ప్రముఖ నటుడు రజనీకాంత్‌ని డైరెక్ట్ చేసే భలే చాన్స్ అందుకున్నారు యువ దర్శకుడు శిబి చక్రవర్తి. రజనీకాంత్ నటించనున్న 173వ చిత్రం గురించి ఇటీవల పలు వార్తలు ప్రచారం అయిన విషయం తెలిసిందే. నటుడు కమల్‌హాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ మూవీకి సుందర్. సి దర్శకత్వం వహించనున్నట్లు తొలుత ప్రకటన వెలువడింది. కమల్‌హాసన్, రజనీకాంత్‌తో సుందర్.సి కలిసి ఉన్న ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రం నుంచి సందర్ వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.
ఆ తర్వాత ఈ మూవీకి ‘డ్రాగన్ ’ ఫేమ్ అశ్వద్ మారిముత్తు దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు శిబి చక్రవర్తి తెరపైకి వచ్చారు. శివ కార్తికేయన్ హీరోగా ‘డాక్టర్, డాన్ ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. నిజానికి ఇంతకుముందే రజనీ కోసం ఓ మంచి కథను సిద్ధం చేశారు దర్శకుడు. కాగా రజనీకాంత్ చిత్రానికి శిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు కమల్‌హాసన్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాని 2027 పొంగల్‌కి విడుదల చేస్తామని కమల్ పేర్కొన్నారు. – సాక్షి సినిమా, చెన్నై


