశ్చర్యపడుతూ. ‘‘అదేనండమ్మగారు... ఆవునే... ఆడంతా నెంబర్ల ‘షిషం’ పలనా ఆవు, çపలానా బర్రె అంటే వాళ్ళకు తెలవదు. పలానా నెంబరంటేనే ఎంటనే తెలుస్తది. ఒక్కో గొడ్డును కట్టేసిన చోట్నే దాన్నెంబరు రాసి పెడతరు... అబ్బో ఏం చెప్పమంటారు పెద్దమ్మగారూ... ఆ గొడ్లకి ఇంద్రభోగంలాగా జరుపుతున్నారు... ఏమి తిండి ఏమి మేత...’’ ‘‘అది సరేరా–పోయిపోయి ఇరవైమూడో నెంబరావునే ఎందుకు తీసుకున్నావు?– అంతకంటే మంచి నెంబరు దొరకనట్టు’’ అన్నారు మా అత్తగారూ. ‘‘అయ్యో నెంబరేదైతే ఏంటమ్మగారూ! అయ్యగారిచ్చిన ఉత్తరం తీసుకెళ్లి ఇచ్చా. ఎంటనే నన్నాయన వెంటబెట్టుకొని ఆడున్న ఆవులన్నిట్ని సూపాడు. ఆటిల్లో సక్కని సుక్క మనావు’’ పాలవాడు చెబుతుంటే సంతోషంతో మా అత్తగారి ముఖం వికసించింది. ‘‘ఇంతకూ సుడీ, గిడీ చూసి తీసుకున్నావా!’’ అన్నారు. ‘‘అబ్బే–మడి లేదు. సుడి లేదు. సుద్దంగా వుందావు. పూటకు అయిదు మానికలిస్తదంట..’’ అన్నాడు పాలవాడు. ‘‘ఏమిట్రా? పాలా, పంచితమా?’’ అన్నారు మా అత్తగారు హడిలిపోయి. ‘‘పాలేనండమ్మగారూ’’ అంటూ పాలవాడు నవ్వాపుకోలేక చచ్చాడు. ‘‘ఇదెక్కడి విడ్డూరంరా! పూటకు అయిదు మానికెలా! అయితే రోజుకు పది మానికెలన్నమాట...నేనెక్కడా విన్లేదే!’’ అంటూ ఆశ్చర్యంతో మా అత్తగారు దవడలు నొక్కున్నారు. ‘‘అదంతా దొర్ల తర్ఫీతు, మీకు తెలవదు లెండి పెద్దమ్మగారూ...ఒక్కో గొడ్డును రోజుకు అయిదారు మాట్లు పిండుతారంట...’’’ ‘‘హయ్యో! ఇదేం అన్యాయంరా! అవెట్లా ఇస్తాయి...వీళ్ళెట్లా పిండుతారూ...’’ ‘‘ఆడంతా అంతేనమ్మాగారూ, ఆడుండే గొడ్లని ‘రూలుసుల’ మీద నడిపిస్తారంట. ఏ ఆవు ఎప్పుడు దూడనేస్తదో, వాళ్ళకాడ ఇవరంగా తారీకు లేసి వుంటయ్యంట...ఆ తారీకునాడు ఆవుకాడి కెళ్ళి ‘దూడనెయ్యి’ అంటే ఎంటనే ఏస్తదంట. ఈయాళ ఒద్దులే అంటే, ఈన బోయే ఆవు కూడా మానేస్తుందట’’ అంటూ పాలవాడు ఆనందపడిపోయాడు. ‘‘అయితే ఇంతకూ మన ఆవుకేం దూడరా!’’ అన్నారు మా అత్తగారు. ‘‘మనావింకా దూణ్ణెయ్యలేదమ్మగారూ నిండు చూలావులా వుంది...’’ అన్నాడు మురిసిపోతూ. ‘‘ఏమిటి! పోయి పోయి చూలావునా కొనుక్కొచ్చావు! ఓరి నీ తెలివి మండిపోనూ’’ అంటూ మా అత్తగారు అమాంతం పాలవాడి మీద విరుచుకుపడ్డారు. ‘‘ఇంక పదిరోజుల్లో దూడనేస్తది గనక తోలుకెళ్ళొచ్చనీ ఆ మేనేజరయ్యే సెప్పాడమ్మగారూ...’’ ‘‘మేనేజరయ్య గాదు వాడి తాత చెప్పినా ఆ చూలావు నాకక్కర్లేదు. మాకచ్చిరాదు. అసలు వెళుతూ వెళుతూ అపశకునంలాగా నీ ఇద్దరి పెళ్లాల్నీ వెంటనేసుకెళ్లినప్పుడే అనుకున్నా... దానికి తగినట్లు ఇరవైమూడో నెంబర్ దొరికింది నీకు... పాడు నెంబరు, అచ్చిరాని నెంబరు’’ ‘‘క్షణం ఆలస్యం చేయకుండా ఇచ్చిన డబ్బు వావసు తీసుకు రా’’ అన్నారు మా అత్తగారు ఖండితంగా. ‘‘అయ్యోరామా...ఇప్పుడు నేనడిగితే ఇస్తారో ఇయ్యరో...ఎందుకైనా మంచిది అయ్యగార్ని కూడా ఓపాలి అడిగి సెప్పండమ్మగారూ...’’ ‘‘దూడను వేసిం తర్వాత పంపమంటే పంపుతారా?’’ అన్నాను నేను కలగజేసుకుని. పాలవాడి ప్రాణం లేచొచ్చింది. ‘‘ఓ పంపుతారండమ్మగారు...అట్ల పంపకపోతే ఆవు మనకొద్దంటే సరి...ఎటు తిరిగీ పదిరోజుల్లో దూడ నేస్తదన్నాడు...అదెయ్యకపోతే మేనేజరయ్యే దగ్గరుండి దూణ్ణేపిస్తానన్నాడు..’’ ‘‘మేనేజరయ్య దూడని వేయిస్తాడో, వేస్తాడో నా కనవసరం...పైయ్యొచ్చే శుక్రవారం నాటికైనా ఆవు దూడతో సహా ఇంటికి రావాలి. అంతే...ఈ సంగతి చెప్పు వాళ్ళతో...’’ అన్నారు మా అత్తగారు. ‘‘అట్లనే సెప్తా పెద్దమ్మగారూ’’ అంటూ పాలవాడు బ్రతుకుజీవుడా అంటూ వెళ్ళిపోయాడు. ∙∙ పైయ్యొచ్చే శుక్రవారంనాడు ఆవొస్తుందని మా అత్తగారు గొడ్లకొట్టం అంతా శుభ్రం చేయించారు. ఇంతాజేసి శుక్రవారంనాడు ఆవు రాకపోగా పాలవాడు కూడా రాలేదు...మా అత్తగారు ఒళ్లు తెలీని కోపంతో ఇల్లంతా తిరిగారు. పాలవాడు ఆరోజూ, మర్నాడు కూడా రాలేదు. కారణం తెలీక వాడింటికి కబురు పెట్టాం. ఇల్లు తాళం వేసుందట. గురువారం నాడు రాత్రికి రాత్రి ఇంటిల్లిపాదీ ఎక్కడికో వెళ్ళిపోయారని ఇరుగుపొరుగు వాళ్లు చెప్పారట మా తోటవాడికి. మా అత్తగారికి పూనకం వచ్చింది. పాలవాణ్ణి చెడమడా తిట్టడం మొదలెట్టారు. ఇరుగు పొరుగు వాళ్ళంతా మా ఇంటికి ఆవు వచ్చేసిందనుకుని, జున్ను పాలకోసం, ఆవు పంచితం కోసం మా అత్తగారికి కబురు పెట్టడం మొదలెట్టారు. పాలవాడు మా అత్తగారికి భయపడే దేశాంత్రం పోయాడని మా వారికి తెలిసింది. మావార్ని ఆవు సంగతి ఫారమ్‌కు టెలిఫోన్ చేసి కనుక్కోమని చెప్పారు మా అత్తగారు. మేనేజర్ వూర్లో లేడు. మేనేజరో, పాలవాడో ఎవరో ఒకరు వచ్చిందాకా ఆగమని మావారు సలహా ఇచ్చారు. మా అత్తగారు ఒక్కరి సలహా వినదల్చుకోలేదు... వెంటనే బయల్దేరారు. ఆవు సంగతి తేల్చుకొస్తానంటూ... దూడను వేసినా సరే, వేయ్యకున్నా సరే తక్షణం ఆవును ఇంటికి తోలమని చెప్పొస్తానంటూ తోటవాడిని తోడు పిల్చుకుని కార్లో బయల్దేరి వెళ్లిపోయారు. ఆమె అటు వెళ్తూనే పాలవాడొచ్చాడు. ‘‘ఎక్కడ మాయమైనావ్?’’ అన్నాను. వాడు కండ్లు తుడుచుకుంటూ ‘‘ఏం జెప్పేదమ్మగారూ! పక్క వూళ్ళో మా అన్నకు శానా డేంజర్‌గా వుందని అర్ధరాత్రి కాడ తంతి గొట్టారు. రాత్తి ర్రాత్తిరే వెళ్ళాం....ఇప్పుడు మా యన్నకి కాస్త సుమారుగా వుంది...పిల్లల్ని సూసుకోటానికి పెద్ద దాన్ని ఆడేవుంచి చిన్నదాన్ని మాత్రం తీసుకొని వచ్చా... తమకి పాలకి శానా ఇబ్బందయి వుంటది... అర్ధరాత్రి కాడ ఇంటికొచ్చి మిమ్మల్ని నిదర్లేపి ఈ సంగతి సెప్పడం బాగుండదని అట్టనే ఎల్లిపోయానమ్మగారు...’’ అంటూ వాడి గాధ చెప్పుకున్నాడు. ‘‘అయితే అవింకా రాలేదా అమ్మగారూ’’ అన్నాడు పెద్దమ్మగారి కోసం నాలుగు వైపులా వెదుకుతూ. ‘‘ఇప్పుడే పెద్దమ్మగారు వెళ్లారు...చూలావునైనా వెంటనే ఇంటికి తోలమని చెప్పిరావడానికిట–’’ ‘‘సులావు మాకచ్చిరాదన్నారుగా పెద్దమ్మగారూ! ఈమాట ఆయాలే సెప్పినట్లయితే సరిపోయ్యేదిగా! అయితే రేపొస్తదన్నమాట ఆవు...మరి నేగూడా గొడ్లని తోలకొచ్చి ఆవొచ్చేయాళకీడుంటానండమ్మగారూ’’ అని చెప్పి వెళ్లిపోయాడు పాలవాడు. దీపాలు పెట్టేసరికంతా తిరిగొచ్చేశారు మా అత్తగారు. ‘‘అదెక్కడుందో వెతికేసరికే నా తాతలు దిగొచ్చేట్టున్నారు...అదేం ‘ఫారమో’ ఎత్తుభారం...యాభై ఎకరాలుంది...అన్ని గొడ్లల్లో మన ఆవు ఎక్కడుందో ఎవర్నడిగేది! దానికి తగినట్టు మేనేజరు వూళ్లో లేడు. మాకా వివరాలు తెలీవన్నారు–కాసేపటికి ఎవడో వచ్చి ‘మీకు దాన్నెంబరు తెలుసా?’ అని అడిగాడు. ఇరవైమూడో నెంబరు అని చెప్పాను....‘ఈ నెంబర్‌ను ఎప్పుడు తోలాలి!’ అన్నాడు–తక్షణం తోలమన్నాను. రేపు తెల్లవారేసరికి ఆ నెంబరు మనింటి దగ్గిరుండాలని గట్టిగా చెప్పొచ్చాను–సరేనన్నాడు’’ పాలవాడొచ్చాడన్నాను... ‘‘...ఏ ముఖం పెట్టుకొచ్చాడు’’ అన్నారు మండిపడుతూ. ‘‘అన్నట్టు తెల్లవారుజామునే లేచి బాయిలర్ అంటించి వేణ్ణిళ్లు పెట్టాలి పాపం. నోర్లేని గొడ్డు అన్ని మైళ్ళ దూరాన్నుంచి నడిచొస్తుంది...వేణ్ణీళ్లతో బాగా దాని కాళ్లూ, ఒళ్లూ కడగమని చెప్పాలి మన తోటవాడితో...నాలుగింటికి అలారం పెట్టు’’ అంటూ పెరటి వైపు వెళ్లారు మా అత్తగారు. నేను నాలుగింటికి అలారం పెట్టాను–ఈ సంగతి తెలీక ప్రొద్దున్నే ‘మీటింగ్’ వుందని మావారు ఆరింటికి ‘కీ’ ఇచ్చి పెట్టారు...ఈ రెండూ తెలీక మావాడు పరీక్షలకు చదువుకోడానికి రెండుగంటలకే తిప్పి పెట్టాడు. రాత్రి రెండుగంటలకంతా అలారం గోలగోలగా కొట్టుకుంది–మంచి నిద్రవేళ... నాలుగింటికి పెడితే పన్నెండింటికే కొడుతోంది... ఈ అలారం చెడిపోయినట్టుంది తీసి దిబ్బలోపారేయ్ అన్నారు మావారు నిద్దట్లోనే...మావాడి రూములో లైటు వెలిగింది...