నా కథను నేను చూసుకోవడం నా అదృష్టం | Mallesham Movie Trailer launch | Sakshi
Sakshi News home page

నా కథను నేను చూసుకోవడం నా అదృష్టం

May 31 2019 3:09 AM | Updated on May 31 2019 3:09 AM

Mallesham Movie Trailer launch - Sakshi

తరుణ్‌ భాస్కర్, సందీప్‌ కిషన్, ప్రియదర్శి, చింతకింది మల్లేశం, రాజ్, అనన్య, గోరెటి వెంకన్న, ఝాన్సీ

‘‘ఒకరోజు రాజ్‌గారు ఫోన్‌ చేసి యూ ట్యూబ్‌లో మీరు మాట్లాడింది చూశాను. దానిపై సినిమా తీయాలనుకుంటున్నాను అన్నారు. రెండున్నరేళ్లు కష్టపడి ‘మల్లేశం’  కథను సిద్ధం చేసుకుని, సినిమా తీశారు’’ అని పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం అన్నారు. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మల్లేశం’. ప్రియదర్శి లీడ్‌ రోల్‌ చేశారు. రాజ్‌. ఆర్‌ దర్శకత్వంలో రాజ్‌.ఆర్, శ్రీఅధికారి నిర్మించారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో జూన్‌ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

చింతకింది మల్లేశం మాట్లాడుతూ– ‘‘ప్రపంచానికి మల్లేశం గురించి చెప్పాలనే రాజ్‌గారి సంకల్పం నేరవేరింది. సినిమా చూశాను, ప్రియదర్శిగారు అద్భుతంగా నటించారు. సినిమా చూస్తున్నప్పుడు ఓసారి కళ్లలో నీళ్లు కూడా తిరిగాయి. నా కథను నేను తెరపై చూసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. రాజ్‌.ఆర్‌ మాట్లాడుతూ– ‘‘ఇది ఆర్ట్‌ ఫిల్మ్‌ కాదు. కమర్షియల్‌ మూవీ. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ, నానీలను హీరోలుగా అనుకున్నాను. కానీ డేట్స్‌ సమస్య రావడంతో ప్రియదర్శిని తీసుకున్నాం.

తరుణ్‌ భాస్కర్‌ను ఈ సినిమాను డైరెక్ట్‌ చేయమని అడిగాను కానీ కుదరలేదు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆరో తరగతి డ్రాప్‌ అవుట్‌ అయినా ‘పద్మశ్రీ’ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగిన మల్లేశంగారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. నాకు సహకరించిన ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వెంకట్‌ సిద్ధారెడ్డిగారికి, ఆర్ట్‌ డైరెక్టర్‌ లక్ష్మణ్‌ ఏలే, మహేష్‌లకు థాంక్స్‌’’ అన్నారు. ‘పల్లెసృజన’ నిర్వాహకులు గణేశం, శ్రీ అధికారి, గాయకుడు గోరెటి వెంకన్న, సంగీత దర్శకుడు మార్క్‌ కె.రాబిన్స్, దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement