కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు? | Kangana Ranaut Demand 20 Crore For Tamil Movie | Sakshi
Sakshi News home page

కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు?

Sep 15 2019 8:31 AM | Updated on Sep 15 2019 8:31 AM

Kangana Ranaut Demand 20 Crore For Tamil Movie - Sakshi

చెన్నై: సినీ పరిశ్రమ క్లిష్ట పరిస్థితుల్లో ఉందనే మాట పదేపదే వినిపిస్తోంది. అయితే మరో పక్క హీరోల పారితోషకాలు చుక్కల్ని చూపిస్తున్నాయన్న ఆరోపణలు, నిర్మాతల ఆవేదనలు వింటున్నాం. ఇక నటీమణులు తక్కువేం కాదు. వారూ కోట్లనే డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు దక్షిణాదిలో అగ్రనటిగా రాణిస్తున్న నయనతార రూ.6 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు సినీవర్గాల టాక్‌. ఆగండాగండి దీనికే అబ్బా అని ఆశ్చర్యపోకండి. బాలీవుడ్‌ సంచలన నటి కంగనారనౌత్‌ ఏకంగా రూ.20 కోట్లు పారితోషికాన్ని డిమాండ్‌ చేస్తోందనే వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. నయనతార పారితోషికానికే అబ్బా అంటే కంగనారనౌత్‌ డిమాండ్‌కు ఏమంటారు? ఏందబ్బా అంటారా? ఇంతకీ కంగన ఏ చిత్రానికి అంత పారితోషికాన్ని డిమాండ్‌ చేస్తుందో తెలుసా? ఇంకే చిత్రం తమిళ ప్రజల అమ్మ, రాజకీయనాయకుల తలైవి, నాటి మేటి నటి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ కోసమే. జయలలిత బయోపిక్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆమె జీవిత చరిత్రను తెరకెక్కించడానికి నలుగురైదుగురు సిద్ధమయ్యారు. వారిలో నూతన దర్శకురాలు ప్రియదర్శిని ది ఐరన్‌ లేడీ పేరుతో చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అమ్మగా నటి నిత్యామీనన్‌ అభినయించడానికి సిద్ధం అవుతోంది.

మరో దర్శకుడు విజయ్‌ తలైవి పేరుతో చిత్రం చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో ఆయన జయలలిత పాత్రకు బాలీవుడ్‌ సంచలన నటి కంగనారనౌత్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇక దర్శకుడు గౌతమ్‌మీనన్‌ క్వీన్‌ పేరుతో వెబ్‌ సిరీస్‌ సైలెంట్‌గా రూపొందించేశారు. ఇందులో రమ్యకృష్ణ జయలలితగా నటించారు. దీని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. అయితే దీనికి జయలలిత సోదరుడి కొడుకు దీపక్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇక అసలు విషయం ఏమిటంటే దర్శకురాలు ప్రియదర్శిని తెరకెక్కించనున్న ది ఐరన్‌ లేడీ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసేశారు. దర్శకుడు విజయ్‌ తెరకెక్కించనున్న తలైవి చిత్రం గురించే ఇప్పుడు రకరకాల వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కారణం ఈ చిత్రం ఇంకా ప్రారంభం కాకపోవడం, కనీసం ఫస్ట్‌లుక్‌ లాంటివి కూడా విడుదల చేయకపోవడమే. మరో విషయం ఏమిటంటే తలైవి చిత్ర షూటింగ్‌ వాయిదా పడిందని, అందుకు కారణం ఆర్థికపరమైన సమస్యలేననే ప్రచారం ఒక పక్క జరుగుతోంది.

ఇక మరో వర్గం ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున రూ.55 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కనుందని టాక్‌. దీంతో ఇందులో జయలలిత పాత్రను పోషించనున్న నటి కంగనారనౌత్‌ తన పారితోషికాన్ని రూ.20 కోట్లు డిమాండ్‌ చేస్తోందని, చిత్ర షూటింగ్‌ ప్రారంభానికి ఇదీ ఒక కారణం అని ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి వార్తలను చిత్ర నిర్మాత విష్ణు ఇంటూరి కొట్టి పారేశారు. ఆయన ట్విట్టర్‌లో పేర్కొంటూ తలైవి చిత్రంలో కంగనారనౌత్‌ వివిధ వయసుల్లో నాలుగు గెటప్‌లలో కనిపించనున్నారని, అందుకు హాలీవుడ్‌ మేకప్‌మెన్‌ జసన్‌ కాలిన్స్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. అదే విధంగా చిత్ర షూటింగ్‌ను దీపావళి పండగ తరువాత ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే నటి కంగనారనౌత్‌ పారితోషికం గురించి మాత్రం స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement