నాడోడిగళ్‌ సీక్వెల్‌ మొదలైంది! | Nadodigal 2 shooting begins | Sakshi
Sakshi News home page

నాడోడిగళ్‌ సీక్వెల్‌ మొదలైంది!

Jan 28 2018 5:34 AM | Updated on Jan 28 2018 5:34 AM

Nadodigal 2 shooting begins - Sakshi

నాడోడిగళ్‌ సీక్వెల్‌ చిత్ర ప్రారంభ దృశ్యం

తమిళసినిమా: నాడోడిగళ్‌ సీక్వెల్‌ చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం మొదలైంది. తొమ్మిదేళ్ల క్రితం తెరపైకి వచ్చిన చిత్రం నాడోడిగళ్‌. ఆ చిత్రం దర్శకుడు సముద్రకని, నటి అనన్య, అభినయ వంటి వారికి గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతే కాదు కమర్శియల్‌గానూ మంచి విజయాన్ని సాధించింది. తాజాగా అదే సముద్రకని, శశికుమార్‌ల కాంబినేషన్‌లో నాడోడిగళ్‌ సీక్వెల్‌ చిత్రం తెరకెక్కుతోంది. అయితే తొలి భాగంలో నటించిన శశికుమార్, భరణి, నమోనారాయణ మాత్రమే సీక్వెల్‌లో నటిస్తున్నారు. హీరోయిన్లుగా అంజలి, అతుల్య నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఎంఎస్‌.భాస్కర్, జ్ఞానసంబంధం, తులసి, శ్రీరంజని, సూపర్‌సుబ్బరాయన్‌ నటిస్తున్నారు.

మరి కొంతమంది నటీనటుల ఎంపిక జరుగుతోందని చిత్ర వర్గాలు తెలిపారు. మెడ్రాస్‌ ఎంటర్‌ప్రైజస్‌ పతాకంపై ఎస్‌.నందగోపాల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకాంబరం ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ తిరువళ్లూర్‌ సమీపంలోని ఒక గ్రామంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రేమను కాపాడే స్నేహితుల ఇతివృత్తంగా నాడోడిగళ్‌ చిత్రం రూపొందగా ఈ సీక్వెల్‌లో ఆ అంశంతో పాటు పలు విషయాలు చోటుచేసుకుంటాయని చిత్ర వర్గాలు ఈ సందర్భంగా తెలిపారు. తొమ్మిదేళ్లనాటికి, ఇప్పుటికీ  సమాజంలో చాలా మార్పులు జరిగాయని, అలాంటి వన్నీ ఈ చిత్రంలో పొందుపరచనున్నట్లు తెలిపారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో శశికుమార్, అంజలి, అతుల్య చిత్ర యూనిట్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement