ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడానికి ఇష్టపడతాను

Kanulu Kanulanu Dochayante Movie Press Meet - Sakshi

‘‘కథ నచ్చితే ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు చేయడానికి ముందుంటాను. ప్రస్తుతం నేను పని చేస్తున్న (మలయాళం, హిందీ, తెలుగు, తమిళం) ఇండస్ట్రీలన్నీ నాకెంతో ప్రేమను ఇస్తున్నాయి. మంచి మంచి అవకాశాలు ఇస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌. ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్‌ పాత్రలో దుల్కర్‌ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. దుల్కర్, రీతూ వర్మ జంటగా నూతన దర్శకుడు దేసింగ్‌ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’.

ఆంటోనీ జోసెఫ్‌ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ విడుదల కానుంది. ఈ సందర్భంగా దుల్కర్‌ మాట్లాడుతూ – ‘‘కనులు కనులను దోచాయంటే’ కథను మొదటిసారి విన్నప్పుడే ఈ సినిమా తెలుగులో కూడా చేయొచ్చు అనిపించింది.  తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. బాగానే వచ్చింది అనుకుంటున్నాను (నవ్వుతూ). ఇందులో తెలుగమ్మాయి రీతూ వర్మ హీరోయిన్‌గా చేసింది. దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ కీలక పాత్రలో నటించారు. ఇది రొమాంటిక్‌ థ్రిల్లర్‌. సినిమా ఫుల్‌ స్పీడ్‌గా పరిగెడుతుంటుంది. ఇలాంటి స్టయిల్లో నేను సినిమా చేయలేదు. ప్రతీ సినిమాతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడానికి ఇష్టపడుతుంటాను.

ప్రస్తుతం మలయాళం, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేయడంతో ఏ ఇండస్ట్రీకి వెళ్లినా మా భాషలో ఎక్కువ సినిమాలు చేయడం లేదేంటి అని అడుగుతున్నారు. అన్ని ఇండస్ట్రీలను బ్యాలెన్స్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. భాష నా ప్రధాన సమస్య. భాష తెలియకపోతే పాత్రకు పూర్తి న్యాయం జరగదని నమ్ముతాను. గత ఏడాది నేను నటించిన 2–3 సినిమాలు విడుదల ఆలస్యం అయ్యాయి. ఆ టైంలో నిర్మాతనయ్యి మూడు సినిమాలు నిర్మించాను. రీమేక్‌ సినిమాలు, సీక్వెల్‌ సినిమాలు చేయడానికి పెద్దగా ఇష్టపడను. ఏదైనా కొత్తగా, ఎగ్జయిటింగ్‌గా చెప్పాలనుకుంటాను. తెలుగులో ఓ సినిమా అంగీకరించాను. త్వరలోనే ప్రారంభం అవుతుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top