నాకప్పుడర్థమైంది–వాడితో కూడా కూర్చుని హిందీ పాఠాల్లో సహాయం చేశాను నాలుగయిందాకా. తెల్లవారింది–ఆవును ఆహ్వానించడానికి అన్నీ సిద్ధం చేశారు మా అత్తగారు. పసుపు కుంఖాలు, పూలు, పళ్లూ టెంకాయ, తాంబూలం, హారతి కర్పూరం వగైరాలతో ఆవు కోసం బయట వరెండాలో కూర్చున్నాం మా అత్తగారూ, నేనూ. పాలవాడు గేదెల్ని తోలుకొని వచ్చాడు. మా అత్తగారు ప్రొద్దున్నే వాడి మీద ఎక్కడ విరుచుకుపడతారోనని భయపడ్డాను..అసలు అతడి వైపే చూళ్లేదు... ఆవు కోసం జపం చేస్తూ తపస్సులో కూర్చున్నారు ఎవరితోనూ మాట్లాడకుండా... ఆరయింది... ఏడయింది... ఎనిమిదయింది... తొమ్మిదయింది... ఆవు రాలేదు. మా వారు మా అవస్థకు నవ్వుకుంటూ మీటింగ్‌కు వెళ్లిపోయారు. నిండు చూలాలు గనక ఒకవేళ నడవలేక నడుస్తోందేమోనని ఒక వైపూ, ఒకవేళ దూడను ఈని వున్నట్లయితే పచ్చి ఒంటితో ఇంతదూరం నడవలేక అవస్థపడుతోందేమోనని మరోవైపు, ఇలా పరిపరి విధాల పోయింది మా అత్తగారి మనసు. మొత్తానికి పదిగంటలయినా ఆవు రాకపోయేసరికి మా అత్తగారు మరీ కలవరపడసాగారు... నా ముఖం ఆమె, ఆమె ముఖం నేనూ చూసుకున్నాం ప్రశ్నార్థకంగా... గేట్లో గంటల చప్పుడు వినిపించింది... మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. ‘‘వొచ్చినట్టుంది. పదపద ముందు దానికి దృష్టి తీయాలి’’ అంటూ పళ్లెంలో ఎర్రనీళ్లు కలిపి మధ్యన కర్పూరం పెట్టి నా చేతికిచ్చింది మా అత్తగారు. గేటు దాటి లోపలికొస్తూనే ఆకాశం దద్దరిల్లేట్టు కేక వేసి మేరుపర్వతంలా ఒచ్చి మా ముందు నిలబడ్డది...బ్రహ్మాండమైన వృషభం. ‘‘ఆ!’’ అంటూ నోటమాట లేకుండా గుడ్లు తేలేశారు మా అత్తగారు...పాలవాడు చాటుగా చచ్చేట్టు నవ్వుతున్నాడు... నేను నవ్వాపుకుంటూ, ‘ఈ ఎద్దును యే అడ్రసుకు తోలమన్నారు!’’ అని అడిగాను–ఒకవేళ అడ్రసు మారి వచ్చిందేమోనని. ‘‘ఈ అడ్రసుకేనమ్మగారూ...తెల్లారేసరికి ఇరవైమూడో నెంబర్ని ఈ అడ్రస్‌కి తోలమని మా అషిషెంటు మేనేజరయ్య చెప్పాడు...కావాలంటే అడ్రసు చూడండి...’’ అంటూ చిన్న చీటి చూపించాడు. నిజమే...‘ఇంకేం అడిగేది’... మా అత్తగారి వైపు చూశాను... ఆమె కొంచెం తెప్పరిల్లి ‘‘ఇరవైమూడో నెంబరు ఆవును తోలమన్నాంగాని, అచ్చోసిన ఈ అంబోతుని తోలమన్నా...! ఎవడ్రా ఆ తలలేని అషిష్టెంటు మేనేజరూ...’’ అని మా అత్తగారు తోలుకొచ్చిన వాణ్ణి ఝాడిస్తుండగానే టెలిఫోన్ వచ్చింది. ‘ఫారమ్’ నుంచి అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడాడు... పొరపాటు జరిగిపోయిందని, ఇరవైమూడో నంబరు ఆవును కట్టేసేచోట ఎద్దును కట్టేశారని, ఇరవైమూడో నంబరు ఆవు అసలు చూలుగాదనీ, దానికేదో గర్భకోశంలో జబ్బు వల్ల కడుపు లావయిందని డాక్టరు చెప్పాడనీ...డబ్బు వాపసు పంపిస్తున్నందుకు క్షమించాల్సిందనీ...‘ఫారమ్’ ఆరంభించిన తర్వాత ఇలాంటి పొరపాటు జరగడం ఇదే మొదటిసారి అనీ చెప్పి కట్ చేశాడు. ‘‘గేదె అచ్చిరాలేదంటే మనకు ఆవుగూడా అచ్చిరాలేదన్నమాట’’ అన్నారు మా అత్తగారు నిట్టూర్పు విడుస్తూ. - భానుమతి రామకృష్ణ -
సినీ రంగంలో భానుమతి స్థానం శాశ్వతం
ఒంగోలు కల్చరల్ : సినీ రంగంలో ప్రముఖ దర్శకురాలు, నటీమణి భానుమతి రామకృష్ణ స్థానం శాశ్వితమైనదని ఆమె పేరిట తనను పురస్కారంతో సత్కరించడం ఆనందంగా ఉందని కళాభినేత్రి వాణిశ్రీ పేర్కొన్నారు. ఘంటశాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక గుంటూరు రోడ్డులోని ఏ వన్ ఫంక్షన్ హాలులో ఏర్పాటైన అభినందన సభలో వాణిశ్రీ పాల్గొని ప్రసంగించారు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకునేందుకు తాను కృషి చేశానని ఆమె వివరించారు. తమ గొప్పతనానికి తెరవెనుక ఎంతో మంది ప్రోత్సాహం కారణమని పేర్కొన్నారు. అభిమానులు చెక్కిన శిల్పంగా ఆమె తనను తాను అభివర్ణించుకున్నారు. డాక్టర్ భానుమతి రామకృష్ణ కాంస్య విగ్రహాన్ని ఒంగోలులో ప్రతిష్టించేందుకు అభిమానులు పూనుకోవాలని ఆమె కోరారు. సినీ రంగంలో భానుమతిని అనుకరించడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. 50, 60 ఏళ్ల క్రితమే చండీ రాణి అనే సినిమాతో దర్శకత్వం వహించడం ద్వారా భానుమతి తమ గొప్పతనాన్ని నిరూపించుకున్నారన్నారు. భానుమతి నటన, గానం, సంభాషణా చాతుర్యం ఎవరూ అనుకరించలేరని ఆమె శ్లాఘించారు. ప్రముఖ గాయని పి.సుశీల పాటలు వింటూ తాను ఎదిగానని, ఇది మల్లెల వేళయనీ వంటి పాటల ద్వారా గాయనిగా పీ సుశీల గొప్ప అభినయం ప్రదర్శించే అవకాశాన్ని తనకు కల్పించారని తెలిపారు. నేడు సృజనాత్మకత లోపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు సైతం సెల్ఫోన్లు, వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లు, యూట్యూబ్ వంటి వాటికి అలవాటు పడుతున్నారని, చదువుకోవాల్సిన వయసులో వారు అటువంటి వాటికి ఆకర్షితులు కావడం వారి భవిష్యత్తుకు ప్రమాదమని హెచ్చరించారు. మా నటనను చూడండి తప్ప, మా తప్పులు ఎంచకండి అని హితవుపలికారు. మళ్లీ జన్మంటూ ఉంటే వాణిశ్రీగానే పుడతానని ఆమె తెలిపారు. అనంతరం నిర్వాహకులు ఆమెను డాక్టర్ భానుమతి రామకృష్ణ పురస్కారంతో వాణిశ్రీని సత్కరించారు. ఘంటశాల పురస్కారాన్ని ప్రముఖ గాయని పి.సుశీలకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లవకుశ సినిమా తనకు, మరో గాయని లీలకు గాయనిలుగా ప్రాణం పోసిందన్నారు. 83 మంది హీరోయిన్లకు పాటలు పాడిన ఘనత మీదేనంటూ అభిమానులు ప్రశంసలు కురిపించారని ఆమె గుర్తుచేసుకున్నారు. జగమే రామమయం అనే శ్లోకాన్ని, సోగ్గాడే చిన్నినానయన పాటను పాడి వినిపించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో మంది కొత్త గాయకులను తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమానికి జిల్లా జడ్జి ఎంజె.ప్రయదర్శిని అధ్యక్షత వహించారు. హైకోర్టు జడ్జి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాణిశ్రీ, సుశీలను సత్కరించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ పోతుల సునీత, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎల్.సునీల్‌కుమార్‌రెడ్డి , ఘంటశాల నేషనల్‌ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు టి.విజయకాంత్, కలెక్టర్ వినయ్‌చంద్ తల్లి గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురిని పురస్కారాలతో సత్కరించారు. -
పదం పలికింది – పాట నిలిచింది
చిరుగాలి తరగలా చిన్నారి పడవలా సినిమా పాటకు ఒక గౌరవప్రదమైన స్థాయిని కల్పించిన కవుల్లో మేటి, దేవులపల్లి కృష్ణశాస్త్రి. 1951లో విడుదలై, మునుముందు ఆణిముత్యంగా నిలువబోయే ‘మల్లీశ్వరి’ చిత్రం కోసం కృష్ణశాస్త్రే అన్ని పాటలూ రాయాలని కోరుకున్నారు దర్శకుడు బి.ఎన్.రెడ్డి. నిదానంగానే అయినా ‘ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు’, ‘మనసున మల్లెల మాలలూగెనే’ లాంటి గొప్ప పాటలు రాశారు దేవులపల్లి. అందులోని, ‘ఎందుకే నీకింత తొందర/ ఇన్నాళ్ల చెరసాల ఈ రేయి తీరునే’ పాటలోని చివరి పాదాలైన ‘చిరుగాలి తరగలా చిన్నారి పడవలా/ పసరు రెక్కలు పరచి పరువెత్తి పోదాము’ గొప్ప ఊహాశాలీనతకు నిదర్శనం. సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చిన ఈ గీతాన్ని చిత్ర నాయిక భానుమతే పాడారు. తెరపై భానుమతితో పాటు టి.జి.