చంద్రహాసన్‌ కన్నుమూత

చంద్రహాసన్‌ కన్నుమూత - Sakshi


పెరంబూర్‌: నటుడు కమలహాసన్‌ రెండవ అన్నయ్య నిర్మాత చంద్రహాసన్‌ శనివారం రాత్రి లండన్‌లో గుండెపోటుతో మరణించారు.ఈయన వయసు 82ఏళ్లు. కమలహాసన్‌ చిత్ర నిర్మాణ రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌లో చంద్రహాసన్‌ భాగస్వామి అన్నది గమనార్హం.



ఈ సంస్థలో కమలహాసన్‌ కథానాయకుడిగా నటించిన అపూర్వసహోదర్‌గళ్, హేరామ్, విరుమాండి, ముంబై ఎక్స్‌ప్రెస్‌ చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించారు.చిత్ర నిర్మాణ వ్యవహారాలన్ని చంద్రహాసనే చూసుకునేవారు. విశ్వరూపం చిత్ర విడుదలకు సమస్యలు తలెత్తినప్పుడు తీవ్ర మనస్తాపానికి గురైన కమలహాసన్‌ దేశం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు చంద్రహాసనే ఈయనకు భరోసా ఇచ్చి ఆ నిర్ణయాన్ని మార్చుకునేలా చేశారన్నది సినీవర్గాల మాట.ఆయన భార్య గీతామణి గత జనవరి ఐదవ తేదీన ఆనారోగ్యం కారణంగా కన్నుమూశారు.



 చంద్రహాసన్‌ కొంత కాలంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో లండన్‌లో ఉన్న తన కూతురు అనుహాసన్‌ వద్ద ఉంటూ అక్కడ చికిత్స పొందుతూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం రాత్రి అనూహ్యంగా గుండెపోటుకు గురై చంద్రహాసన్‌ మరణించారు. చంద్రహాసన్‌ మృతి చిత్రపరిశ్రమ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం చంద్రహాసన్‌ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేసింది.



బాల్యం నుంచి కమల్‌కు మార్గదర్శిగా ఇప్పటి వరకూ ఆయన ఉన్నతిలో పాలు పంచుకున్న చంద్రహాసన్‌ కమల్‌కు ఒక సోదరుడిగా కాకుండా తం డ్రిలా నిలిచారని దక్షిణ భారత నటీనటుల సం ఘం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రహసన్‌ అంత్యక్రియలు లండన్‌లో నిర్వహిద్దామా? లేక చెన్నైకి భౌతికకాయాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిర్వహిద్దామా అన్నది ఆయన కుటుంబ సభ్యులు చర్చిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top