మాకు హ్యాట్రిక్‌ మూవీ అవుతుందనుకుంటున్నా

Lisaa Movie Pre Release Event - Sakshi

– సురేశ్‌ కొండేటి

‘‘లీసా’ నాకు చాలా ఇంపార్టెంట్‌ మూవీ. హారర్‌ను త్రీడీలో ట్రై చేశాం. 2డీలో తీసి 3డీలోకి మార్చకుండా మొత్తం 3డీలోనే షూట్‌ చేశాం. వండర్‌ఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. మా సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అని అంజలి అన్నారు. అంజలి ప్రధాన పాత్రలో రాజు విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లిసా’. ఈ చిత్రాన్ని సురేశ్‌ కొండేటి తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో శివాజీరాజా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ – ‘‘తెలుగు అమ్మాయి అంజలి పక్క రాష్ట్రం వెళ్లి అక్కడ సక్సెస్‌ కావడం చాలా సంతోషం. తను తెలుగులోనూ బాగా బిజీ అవ్వాలి. సురేశ్‌ కొండేటి కష్టాన్ని నేను దగ్గర నుంచి చూశాను. పత్రికాధినేత నుంచి నిర్మాతగా అతను ఏది చేసినా సక్సెసే’’ అన్నారు.

‘‘ఇది కేవలం పిల్లలు మాత్రమే కాదు ఫ్యామిలీలు కూడా ఎంజాయ్‌ చేసేలా ఉంది’’ అన్నారు దర్శకుడు ముప్పలనేని శివ. ‘‘3డీ సినిమాలకు నేను పెద్ద అభిమానిని. ట్రైలర్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంది’’ అన్నారు రచయిత జేకే భారవి. ‘‘షాపింగ్‌ మాల్, జర్నీ’ సినిమాలు నా కెరీర్‌లో మంచి హిట్స్‌గా నిలిచాయి. అంజలి మంచి ఆర్టిస్ట్‌. ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా సక్సెస్‌ చేస్తారనుకుంటున్నాను. షాపింగ్‌ మాల్, జర్నీ తర్వాత అంజలి, నా కాంబినేషన్‌లో ఇది హ్యాట్రిక్‌ మూవీ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు సురేశ్‌ కొండేటి. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌ చంద్రహాస్‌ ఇప్పలపల్లి, కాసాని వీరేశ్, నటుడు భద్రం, దర్శకుడు రాజు విశ్వనాథ్‌ మాట్లాడారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top