కమలాదేవి కూడా కనిపిస్తారు. గ్రేట్ రైటర్ ఫ్యోదర్ దోస్తోవ్స్కీ ప్రపంచ సాహిత్యంలో ఒక గొప్ప సైకాలజిస్టుగా ఫ్యోదర్ దోస్తోవ్స్కీ (1821–1881) కీర్తినొందాడు. మాస్కోలో జన్మించిన దోస్తోవ్స్కీ 19వ శతాబ్దపు రష్యా సంక్లిష్ట రాజకీయ, సాంఘిక, ఆధ్యాత్మిక వాతావరణంలో మనిషి అంతరంగాన్ని అన్వేషించాడు. రచయితే ఏకస్వరంగా (Monologising) రచన అంతటా వినిపించడం కాకుండా, ప్రతి పాత్రా తనదైన భిన్న స్వరాన్ని (్కౌ ypజిౌnజీఛి) కలిగివుండే తరహా నవలా సృష్టికర్త దోస్తోవ్స్కీ అని మిఖాయిల్ బఖ్తిన్ అభివర్ణించాడు. రష్యా చక్రవర్తిని (జార్) విమర్శించే పుస్తకాల గురించి చర్చించిన బృందంలో ఒక సభ్యుడిగా దోస్తోవ్స్కీకి మరణ శిక్ష పడింది. దాని అమలులో భాగంగా, 1849 డిసెంబర్ 23న ఆయన్ని కాల్చిచంపబోయే చివరి నిమిషంలో శిక్షలో మార్పు జరిగింది. అలా సైబీరియాలో నాలుగేళ్ల కఠిన కారాగారశిక్ష అనుభవించాడు. ఆ తర్వాతే దోస్తోవ్స్కీ అనగానే గుర్తొచ్చే ‘నోట్స్ ఫ్రమ్ అండర్‌గ్రౌండ్’, ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’, ‘ది ఇడియట్’, ‘ద బ్రదర్స్ కరమ్‌జోవ్’, ‘డీమన్స్’ లాంటి సుప్రసిద్ధ రచనలు వెలువరించాడు. ఆ శిక్షలో మార్పు జరగకపోయివుంటే! -
మహాశక్తి
ఎవరైనా నాకే భయపడాలి తప్ప నేనెవరికీ భయపడను. అయినా ఎందుకు భయపడాలి? అంత అవసరం లేదు. ఎందుకంటే నాకు ప్రతిభ ఉంది. అది నాకు దేవుడిచ్చిన వరం. - ఓ ఇంటర్వ్యూలో భానుమతీ రామకృష్ణ ‘ఓహోహో... పావురమా’... 1945లో ఆడవాళ్లు ఇళ్లలో నుంచి రావడానికే జంకే రోజులలో సినిమాల్లో ప్రవేశించి స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి వెండితెర మీద నాగయ్యను కవ్వించింది ఆమే. ‘పరుగులు తీయాలి... గిత్తలు ఉరకలు వేయాలి’... ఎన్టీఆర్‌తో ఎడ్ల బండి మీద పరుగులు తీసింది ఆమే. చల్లని రాత్రి వేళ ఏ.ఎన్.ఆర్ని నిద్ర పుచ్చుతూ ‘మెల్లమెల్లగా చల్లచల్లగా’ పాట పాడిందీ ఆమే. పుట్టింది ఒంగోలు. చేరింది చెన్నపట్నం. సినీ రంగంలో మగవారికి సవాల్‌గా నిలిచిన శక్తి స్వరూపం. వాళ్లది ఏముంది? కొందరికి పాడటం మాత్రం వచ్చు. భానుమతి పాడగలదు. కొందరికి ఆడటం మాత్రమే వచ్చు. భానుమతి ఆడగలదు. మరికొందరికి బాగా నటించడమే వచ్చు. భానుమతి వారి కంటే బాగా నటించగలదు. కొందరు దర్శకత్వం మాత్రమే చేయగలరు. భానుమతికి రాకపోతే కదా. కొందరు నిర్మాతలుగా మాత్రమే ఉండి కాసులు లెక్కపెట్టగలరు. భానుమతి నిర్మాతలకే నిర్మాత. స్టుడియోలు మగాళ్ల సొత్తు. భానుమతి స్టూడియో భరణి నక్షత్రంలా వెలిగింది. కొందరు కింగ్ మేకర్లు కావచ్చు. కాని భానుమతిని మించిన కింగ్ మేకర్ ఎవరు? సౌతిండియా సూపర్ స్టార్. హిందీకి చండీరాణి. ఆమె చేసిన ప్రయోగాలు ఎవరు చేశారు? వర విక్రయాన్ని, చింతామణిని, నల దమయంతిని ఎవరు చూపారు?ఇంతటి శక్తి ఒక స్త్రీకి ఉండటం ఇంతటి ప్రతిభను నిలబెట్టుకోవడం ఇంతటి స్ఫూర్తి ఆమె మిగిల్చి వెళ్లటం నాలుగైదు సీక్వెల్స్‌గా తీయగలిగిన ఘనచరిత్ర. ‘చక్రపాణి’, ‘విప్రనారాయణ’, ‘బాటసారి’, ‘మల్లీశ్వరి’, ‘బొబ్బిలి యుద్ధం’... ఒక ఆర్టిస్ట్‌కు అన్ని క్లాసిక్స్ దొరకడం అద్భుతం. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక కూడా ఆమె నటన ప్రేక్షకులకు ‘మట్టిలో మాణిక్యం’గా తోచింది. ‘మంగమ్మగారి మనవడు’లో మంగమ్మకు దిష్టి తీసి గుమ్మడికాయలు కొట్టేలా చేసింది. తను వెలుగుతూ సాటి నటులను వెలిగించేవాళ్లు ఉంటారు- సావిత్రిలా. కాని భానుమతి స్కూల్ అది కాదు. తను తినేస్తుంది. మిగిలినవాళ్లు తమను తాము కాపాడుకోవాలి... అది ఎన్టీఆర్ అయినా ఏఎన్నార్ అయినా. మగవారిలో ఆ వైభోగం ఒకరికే దక్కింది- ఎస్.వి.రంగారావుకి. భానుమతి గొంతు వెంటనే నచ్చేసేది కాదు. అది ‘తినగ తినగ వేము తియ్యనుండు’. వినాలి ఓపిగ్గా. శాంతంగా. అప్పుడు రుచి తెలుస్తుంది. ‘మనసున మల్లెల మాలలూగెనె’..., ‘ఎందుకే నీకింత తొందర’..., ‘పిలచిన బిగువటరా’..., వివాహ బంధంలో ఎన్టీఆర్‌కు పి.బి.శ్రీనివాస్ గొంతివ్వగా నీళ్ల మీద తేలుతూ భానుమతి పాడిన డ్యూయెట్ ‘నీటిలోన నింగిలోన నీవె ఉన్నావులే’.. దోర మామిడి పండు. ఆమె భక్తి గీతాలలో భక్తులకు ఉండే అహం ఉంటుంది. అది దేవుడికి ఎంతో నచ్చుతుంది. ‘శ్రీకర కరుణాలవాల వేణుగోపాల’... ‘శరణం నీ దివ్యచరణం’... ‘శ్రీ సూర్యనారాయణ మేలుకో’... ప్రభాత గీతాలు. ‘నగుమోము’.. మహామహులు పాడారు. వివాహబంధంలో భానుమతి కూడా ఆ త్యాగయ్య పదాన్ని అద్భుతంగా ఆలపించి ఆ వాగ్గేయకారుని పాదాల దగ్గర తన స్వరమాలను అలంకరించారు.భానుమతి రచయిత్రి. నటిగా ఎంత ఈజ్ ఉంటుందో రచనలో కూడా అంతే ఈజ్ ఉంటుంది. పొగరుబోతులందరికీ హాస్యం అంటే ఇష్టం. భానుమతికి కూడా. హాయిగా నవ్వేవాళ్లందరూ ఎంత వయసొచ్చినా పసిపిల్లలే. తల ఒంచి బతకలేదు. తన నిలువెత్తు అంతస్తును ఎట్టి పరిస్థితులలోనూ కుదించుకోలేదు. ఓవర్సీస్ కలెక్షన్లు... వంద కోట్ల క్లబ్బులు నేటి హీరోయిన్లకు కొలమానం అయితే వాళ్లంతా భానుమతిని చేరాలంటే ఒక కాంతి సంవత్సరం పడుతుంది. భానుమతి సాధించింది సాధించాలంటే ఒకరి భుజాల మీద మరొకరుగా వంద మంది నిలుచోవాల్సి వస్తుంది. కొన్ని రిపీట్ కావు. భానుమతీ అంతే. కొందరికి పాడటం మాత్రం వచ్చు. భాను మతి పాడగలదు. కొందరికి ఆడటం మాత్రమే వచ్చు. భానుమతి ఆడగలదు. మరికొందరికి బాగా నటించడమే వచ్చు. భానుమతి వారి కంటే బాగా నటించగలదు. - నెటిజన్ కిశోర్