ప్రేక్షకులు ఆమోదిస్తేనే స్టార్స్‌ అవుతారు

Krishna And His Leela Movie Release In OTT Platform - Sakshi

రానా దగ్గుబాటి సమర్పణలో వయాకామ్‌ 1 మీడియాతో కలిసి సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, షాలినీ వడ్నికట్టి, సీరత్‌ కపూర్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా సురేశ్‌బాబు సోమవారం మీడియాతో చెప్పిన విశేషాలు. 

► ఈ సినిమా ఆహా చానల్‌లో కూడా జూలై 4 నుండి ప్రసారం అవుతుంది. నిజానికి ఈ సినిమా కథను రానా ఓకే చేయగానే ‘ఏంటిరా... ఇలాంటి కథని ఎలా ఓకే చేశావు’ అని అడిగాను. ‘ప్రస్తుతం నా ఫ్రెండ్స్‌లో చాలామంది సేమ్‌ సిట్యువేషన్‌ ఫేస్‌ చేస్తున్నారు’ అన్నాడు. వాళ్ల అమ్మ కూడా ‘ఏంటిరా ఈ సినిమా’ అని రానాని తిట్టింది (నవ్వుతూ). సమాజంలో ప్రస్తుతం ఇలానే జరుగుతుందమ్మా అన్నాడు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నదే ఈ సినిమాలో ఉంది. 
► ప్రస్తుతానికి మా బ్యానర్‌లో రవిబాబు దర్శకత్వంలో ‘క్రష్‌’ సినిమా నిర్మిస్తున్నాం. ఓ నాలుగు పాటలు మాత్రమే బ్యాలెన్స్‌ షూట్‌ ఉంది. అది 25 మందితో షూట్‌ చేయటానికి రవిబాబు ప్లాన్‌ చేస్తున్నారు. అందుకని ఈ సినిమాని పూర్తి చేసేస్తాం. ‘నారప్ప’, ‘విరాటపర్వం’ సినిమాల షూటింగ్‌ ఇప్పట్లో మొదలుపెట్టం. ఆ సినిమాలకు సంబంధించి చాలా పెద్ద ఫైట్‌ సీక్వెన్స్‌లు చేయాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని నలభై. యాభై మందితో చేయలేం. ‘హిరణ్యకశ్యప’ మూవీని చాలా పెద్ద స్కేల్లో చేస్తాం. 
► ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ మొదట డెవలప్‌ అయింది ఇతర దేశాల్లోనే. అక్కడ వాళ్లకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ అంటూ ఏమీ ఉండదు. అందుకే వాళ్లు 18ప్లస్, 13ప్లస్‌ అని రాస్తారు. అక్కడనుండి దిగుమతి అయిన కల్చర్‌ కావటంతో అవి అలానే బోల్డ్‌ కంటెంట్‌ రూపంలో వస్తున్నాయి. చూడాలి.. ఫ్యూచర్‌లో ఎలాంటి చట్టాలు వస్తాయో.  
► రానా పెళ్లి పనుల గురించి చెప్పాలంటే.. మామూలు టైమ్‌లో అయితే ఈపాటికి కార్డులు పంచేవాళ్లం. షాపింగ్, పెళ్లి పనులు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం ఎంతమందితో చేసుకోమంటే అంతమందితో చేసుకోవాలి. అందుకే పెద్ద పనులేమీ లేవు. అభిరామ్‌ యాక్టర్‌ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. కొన్ని కథలు కూడా తయారవుతున్నాయి. తెలిసిన వాళ్ల పిల్లలకైనా, మన పిల్లలకైనా,  ఎవరికైనా మొదట్లో కొంచెం పుష్‌ ఇస్తాం కానీ, వాడిని హీరోగా ఒప్పుకోవలసింది, స్క్రీన్‌ మీద చూసేది ప్రేక్షకులే. 
► నెపోటిజమ్‌ టాపిక్‌ను సమర్థించను, విమర్శించను. కారణం ఏంటంటే ఎంతోమంది దర్శకుల, నిర్మాతల, హీరోల పిల్లలు ఈ ఇండస్ట్రీలోకి వచ్చి నిరూపించుకోలేకపోయారు. స్టార్స్‌ ఇళ్లల్లోనుండి పుట్టరు, ఆడియన్స్‌ ఆమోదంతో స్టార్స్‌ అవుతారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటుడిగా చాలా సాధించాడు. స్టార్‌ నుండి సూపర్‌ స్టార్‌గా మారే దశలో ఉన్నవాడు ఆత్మహత్య చేసుకోవడం బాధ అనిపించింది. ఉదాహరణకు మన హీరోలనే తీసుకోండి. రవితేజ, నాని, రాజ్‌ తరుణ్‌.. ఇలా ఎంతోమంది వచ్చారు. అందరి హీరోలకు గుడ్‌టైమ్, బ్యాడ్‌టైమ్‌ అనేది ఉంటుంది. నేను చెన్నైలో ఉన్నప్పుడు క్రికెట్‌ చాలా బాగా ఆడేవాణ్ని. అప్పుడు నన్ను టీమ్‌లో సెలక్ట్‌ చేయలేదు. అప్పుడు నేను డిప్రెషన్‌ ఫీలయితే ఎలా? ఏదేమైనా మనం ట్రై చేస్తూనే ఉండాలి. అదే జీవితం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top